Telugu Global
Sports

బుమ్రా స్థానంలో షమీనా?...సిరాజా?

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరిగే టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ పలు రకాల ప్రశ్నలకు సమాధానాల కోసం తంటాలు పడుతోంది.

బుమ్రా స్థానంలో షమీనా?...సిరాజా?
X

టీ-20 ప్రపంచకప్ కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారతజట్టు నుంచి గాయంతో బుమ్రా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారకంగా ప్రకటించడంతో సరికొత్త చర్చకు తెరలేచింది. బుమ్రా స్థానాన్ని మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ల్లో ఎవరో ఒకరితో భర్తీ చేస్తారా? లేక దీపక్ చహార్ వైపు మొగ్గు చూపుతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది...

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరిగే టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ప్రపంచ నంబర్ వన్ జట్టు భారత్ పలు రకాల ప్రశ్నలకు సమాధానాల కోసం తంటాలు పడుతోంది.

డాషింగ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని ప్రపంచకప్ కు ముందే తనదైన శైలిలో ఆడుతూ ఉండటం, గత మూడేళ్లుగా పరుగులు, శతకం కోసం నానాపాట్లూ పడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఎట్టకేలకు గాడిలో పడటంతో ఊపిరి పీల్చుకొన్న భారత్ కు...ఇద్దరు కీలక బౌలర్ల గాయాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇటు బుమ్రా...అటు రవీంద్ర జడేజా!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత్ అత్యుత్తమ జట్టుగా, టాప్ ర్యాంకర్ గా, 2022 సీజన్లో అత్యధిక విజయాలు సాధించినజట్టుగా నిలిచిందంటే..దానికి ప్రధానకారణం యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే. ఈ ఇద్దరూ అందుబాటులో ఉంటే తుదిజట్టుకు ఒనగూరే సమతౌల్యం, చేకూరే అదనపు బలం అంతాఇంతాకాదు.

అయితే..ఆసియాకప్ ఆడుతూ గాయపడిన ఆల్ రౌండర్ జడేజా శస్త్రచికిత్సతో జట్టుకు దూరం కావడంతో..ఆ స్థానాన్ని మరో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సమర్థవంతంగా భర్తీ చేయగలిగాడు. జడేజా లేని లోటు కొంతమేరకు తీరిందని సంబరపడిపోతున్న తరుణంలో...భారత తురుపుముక్క, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బుమ్రా వెన్నెముకకు గాయం తిరగబెట్టడం జట్టును కోలుకోలేని దెబ్బతీసింది.

డెత్ ఓవర్ల సమస్యతో సతమతం..

బ్యాటింగ్ విభాగంలో అత్యంత భీకరంగా కనిపిస్తున్న భారతజట్టు బౌలింగ్ లో మాత్రం అత్యంత బలహీనంగా తయారయ్యింది. ప్రధానంగా డెత్ ఓవర్లలో ప్రత్యర్థిజట్లను సమర్థవంతంగా కట్టడి చేయలేక పరాజయాలు కొని తెచ్చుకొంటోంది.

స్పెషలిస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులివ్వడం జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యా, యజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి బౌలర్లున్నా..భారత బౌలింగ్ ఎటాక్ మాత్రం సాదాసీదాగానే కనిపిస్తోంది.

దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ టోర్నీ సూపర్ -4 రౌండ్లో పాకిస్థాన్, శ్రీలంక చేతిలో పరాజయాలు మాత్రమే కాదు...మొహాలీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన తొలి టీ-20లో సైతం ఓటమికి డెత్ ఓవర్లలో వైఫల్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

200కు పైగా భారీస్కోర్లు సాధించినా భారత్ విజయానికి గ్యారెంటీ లేకపోడం ఓ ప్రధానసమస్యగా మారింది. ఇదే సమయంలో గాయంతో గత కొద్దిమాసాలుగా జట్టుకు దూరమైన స్పెషలిస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా..రీఎంట్రీలో పట్టుమని రెండుమ్యాచ్ లు ఆడాడో లేదో...గాయం తిరగబెట్టడంతో ప్రపంచకప్ జట్టు నుంచి అనూహ్యంగా వైదొలగాల్సి వచ్చింది.

