Telugu Global
Sports

యూఎస్ ఓపెన్‌లో సీడెడ్లకు షాక్!

2023 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో సీడెడ్ స్టార్లకు చుక్కెదురయ్యింది. 5వ సీడ్ కాస్పర్ రూడ్, 7వ సీడ్ సిటిస్ పాస్ ఇంటిదారి పట్టారు.

యూఎస్ ఓపెన్‌లో సీడెడ్లకు షాక్!
X

అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సీడెడ్ ప్లేయర్లు దూసుకుపోతుంటే.. పురుషుల సింగిల్స్ లో మాత్రం సంచలనాలు నమోదయ్యాయి. ప్రస్తుత 2023 సీజన్‌కే ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోనే 5వ సీడ్ కాస్పర్ రూడ్, 7వ సీడ్ సిటిస్ పాస్‌ల పోరు ముగిసింది.

రూడ్ కు జాంగ్ ఝలక్..

పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో నార్వే ఆటగాడు, 5వ సీడ్ కాస్పర్ రూడ్ ను 5సెట్ల సమరంలో చైనా అన్ సీడెడ్ ఆటగాడు జాంగ్ జీజెన్ సంచలన విజయం సాధించాడు. 3 గంటల 19 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో 67వ ర్యాంకర్ జాంగ్ 4-6, 7-5, 2-6, 6-0, 6-2తో 5వ ర్యాంకర్ కాస్పర్ రూడ్ ను చిత్తుచేశాడు. ప్రపంచ టాప్ -5 ర్యాంక్ ప్లేయర్ పై ఓ చైనా ఆటగాడు సంచలన విజయం సాధించడం ఇదే మొదటిసారి. మూడోరౌండ్లో ఆస్ట్రేలియా ఆటగాడు రింకీ హిజికటాతో జాంగ్ తలపడాల్సి ఉంది.

సిటిస్ పాస్ కు 128వ ర్యాంకర్ దెబ్బ..

మరో రెండోరౌండ్ పోటీలో గ్రీస్‌కు చెందిన 7వ ర్యాంక్ ప్లేయర్ సిటిస్ పాస్ ను స్విట్జర్లాండ్ కు చెందిన 128వ ర్యాంక్ ప్లేయర్ డోమనిక్ స్ట్రైకెర్ 5 సెట్ల సమరంలో అధిగమించాడు. నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో డోమనిక్ స్ట్రైకర్ 7-5, 6-7, 6-7, 7-6, 6-3తో తనకంటే 121 ర్యాంక్ లు ముందున్న సిటిస్ పాస్ పై సంచలన విజయంతో మూడోరౌండ్‌లో అడుగుపెట్టాడు. 4 గంటలపాటు సాగిన ఈ ఐదుసెట్ల సమరంలో మొదటి నాలుగుసెట్లలో రెండుసెట్లు టై బ్రేక్ లో తేలడం విశేషం.

అల్ కరాజ్, జోకో అలవోకగా..

పురుషుల సింగిల్స్ ఇతర రెండోరౌండ్ మ్యాచ్ ల్లో టాప్ ర్యాంకర్ కార్లోస్ అల్ కరాజ్, రెండోసీడ్ నొవాక్ జోకోవిచ్, మూడోసీడ్ డానిల్ మెద్వదేవ్ అలవోక విజయాలు సాధించారు. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టు వేదికగా జరిగిన రెండోరౌండ్ పోరులో ప్రత్యర్థి, జర్మన్ ఆటగాడు డోమనిక్ అస్వస్థతతో ఉపసంహరించుకోడంతో టాప్ సీడ్ అల్ కరాజ్ చెమటోడ్చ కుండానే మూడోరౌండ్ చేరగలిగాడు. తొలిసెట్ ను 6-2తో నెగ్గి, రెండోసెట్లో 3-2తో అల్ కరాజ్ పైచేయి సాధించిన స్థితిలో డోమనిక్ పోటీ నుంచి తప్పుకొన్నాడు. కేవలం 74 నిమిషాలలోనే ముగిసిన మరో రెండోరౌండ్ పోరులో 3వ సీడ్ డానిల్ మెద్వదేవ్ 6-1, 6-1, 6-0తో హంగెరీ ఆటగాడు అట్టిలా బాలాజస్ ను చిత్తు చేశాడు. మూడోరౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టోఫర్ ఓ కానెల్ తో మెద్వదేవ్ పోటీపడతాడు.

