Telugu Global
Sports

పారిస్ ఒలింపిక్స్ లో భారత పతాకధారిగా తెలుగుతేజం శరత్ కమల్!

పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత పతాకధారిగా తెలుగుతేజం శరత్ కమల్!
X

పారిస్ వేదికగా జరిగే 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందానికి తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. 40 ఏళ్ల వయసులో ఈ అరుదైన గౌరవం దక్కించుకొన్నాడు.

2024- ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందానికి భారత టీటీ ఆల్ టైమ్ గ్రేట్, తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ పతాకధారిగా వ్యవహరించనున్నాడు.

తన క్రీడాజీవితంలో ఆఖరి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న 40 ఏళ్ల శరత్ కమల్ కు పతాకధారి గౌరవం కల్పించడం విమర్శలకు, వివాదానికి దారితీసింది.

భారత టీటీకి అసమాన సేవలు...

ప్రపంచ టేబుల్ టెన్నిస్ లో గత రెండుదశాబ్దాలుగా భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్న శరత్ కమల్ పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించినా తన వృత్తిరీత్యా చెన్నైలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు.

భారత టేబుల్ టెన్నిస్ జట్టుకు పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న శరత్ కమల్ కు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో డజనుకు పైగా పతకాలు సాధించిన రికార్డు ఉంది.

ప్రపంచ టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ విభాగంలో భారతజట్టు తొలిసారిగా 9వ ర్యాంకులో నిలవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలోనూ శరత్ కమల్ తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

నీరజ్ ను కాదని శరత్ కే ఎందుకు?

130 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం అందించిన ఏకైక అథ్లెట్ నీరజ్ చోప్రాను కాదని..వెటరన్ శరత్ కమల్ కు పతాకధారిగా అవకాశం ఇవ్వడం వివాదానికి దారితీసింది.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు కచ్చితంగా బంగారు పతకం సాధించి పెట్టగల నీరజ్ చోప్రాకు పతాకధారిగా అవకాశం ఎందుకు ఇవ్వలేదంటూ భారత ఒలింపిక్ సంఘాన్ని తమిళనాడు అథ్లెటిక్స్ సంఘం నిలదీసింది. ఆగమేఘాల మీద ఫ్లాగ్ బేరర్ గా శరత్ కమల్ పేరును ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు.

శరత్ కమల్ ను తక్కువ చేస్తూ ఓ లేఖ పంపిన తమిళనాడు అథ్లెటిక్స్ సంఘం తీరును భారత మాజీ ఒలింపియన్ వీరేన్ రస్కినా తప్పు పట్టారు. నీరజ్ చోప్రాకు పతాకధారిగా అవకాశం ఇవ్వలేదని శరత్ కమల్ ను అగౌరవంగా మాట్లాడటం సబబుగా లేదంటూ వీరేన్ మండి పడ్డారు. తమిళనాడు అథ్లెటిక్స్ సంఘం పదాలను జాగ్రత్తగా వాడటం నేర్చుకోవాలని చురక అంటించారు.

భారత్ కు ఎనలేని గుర్తింపు తెచ్చిన శరత్ కమల్ ను చిన్నచూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం దేశానికి గౌరవం కాదని చెప్పారు.

అన్నిఅంశాలు పరిగణనలోకి తీసుకొనే......

ఒలింపిక్స్ లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించాలన్న పట్టుదలతో శిక్షణ పొందుతున్న నీరజ్ చోప్రా సాధనకు భంగం కలిగించరాదన్న కారణంగానే శరత్ కమల్ ను ఫ్లాగ్ బేరర్ గా ఎంపిక చేసినట్లు భారత ఒలింపిక్స్ సంఘ వర్గాలు చెబుతున్నాయి.

స్విట్జర్లాండ్ లోని ఓ శిక్షణ శిబిరంలో సాధన చేస్తున్న నీరజ్ చోప్రా.. జులై 26న జరిగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం జులై 25నే పారిస్ కు రావాల్సి ఉంటుందని, ప్రారంభ వేడుకలు ముగిసిన వెంటనే వేరే దేశంలోని తన శిబిరానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని, నీరజ్ శిక్షణకు అంతరాయం కలిగించరాదనే ఫ్లాగ్ బేరర్ బాధ్యతని అప్పగించలేదని వివరణ ఇచ్చారు.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జూలై 26న నిర్వహిస్తే...నీరజ్ చోప్రా పతకం వేట మాత్రం ఆగస్టు 6న ప్రారంభంకానుంది.

First Published:  31 March 2024 5:30 AM GMT
Next Story