బుమ్రా గాయంతో భారత బౌలింగ్ మరింతగా బలహీనపడింది. మరి బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల మొనగాడు ఎవరంటూ మరోవైపు చర్చకు తెరలేచింది.

ఇటు షమీ...అటు బుమ్రా...

ప్రపంచకప్ కు ఎంపిక చేసిన భారతజట్టులో స్టాండ్ బైలుగా ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ ల పేర్లతో పాటు..హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరు సైతం ప్రస్తుతం మార్మోగిపోతోంది. బుమ్రా స్థానంలో ఈ ముగ్గురిలో ఒకరిని తుదిజట్టులోకి తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రపంచకప్ కు వేదికగా ఉన్న ఆస్ట్రేలియాలోని ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపై మహ్మద్ షమీ లాంటి బౌలర్ అవసరం భారత్ కు ఎంతో ఉందని మాజీ కెప్టెన్ కృష్ణమాచారీ శ్రీకాంత్, మాజీ ఓపెనర్ వాసిం జాఫర్ గట్టిగా చెబుతున్నారు.

మొదటి 15 మందిలోనే షమీకి చోటు ఇచ్చి ఉండాల్సిందని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీలేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లే ఓవర్లలో మాత్రమే కాదు...డెత్ ఓవర్లలో సైతం భారత్ కు షమీ కొండంత అండగా నిలవడం ఖాయమని, షమీనే బుమ్రా స్థానంలో తీసుకోవాలంటూ శ్రీకాంత్ సూచించాడు.

గత ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలవడం వెనుక షమీ బౌలింగ్ ప్రతిభ ఎంతో ఉందని, తాను ఆడిన మొత్తం 16 మ్యాచ్ ల్లో షమీ 20 వికెట్లతో 8 సగటు,

18.30 స్ట్ర్రయిక్ రేటు నమోదు చేసిన రికార్డులను గుర్తుంచుకోవాలని కోరాడు.

జాఫర్ సైతం....

బుమ్రా అందుబాటులో లేకపోడంతో...అతని స్థానాన్ని భర్తీ చేయగల మొనగాడు మహ్మద్ షమీ మాత్రమేనంటూ మాజీ ఓపెనర్, క్రికెట్ విమర్శకుడు వాసిం జాఫర్ కితాబిచ్చాడు. ఆస్ట్రేలియా వికెట్లు,వాతావరణం, భారత బౌలింగ్ అవసరాలకు సరిపడిన బౌలర్ షమీ మాత్రమేనని స్పష్టం చేశాడు.

మరోవైపు..ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ షేన్ వాట్సన్ మాత్రం...హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వైపు మొగ్గు చూపాడు. కంగారూల్యాండ్ లోని ఫాస్ట్ ,బౌన్సీ పిచ్ లపై

మహ్మద్ సిరాజ్ లాంటి యువఫాస్ట్ బౌలర్ కు అవకాశమిస్తే భారత్ కు తిరుగే ఉండదని మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ చెప్పాడు.

కరోనా కారణంగా భారతజట్టుకు షమీ దూరం కాగా..భారతజట్టులో చోటు లేక సిరాజ్ వేరే మ్యాచ్ లకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ...స్వింగ్ బౌలర్ దీపక్ చహార్ మాత్రం...దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అంచనాలకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం ద్వారా..తుదిజట్టులో చోటుకు తహతహలాడుతున్నాడు.

అక్టోబర్ 6న భారతజట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరటానికి ముందే..బుమ్రా వారసుడు ఎవరో తేలిపోనుంది. అప్పటి వరకూ సస్పెన్స్ భరించక తప్పదు.

First Published:  4 Oct 2022 7:00 AM GMT
Next Story