Telugu Global
Sports

మహిళా క్రికెట్లో మెరుపు ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్!

మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ ఘనత సాధించింది.

మహిళా క్రికెట్లో మెరుపు ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్!
X

మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఈ ఘనత సాధించింది.

సుకుమారంగా సాగిపోయే మహిళా క్రికెట్లో మెరుపు ఫాస్ట్ బౌలర్లు ఉండరన్న మాట నిజం కాదని దక్షిణాఫ్రికా కమ్ ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ తేల్చి చెప్పింది.

2024 మహిళా ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ జట్ల నడుమ జరిగిన మ్యాచ్ లో షబ్నిమ్ నిప్పులు చెరిగే బంతిని విసిరి మహిళలా..మజానా అనుకొనేలా చేసింది.

గంటకు 132 కిలోమీటర్ల వేగంతో....

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా ఆటతీరు, వేగంలో పురుషులు, మహిళలకు ఎంతో అంతరం ఉంటూ వస్తోంది. పురుషుల విభాగంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే వారినే మెరుపు ఫాస్ట్ బౌలర్లుగా పరిగణిస్తారు.

గతంలో..వెస్టిండీస్ దిగ్గజాలతో పాటు..పాక్ థండర్ బోల్ట్ షోయబ్ అక్తర్ లాంటి పలువురు బౌలర్లు గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరడం ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించినవారే.

ప్రస్తుత తరం బౌలర్లలో మిషెల్ స్టార్క్, కిగిసో రబడ, మార్క్ వుడ్, నసీం షా, ఉమ్రాన్ మాలిక్, మార్కో జెన్సన్ లాంటి బౌలర్లు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సత్తా ఉన్నవారుగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

మహిళా క్రికెట్లో అంతంత మాత్రమే....

మహిళా క్రికెట్లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవారిని మాత్రమే ఫాస్ట్ బౌలర్లుగా పరిగణిస్తారు. సాధారణంగా అతివల క్రికెట్లో సగటున గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే మిలిటరీ మిడియం బౌలర్లు మాత్రమే మనకు కనిపిస్తారు.

అయితే..గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకొన్న తొలి మహిళగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ రికార్డు నెలకొల్పింది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న షబ్నిం 132 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కు షబ్నిం వేసిన బంతి 132 కిలోమీటర్ల వేగాన్ని తాకింది. షబ్నిమ్ విసిరిన ఈ సుడిగాలి బంతి ను లానింగ్ అంచనా వేయలేకపోయింది.

మెరుపువేగంతో వెళ్లిన ఈ బంతి లానింగ్ ప్యాడ్లను తాకింది. వెంటనే షబ్నిమ్ ఎల్బీడబ్లు కోసం అప్పీలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో షబ్నిమ్ తో పాటు ముంబైజట్టు సభ్యులు నిరాశకు గురికాక తప్పలేదు.

షబ్నిమ్ కు ఇది మామూలే...

మహిళా క్రికెట్లో గంటకు 125 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం షబ్నిమ్ కు మామూలు విషయమే. 2016 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో షబ్నిమ్ 128 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతే మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వేసిన బంతిగా నమోదయ్యింది. ఆ తరువాత 8 సంవత్సరాలకు షబ్నిమ్ 132 కిలోమీటర్ల వేగంతో తన ప్రపంచ రికార్డును తానే అధిగమించుకోగలిగింది.

ప్రస్తుత సీజన్ మహిళా ఐపీఎల్ ప్రారంభమ్యాచ్ లో షబ్నిమ్ గంటకు 128.3 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగింది. తనకు బౌలింగ్ చేస్తున్న సమయంలో వేగం గురించి తెలియదని, బౌలింగ్ చేస్తూ పోవడమేనని మ్యాచ్ అనంతరం షబ్నిమ్ చెప్పింది.

అయితే..నియంత్రణ లేని ఫాస్ట్ బౌలర్లు చేతికి ఎముకలేదన్నట్లుగా ధారాళంగా పరుగులు ఇచ్చి తమ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలుస్తూ రావడం మామూలు విషయమే. షబ్నిమ్ సైతం తన కోటా 4 ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకోక తప్పలేదు.

లానింగ్ 38 బంతుల్లో 53 పరుగులు, జెమీమా రోడ్రిగేజ్ 33 బంతుల్లో 69 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

సమాధానంగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు మాత్రమే చేసి 29 పరుగుల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

డిఫెండింగ్ చాంపియన్ ముంబై పై ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 4 గెలుపు, ఓ ఓటమి రికార్డుతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ముంబై జట్టు ఐదుమ్యాచ్ ల్లో 3 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో లీగ్ టేబుల్ మూడో స్థానంలో కొట్టిమిట్టాడుతోంది.

First Published:  6 March 2024 11:46 AM GMT
Next Story