Telugu Global
Sports

యూఎస్‌ ఓపెన్‌తో సెరెనా స్వస్తి!

2022 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీకి న్యూయార్క్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ఈటోర్నీతోనే తన సుదీర్ఘ కెరియర్ కు స్వస్తిపలుకనుంది.

యూఎస్‌ ఓపెన్‌తో సెరెనా స్వస్తి!
X

2022 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీకి న్యూయార్క్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ ఈటోర్నీతోనే తన సుదీర్ఘ కెరియర్ కు స్వస్తిపలుకనుంది.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో అమెరికన్ ఆల్ టైమ్ గ్రేట్, బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ సమయం దగ్గర పడింది. న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా ఈరోజు ప్రారంభమయ్యే 2022- యూఎస్ ఓపెన్ టోర్నీతో 25 సంవత్సరాల తన టెన్నిస్ జీవితానికి సెరెనా స్వస్తి పలుకనుంది.

Advertisement

24వ టైటిల్ కు ఆఖరి చాన్స్...

మహిళా టెన్నిస్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ( 24 ) సాధించిన మార్గారెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలన్న సెరెనా ప్రయత్నాలు గత నాలుగేళ్లుగా సఫలం కావడం లేదు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి సెరెనా ఆటతీరు గాడితప్పింది. మాతృత్వం ఓవైపు, మీద పడుతున్న వయసు మరోవైపు సెరెనా ఆటతీరును తీవ్రంగా ప్రభావితం చేసింది.

తన కెరియర్ లో ఇప్పటికే 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా...చివరిసారిగా 2017 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత నుంచి సెరెనా మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గడం ద్వారా మార్గారెట్ కోర్టు 24 టైటిల్స్ రికార్డును సమం చేయటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా...స్థాయికి తగ్గట్టుగా ఆడలేక విఫలమవుతూ వస్తోంది.

Advertisement

యూఎస్ ఓపెన్లో 21వసారి...

న్యూయార్క్ వేదికగా జరిగే అమెరికన్ ఓపెన్ కు..సెరెనా విలియమ్స్ కు అవినాభావ సంబంధమే ఉంది. 25 సంవత్సరాల తన టెన్నిస్ జీవితంలో 21వసారి యూఎస్ ఓపెన్ బరిలోకి దిగుతోంది.ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

సెరెనా 2008 నుంచి సెమీఫైనల్‌ దశ వరకు చేరుతూ వస్తోంది. మహిళల సింగిల్స్ తో పాటు...తన సోదరి వీనస్ విలియమ్స్ తో జంటగా...మహిళల డబుల్స్ లో సైతం చివరిసారిగా పాల్గోనుంది.

మంగళవారం ఉదయం ( భారత కాలమానం ప్రకారం ) జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాంటెనీగ్రో క్రీడాకారిణి, ప్రపంచ 80వ ర్యాంకర్‌ డాంకా కొవినిచ్‌ తో సెరెనా తలపడనుంది.

ప్రపంచ మహిళాటెన్నిస్ టాప్ ర్యాంకర్ స్వియాటెక్‌ (పోలాండ్‌), రెండుసార్లు విజేత నయోమి ఒసాకా (జపాన్‌), డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌), సిమోనా హలెప్‌ (రొమేనియా) టైటిల్‌ ఫేవరెట్స్‌గా బరిలో నిలిచారు.

నడాల్ ను ఊరిస్తున్న 23వ టైటిల్..

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ తన కెరియర్ లో 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు. ఇప్పటికే 22 టైటిల్స్ నెగ్గడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మొనగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన నడాల్...ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. దీనికితోడు ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ కరోనా వాక్సిన్ నిషేధంతో టోర్నీకి దూరం కావడం కూడా నడాల్ కు కలిసొచ్చే అంశంగా మారింది.పురుషుల సింగిల్స్‌ టైటిల్ రేసులో డిఫెండింగ్‌ చాంపియన్‌ మెద్వెదెవ్‌ (రష్యా), సిట్సిపాస్‌ (గ్రీస్‌), నిక్‌ కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా), అల్కారజ్‌ (స్పెయిన్‌) లాంటి ఆటగాళ్లు నడాల్ కు ప్రధానప్రత్యర్థులుగా ఉన్నారు.

పురుషుల, మహిళల సింగిల్స్‌ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలతో పాటు 20 కోట్ల 90 లక్షల రూపాయల చొప్పున ( 26 లక్షల డాలర్ల చొప్పున ) ప్రైజ్‌మనీ అందచేయనున్నారు.

పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాళ్లంతా మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలం కాగా...మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశాలకు గాయంతో సానియా మీర్జా దూరమయ్యింది.

Next Story