Telugu Global
Sports

టెస్టు యువజోడీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు!

ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భారత టెస్టు యువజోడీని బీసీసీఐ వెన్నుతట్టి ప్రోత్సహించింది. సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించింది.

టెస్టు యువజోడీకి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు!
X

ఇంగ్లండ్ తో సిరీస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భారత టెస్టు యువజోడీని బీసీసీఐ వెన్నుతట్టి ప్రోత్సహించింది. సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించింది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో ఇటీవలే ముగిసిన ఐదుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ 4-1తో గెలుచుకోడంలో ప్రధానపాత్ర వహించిన యువజోడీ సరఫ్రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ల కష్టం, ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. అతితక్కువ సమయంలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కింది.

గ్రేడ్- సీ జాబితాలో చోటు.......

ప్రపంచంలోనే అత్యంతభాగ్యవంతమైన క్రికెట్ బోర్డు భారత్..ఏటా 30 మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు..వారి వారి స్థాయిని, అనుభవాన్ని బట్టి ఏడాదికి 7 కోట్ల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ వివిధ గ్రేడ్ల వారీగా కాంట్రాక్టులు ఇస్తూ వస్తోంది.

కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లకు తుదిజట్టులో చోటు దక్కినా ..లేకున్నా బీసీసీఐ కాంట్రాక్టు మొత్తాన్ని చెల్లిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా, జడేజా లాంటి ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు గ్రేడ్- ఏ ప్లస్ కింద ఏడాదికి 7 కోట్ల రూపాయలు కాంట్రాక్టు మనీగా అందుకొంటున్నారు.

అంతగా అనుభవం లేని, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న క్రికెటర్లకు గ్రేడ్- సీ కింద కోటి రూపాయలు చెల్లిస్తున్నారు.

ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్ ద్వారా టెస్టు అరంగేట్రం చేసిన 22 సంవత్సరాల వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్, 26 ఏళ్ల సరఫ్రాజ్ ఖాన్ లను సెంట్రల్ కాంట్రాక్టు గ్రేడ్- సీ జాబితాలో చేర్చారు.

నిబంధనల ప్రకారం ఈ ఇద్దరు క్రికెటర్లు భారత్ తరపున చెరో మూడుటెస్టులు ఆడిన కారణంగా నేరుగా సీ-గ్రేడు జాబితాలో బీసీసీఐ చేర్చింది. రానున్న ఏడాదికాలంలో భారత్ తరపున ఆడే అవకాశం వచ్చినా, రాకున్నా జురెల్, సరఫ్రాజ్ చెరో కోటి రూపాయలు గ్యారెంటీ మనీగా అందుకోనున్నారు.

రంజీ వార్షిక షెడ్యూలులో మార్పులు..

2024-25 రంజీట్రోఫీ సీజన్ షెడ్యూలులో భారీగా మార్పులు చేర్పులు చేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సమగ్ర కార్యక్రమాన్ని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది.

మంచు విపరీతంగా కురిసే డిసెంబర్, జనవరి మాసాలలో ఉత్తరాది వేదికల్లో రంజీమ్యాచ్ లు నిర్వహించరాదని బీసీసీఐ నిర్ణయించింది.

గత కొద్దిసీజన్లుగా రంజీ సీజన్ జనవరిలో ప్రారంభమై మార్చి నెలలో ముగుస్తూ వస్తోంది. ఉత్తరాది రాష్ట్ర్రాల ప్రధాన వేదికలు ఢిల్లీ, చండీగఢ్, కాన్పూర్, మీరట్, జమ్మూ, ధర్మశాల స్టేడియాలలో మ్యాచ్ లు నిర్వహించడం గగనమైపోతోంది. మంచు ప్రభావం, వెలుతురు సరిగా లేకపోడం కూడా మ్యాచ్ లు నిర్వహించడానికి ప్రతిబంధకాలుగా మారాయి.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ముగిసిన తరువాత రంజీట్రోఫీని అక్టోబర్ నుంచి నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

రాష్ట్ర్రాల క్రికెట్ సంఘాలకు హుకుం...

బీసీసీఐ అనుమతి లేకుండా దేశంలోని వివిధ రాష్ట్ర్రాల క్రికెట్ సంఘాలు విదేశీ బోర్డులతో అవగాహనా ఒప్పందాలు చేసుకోరాదని బోర్డు స్పష్టం చేసింది. నేపాల్, అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డులు..బోర్డు అనుమతిలేకుండానే ఉత్తరాఖండ్, గుజరాత్, బరోడా లాంటి క్రికెట్ సంఘాలతో అవగాహనా ఒప్పందం చేసుకోడం ద్వారా ప్రాక్టీసు వసతులను వినియోగించుకొంటూ వస్తున్నాయి.

First Published:  19 March 2024 1:45 AM GMT
Next Story