Telugu Global
Sports

రోహిత్, ద్రావిడ్ లకు ఉద్వాసన తప్పదా?

ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్స్ ఓటమితో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి పదవులకూ గండం పొంచిఉందంటూ ప్రచారం సాగుతోంది.

రోహిత్, ద్రావిడ్ లకు ఉద్వాసన తప్పదా?
X

రోహిత్, ద్రావిడ్ లకు ఉద్వాసన తప్పదా?

ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్స్ ఓటమితో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి పదవులకూ గండం పొంచిఉందంటూ ప్రచారం సాగుతోంది....

భారత క్రికెట్ జట్టు ఓ ప్రపంచ టైటిల్ నెగ్గి పదేళ్లయ్యింది.గత దశాబ్దకాలంగా ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచ్ లు మారినా భారత్ తలరాత ఏమాత్రం మారలేదు. విరాట్ కొహ్లీ కెప్టెన్ గా, రవిశాస్త్రి ప్రధాన శిక్షకుడుగా ఉన్న సమయంలో కొనసాగిన వైఫల్యాలే..రోహిత్ శర్మ సారథిగా, రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గానూ కొనసాగుతున్నాయి.

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలో భారత్ 209 పరుగుల ఘోరపరాజయం చవిచూడటంతో భారత టీమ్ మేనేజ్ మెంట్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

కోచ్ గా ద్రావిడ్, కెప్టెన్ గా రోహిత్ శర్మ విఫలమయ్యారని, ఆ ఇద్దరినీ పదవుల నుంచి తొలగించాలని, సాధ్యమైనంత త్వరగా ఉద్వాసన పలకాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది.

అది చేయాల్సింది సెలెక్టర్లు, సోషల్ మీడియా కాదు....

అయితే..భారత కెప్టెన్, కోచ్ లను పదవుల నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ తప్పుపట్టారు.

జాతీయ జట్టు కెపెన్, కోచ్ లను పదవుల నుంచి తొలగించేది లేనిదీ నిర్ణయించాల్సిది సెలెక్టర్లు మాత్రమేకానీ..సోషల్ మీడియా ఏమాత్రం కాదని సౌరవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ ను కట్టిపెట్టాలని సూచించారు. సోషల్ మీడియా ట్రోల్స్ తో బీసీసీఐ నిర్ణయాలను ప్రభావితం చేయజాలరని, టీమ్ మేనేజ్ మెంట్లో మార్పులు చేర్పులు చేయాల్సింది బోర్డు ఎంపిక సంఘం మాత్రమేనన్న వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.

విరాట్ వద్దంటే..రోహిత్ కు కెప్టెన్సీ...

రెండేళ్లక్రితం తనకు భారతజట్టు కెప్టెన్సీ వద్దే వద్దంటూ విరాట్ కొహ్లీ అడ్డం తిరిగాడని, గత్యంతరం లేని స్థితిలో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పచెప్పినట్లు దాదా గుర్తు చేశారు. భారతజట్టు ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్స్ వరకూ వచ్చిన వాస్తవాన్ని అందరూ గుర్తించాలని, తన వరకూ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ను మించినవారు ప్రస్తుతం వేరెవ్వరూ లేరని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. భారత్ వేదికగా త్వరలో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ వరకూ రోహిత్, ద్రావిడ్ తమతమ పదవుల్లో కొనసాగటం ఖాయమని తేల్చి చెప్పారు.

రోహిత్ మనసులో ఏముందో?

రోహిత్ మనసులో ఏముందో ఎవరికి తెలుసని సౌరవ్ ప్రశ్నించాడు. ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్ గా రోహిత్ కొనసాగేదీ లేనిదీ తేలిపోతుందని..అప్పటి వరకూ వేచిచూడక తప్పదని అన్నారు. మరోవైపు.. ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్ మ్యాచ్ కు తాము ఆశించిన స్థాయిలో సన్నద్ధంకాలేకపోయామని, కనీసం మూడువారాల సమయం అవసరమని..అయితే తమకు దక్కింది ఏడురోజులు సమయం మాత్రమేనని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ గుర్తు చేశాడు.

ఎవరు ఏమన్నా..భారత ఈ దుస్థితికి, వైఫల్యాలకు..కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మాత్రమే కారణమన్న వాస్తవం విశ్లేషకులు, విమర్శకులు, అభిమానులతో సహా అందరికీ తెలుసు.

ఐపీఎల్ లో ఏడువారాలపాటు పాల్గొని తీవ్రంగా అలసిపోయిన భారత ఆటగాళ్లకు..ప్రపంచ టెస్టు లీగ్ కు ముందు కనీస విశ్రాంతి దక్కలేదు. మే 30న ఐపీఎల్ మ్యాచ్ ముగించుకొన్న భారత ఆటగాళ్లు కేవలం రెండురోజుల విరామం లోనే ఇంగ్లండ్ కు బయలు దేరివెళ్లాల్సి వచ్చింది.

ధూమ్ ధామ్ గా సాగిపోయే టీ-20 ఫార్మాట్లో పాల్గొన్న భారత క్రికెటర్లు..జిడ్డాటలా సాగే సాంప్రదాయ టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు సైతం మారటానికి తగిన సమయం లేకపోడం..

టెస్టు లీగ్ ఫైనల్ పరాజయానికి ప్రధానకారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్ ప్రధానమనుకొంటే..ఐసీసీ ప్రపంచ టోర్నీలకు భారత్ నీళ్లు వదులుకోక తప్పదు.

First Published:  14 Jun 2023 9:30 AM GMT
Next Story