Telugu Global
Sports

షెఫాలీ మెరుపులు, ఢిల్లీ ఉరుములు!

మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

షెఫాలీ మెరుపులు, ఢిల్లీ ఉరుములు!
X

మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

ఐదుజట్ల ప్రారంభ మహిళా ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఏకపక్ష విజయాల పరంపర కొనసాగుతోంది. నాలుగోరౌండ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 వికెట్లతో గుజరాత్ జెయింట్స్ ను అలవోకగా ఓడించి లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతోంది.

105 పరుగులకే గుజరాత్ ఆలౌట్...

ముంబై డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ నాలుగోరౌండ్ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ 105 పరుగుల స్కోరుకే కుప్పకూలింది.

గుజరాత్ బ్యాటర్లలో కిమ్‌ గార్త్‌ 32 పరుగుల నాటౌట్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. హర్లీన్‌ (20), జార్జియా (22) తమవంతు పాత్ర నిర్వర్తించినా గుజరాత్ తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఢిల్లీ బౌలర్లలో మారిజానే కాప్ 15 పరుగులకే 5 వికెట్లు, శిఖ పాండే 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.

షెఫాలీ విధ్వంసం....

106 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీ కేవలం 7.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజేతగా నిలిచింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 21 పరుగులతో ఓ ఎండ్ కే పరిమితం కాగా..డాషింగ్ ఓపెనర్ షెఫాలీవర్మ మరో ఎండ్ నుంచి చెలరేగిపోయింది. విధ్వంసకర బ్యాటింగ్ తో మెరుపు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచింది.

కేవలం 28 బంతుల్లోనే 10 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 76 పరుగుల నాటౌట్ స్కోరుతో షెఫాలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.

10 వికెట్లతో నెగ్గడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ఐదుజట్ల లీగ్ లో మూడో విజయం నమోదు చేయగలిగింది.

ప్రస్తుత లీగ్ లో ఢిల్లీ ఓపెనర్ షెఫాలీ వర్మకు ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా..బౌలర్ గా మారిజానా కాప్ రెండోసారి 5 వికెట్ల ఘనతను సాధించగలిగింది.

మొత్తం 5 జట్ల లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్ 6 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, ఓ ఓటమితో 6పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

యూపీ వారియర్స్ మూడుమ్యాచ్ ల్లో 4 పాయింట్లతో మూడు, గుజరాత్ జెయింట్స్ 4మ్యాచ్ ల్లో 2 పాయింట్లతో నాలుగు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ ఓడి లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలోనూ ఉన్నాయి.

ఈరోజు జరిగే రౌండ్ రాబిన్ లీగ్ పోరులో ముంబై ఇండియన్స్ తో యూపీ వారియర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7-30 గంటల నుంచి ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగనుంది.

First Published:  12 March 2023 6:28 AM GMT
Next Story