Telugu Global
Sports

సిరీస్ కు భారత్ గురి..ఆసీస్ కు డూ ఆర్ డై!

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచా పటాకా సిరీస్ కీలక ఘట్టానికి చేరింది. ఇప్పటికే 2-0తో పైచేయి సాధించిన భారత్ వరుసగా మూడో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది....

సిరీస్ కు భారత్ గురి..ఆసీస్ కు డూ ఆర్ డై!
X

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచా పటాకా సిరీస్ కీలక ఘట్టానికి చేరింది. ఇప్పటికే 2-0తో పైచేయి సాధించిన భారత్ వరుసగా మూడో విజయంతో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది......

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో ప్రపంచ నంబర్ వన్ టీమ్ భారత్, 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాజట్ల ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని కీలక మూడో పోరుకు గౌహతీలోని డాక్టర్ భూపేన్ హజారికా స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు ఆతిథ్య భారత్ కు చెలగాటం, కంగారూజట్టుకు సిరీస్ సంకటంగా మారింది.

విజయాల హ్యాట్రిక్ కు భారత్ తహతహ....

సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, రాహుల్, హార్థిక్ పాండ్యా లతో సహా మొత్తం 13 మంది కీలక ఆటగాళ్లు లేకుండానే భారతజట్టు..పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో టీ-20 సిరీస్ సమరం చేస్తోంది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో బరిలో నిలిచిన భారత్ సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ విజేతగా నిలవడం ద్వారా సిరీస్ పై పట్టు బిగించింది.

విశాఖ వేదికగా జరిగిన హైస్కోరింగ్ తొలిపోరులో 2 వికెట్లతో నెగ్గిన భారత్..తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ముగిసిన రెండోమ్యాచ్ లో 44 పరుగులతో ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసింది.

ఇప్పుడు సిరీస్ కే కీలకంగా మారిన మూడో మ్యాచ్ కు ఈశాన్య భారత ప్రధాన క్రికెట్ వేదిక గౌహతీలో రంగం సిద్ధమయ్యింది. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ విజయాలహ్యట్రిక్ తో పాటు సిరీస్ ను 3-0తో ఖాయం చేసుకోవాలన్న లక్ష్యంతో పోటీకి సిద్ధమయ్యింది.

ఆస్ట్ట్రేలియాకు చావో రేవో....

మరోవైపు..మాథ్యూ వేడ్ నాయకత్వంలో ..బ్యాక్ టు బ్యాక్ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరైన ఆస్ట్ర్రేలియా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే ఆరునూరైనా మూడో టీ-20 మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది.

భారత ఓపెనింగ్ జోడీ యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గయక్వాడ్, వన్ డౌన్ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్..ఇలా అందరూ దూకుడుగా ఆడే స్ట్ర్రోక్ మేకర్లే కావడంతో కంగారూ బౌలర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఓపెనర్ యశస్వి నుంచి 5వ నంబర్ రింకూ సింగ్ వరకూ అందరూ వీరబాదుడు బ్యాటర్లే కావడంతో ఎలా అదుపు చేయాలో అర్థంకాక మాథ్యూ వేడ్ సతమతమైపోతున్నాడు.

సూర్యాను ఊరిస్తున్న విరాట్ రికార్డు...

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో అత్యంతవేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన విరాట్ కొహ్లీ రికార్డును అధిగమించే అవకాశం సూర్య కోసం వేచిచూస్తోంది.

ప్రస్తుత సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లోనే 99 పరుగులు సాధించిన సూర్య..మిగిలిన మూడుమ్యాచ్ ల్లో మరో 61 పరుగులు సాధించగలిగితే విరాట్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ కు ఇప్పటి వరకూ ఆడిన 52 అంతర్జాతీయ టీ-20 ఇన్నింగ్స్ లో 3 శతకాలు, 16 హాఫ్ సెంచరీలతో 1940 పరుగులు సాధించిన రికార్డు ఉంది. సూర్యా 46.02 సగటుతో 172.70 స్ట్ర్రయిక్ రేట్ సైతం నమోదు చేయగలిగాడు. వరస కుదిరితే గౌహతీలో ఈరోజు జరిగే మూడో మ్యాచ్ ద్వారానే

విరాట్ రికార్డును సూర్య అధిగమించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

రాత్రి 7గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు డాక్టర్ భూపేన్ హజారికా స్టేడియం కిటకిటలాడటం ఖాయమని నిర్వాహక సంఘం భావిస్తోంది. వరుసగా మూడో విజయంతో భారత్ సిరీస్ సొంతం చేసుకొంటుందా? లేక కీలక మూడోమ్యాచ్ లో నెగ్గడం ద్వారా ఆస్ట్ర్రేలియా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలుగుతుందా? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

First Published:  28 Nov 2023 2:15 AM GMT
Next Story