Telugu Global
Sports

విరాట్ , రోహిత్ ల రికార్డుకు చేరువగా సంజు శాంసన్!

భారత డాషింగ్ వికెట కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. విండీస్ తో ఈరోజు జరిగే తొలి టీ-20 ద్వారా ఇద్దరు దిగ్గజాల సరసన సంజు నిలిచే అవకాశం ఉంది.

విరాట్ , రోహిత్ ల రికార్డుకు చేరువగా సంజు శాంసన్!
X

విరాట్ , రోహిత్ ల రికార్డుకు చేరువగా సంజు శాంసన్!

భారత డాషింగ్ వికెట కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. విండీస్ తో ఈరోజు జరిగే తొలి టీ-20 ద్వారా ఇద్దరు దిగ్గజాల సరసన సంజు నిలిచే అవకాశం ఉంది.

సంజు శాంసన్..అపరిమితమైన ప్రతిభతో.. పరిమితమైన అవకాశాలనే అందిపుచ్చుకొంటూ ఎదుగుతున్న వికెట్ కీపర్ బ్యాటర్. ప్రధాన బ్యాటర్ల కు గాయాలైన సమయంలో, ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు అందుబాటులో లేని సమయంలో మాత్రమే భారత వన్డే, టీ-20 జట్లలో సభ్యుడిగా ఆడుతున్న దురదృష్టవంతుడైన క్రికెటర్.

దూకుడుకు మరోపేరు....

క్రీజులో నిలదొక్కుకొంటే చాలు భారీషాట్లతో విరుచుకు పడటంలో సంజు శాంసన్ తర్వాతే ఎవరైనా. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా సంజు సాగించిన పరుగుల మోత గురించి ప్రత్యర్థి బౌలర్లకు మాత్రమే కాదు..అభిమానులకు సైతం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు.

2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ను ఫైనల్స్ చేర్చడంతో పాటు రన్నరప్ గా నిలిపిన ఘనత సంజుకు మాత్రమే దక్కుతుంది. దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నా..భారత వన్డే, టీ-20 జట్లలో తన స్థానాన్ని సంజు సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు.

కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, గతంలో రిషభ్ పంత్ , ప్రస్తుతం ఇషాన్ కిషన్ ల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటూ తన ఉనికిని నిలుపుకొంటూ వస్తున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాలలోనే సత్తా చాటుకొంటూ సెలెక్టర్ల దృష్టిలో ఉంటూ వస్తున్నాడు.

వైట్ బాల్ క్రికెట్లో మెరుపువీరుడు...

50 ఓవర్ల ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, 20 ఓవర్ల ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో సంజు అంచనాలకు మించి రాణిస్తూ వస్తున్నాడు. భారత వన్డే, టీ-20 జట్లలో సభ్యుడిగా తక్కువ మ్యాచ్ లే ఆడినా తన బ్యాట్ పవర్ ఏంటో.. సంజు పలుమార్లు చాటుకొన్నాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 241 టీ-20 ( అంతర్జాతీయ, ఐపీఎల్ )మ్యాచ్ లు ఆడిన సంజు 5వేల 979 పరుగులతో 6వేల పరుగుల రికార్డుకు కేవలం 21 పరుగుల దూరంలో మాత్రమే నిలిచాడు.

వెస్టిండీస్ తో ఈ రోజు ప్రారంభమయ్యే పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భారత తుదిజట్టులో చోటు దక్కితే..సంజు 6వేల పరుగుల మైలురాయిని చేరడం ఏమంత కష్టంకాబోదు.

12 మంది కే ఆ ఘనత...

టీ-20 ఫార్మాట్లో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మతో పాటు మొత్తం 12మంది బ్యాటర్లు మాత్రమే 6వేల పరుగుల రికార్డు నెలకొల్పినవారిలో ఉన్నారు. విరాట్ కొహ్లీ 374 మ్యాచ్ ల్లో 11వేల 965 పరుగులు, రోహిత్ శర్మ 423 మ్యాచ్ ల్లో 11వేల35 పరుగులతో ఉన్నారు. మొత్తం 12 మంది బ్యాటర్ల వరుసలో విరాట్ 4వ స్థానంలోనూ, రోహిత్ 8వ స్థానంలోనూ కొనసాగుతున్నారు.

శిఖర్ ధావన్ 329 మ్యాచ్ ల్లోనే 9వేల 645 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 336 మ్యాచ్ ల్లో 8వేల 654 పరుగులు, రాబిన్ ఊతప్ప 291 మ్యాచ్ ల్లో 7వేల 272 పరుగులు, మహేంద్రసింగ్ ధోనీ 377 మ్యాచ్ ల్లో 7వేల 271 పరుగులు, దినేశ్ కార్తీక్ 386 మ్యాచ్ ల్లో 7వేల 81 పరుగులు, కెఎల్ రాహుల్ 212 మ్యాచ్ ల్లో 7వేల 66 పరుగులు, మనీశ్ పాండే 298 మ్యాచ్ ల్లో 6వేల 810 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 258 మ్యాచ్ ల్లో 6వేల 503 పరుగులు, గౌతం గంభీర్ 251 మ్యాచ్ ల్లో 6వేల 402 పరుగులు, అంబటి రాయుడు 291 మ్యాచ్ ల్లో 6వేల 28 పరుగులు సాధించడం ద్వారా టీ-20ల్లో 6వేల పరుగుల వీరులుగా నిలిచారు.

ఈరోజు జరిగే తొలి టీ-20లో భారత తుదిజట్టులో సంజుకు చోటు దక్కి మరో 21 పరుగులు సాధించగలిగితే 6వేల పరుగుల రికార్డు అందుకొన్న భారత 13వ బ్యాటర్ కాగలుగుతాడు.

28 సంవత్సరాల సంజు ఇప్పటి వరకూ భారత్ తరపున 17 టీ-20 మ్యాచ్ లు మాత్రమే ఆడి 301 పరుగులు సాధించాడు.152 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 3వేల 888 పరుగులతో 20.06 సగటుతో నిలిచాడు.

ప్రస్తుత భారత టీ-20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ గా తుదిజట్టులో చేరాలంటే ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో చోటు కోసం తిలక్ వర్మ నుంచి సంజుకు ప్రధానంగా పోటీ ఎదురుకానుంది.

First Published:  3 Aug 2023 11:36 AM GMT
Next Story