ముర్రే 200వ విజయం..

వింబుల్డన్ మాజీ ఛాంపియన్, బ్రిటన్ వెటరన్ యాండీ ముర్రే గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో 200వ విజయం నమోదు చేశాడు. 36 సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

అమెరికన్ ఓపెన్ రెండోరౌండ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు కోరెన్ టిన్ మౌటెట్ ను 6-2, 7-5, 6-3తో ముర్రే వరుస సెట్లలో ఓడించడం ద్వారా 3వ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల సింగిల్స్ లో అత్యధిక విజయాలు సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ మొదటి 10 మందిలో ఒకడిగా ముర్రే నిలిచాడు. చైనాకు చెందిన వూ ఇబింగ్ ఐదుసెట్ల పోరులో సెర్బియా ఆటగాడు దుసాన్ లాజో విచ్ ను 3-6, 6-4, 2-6, 6-4, 6-2తో కంగు తినిపించాడు. చైనాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు జాంగ్ జీ జెన్, వూ ఇబింగ్ మూడోరౌండ్ చేరడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు. చైనాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో రెండోరౌండ్ విజయాలు సాధించడం ఇదే మొదటిసారి.

ఓనస్ జబేర్ జోరు..

మహిళల సింగిల్స్ లో రెండు గ్రాండ్ స్లామ్ టోర్నీల రన్నరప్ గా నిలిచిన అరబ్ తొలి మహిళా ప్లేయర్ ఓనస్ జబేర్ 7-5, 7-6తో కొలంబియా ప్లేయర్ కామిలా ఒసోరియాను అధిగమించింది. మరో సింగిల్స్ రెండోరౌండ్ మ్యాచ్ లో 7వ సీడ్ కారోలినా గార్షియా 6-4, 6-1తో చైనా క్వాలిఫైయర్ వాంగ్ యఫాన్ చేతిలో పరాజయం చవిచూసింది. 9వ సీడ్ వోండ్రుసోవా 6-3, 6-0తో దక్షిణ కొరియా ప్లేయర్ హాన్ నా-లాయ్ ను, 3వ సీడ్ జెస్సికా పెగ్యులా 6-2, 6-2తో ఇటలీ ప్లేయర్ కామిలా జియోర్జీలను ఓడించారు.

వీనస్ విలియమ్స్ ఘోరపరాజయం..

43 సంవత్సరాల వయసులో గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాలో పోటీకి దిగిన ప్రపంచ మాజీ నంబర్ వన్, అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ ఘోరపరాజయం చవిచూసింది. బెల్జియం ప్లేయర్ గ్రీట్ మీనెన్ 6-1, 6-1తో వీనస్ ను చిత్తు చేసింది. ప్రస్తుత 410వ ర్యాంక్ కు పడిపోయిన వీనస్ 24వసారి యూఎస్ ఓపెన్ లో పాల్గొనటం విశేషం. చెల్లెలు సెరెనా విలియమ్స్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అక్క వీనస్ మాత్రం గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో కొనసాగటం విశేషం. మరో రెండోరౌండ్ పోరులో 19 సంవత్సరాల కోకా గాఫ్ 6-3, 6-2తో రష్యా టీనేజర్ మిర్రా ఆంద్రీవాను చిత్తు చేసింది. గాఫ్ ఆడిన గత 14 మ్యాచ్ ల్లో 13 విజయాలతో దూకుడుమీద కనిపిస్తోంది.

*

First Published:  31 Aug 2023 9:49 AM GMT
Next Story