Telugu Global
Sports

వన్డేలకు సంజు, టెస్టులకు రిషభ్ పంత్ ?

ఫార్మాట్ కు ఓ కెప్టెన్ ఉన్నట్లే..వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు వికెట్ కీపర్లు ఉండాలన్న డిమాండ్ రానురాను పెరిగిపోతోంది. వైట్ బాల్ కు సంజు శాంసన్ ను, రెడ్ బాల్ క్రికెట్ కు రిషభ్ పంత్ ను వికెట్ కీపర్లుగా కొనసాగించాలని పలువురు క్రికెట్ పండితులు చెబుతున్నారు.

వన్డేలకు సంజు, టెస్టులకు రిషభ్ పంత్ ?
X

వన్డేలకు సంజు, టెస్టులకు రిషభ్ పంత్ ?

ఫార్మాట్ కు ఓ కెప్టెన్ ఉన్నట్లే..వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు వికెట్ కీపర్లు ఉండాలన్న డిమాండ్ రానురాను పెరిగిపోతోంది. వైట్ బాల్ కు సంజు శాంసన్ ను, రెడ్ బాల్ క్రికెట్ కు రిషభ్ పంత్ ను వికెట్ కీపర్లుగా కొనసాగించాలని పలువురు క్రికెట్ పండితులు చెబుతున్నారు...

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నసామెత భారత క్రికెట్ కు అతికినట్లు సరిపోతుంది. టీ-20 క్రికెట్లో భారతజట్టు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించినా ప్రపంచకప్ సెమీఫైనల్ దశ దాట లేకపోయింది. వన్డే ఫార్మాట్లో 3వ ర్యాంకర్ గా ఉన్నా గత దశాబ్దకాలంగా టైటిల్ నెగ్గుకు రాలేకపోతోంది. టెస్టు క్రికెట్ అగ్రశ్రేణిజట్లలో ఒకటిగా ఉన్నా..టెస్టు లీగ్ రన్నరప్ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

కోచ్ లు మారినా, కెప్టెన్సీ పగ్గాలు చేతులు మారినా ఐసీసీ ప్రపంచ టోర్నీలలో భారత్ పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా..ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ద్వైపాక్షిక సిరీస్ ల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా...ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలలో మాత్రం భారత్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోతోంది.

ఎందుకీ దురవస్థ?

ఐపీఎల్ పుణ్యమా అంటూ ప్రతిభావంతులైన దేశవాళీ క్రికెటర్లు సైతం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్నారు. గతంలో మాదిరిగా భారతజట్టులో చోటు కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి కూడా లేదు. ఏమాత్రం ప్రతిభ ఉన్నా, నిలకడగా రాణిస్తూ వచ్చినా..భారత టీ-20, వన్డే జట్లలో ఇట్టే చోటు దక్కుతోంది.

జాతీయస్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, జాతీయజట్టులో చోటు కల్పించినా...సకాలంలో వారికి తుదిజట్టులో చోటు లభించని పరిస్థితి నెలకొని ఉంది. పైగా..

క్లాస్ ఈజ్ పెర్మనెంట్, ఫామ్ ఈజ్ టెంపరరీ..అన్నమాటను బీసీసీఐ ఎంపిక సంఘం, టీమ్ మేనేజ్ మెంట్, శిక్షకులు, నాయకులు తుచ తప్పక పాటిస్తూ..భారత క్రికెట్ భారీమూల్యమే చెల్లించే పరిస్థితి కల్పిస్తున్నారు.

సూర్యకుమార్ ఐదేళ్ల నిరీక్షణ...

టీ-20 క్రికెట్లో అపారప్రతిభ కలిగిన ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ భారతజట్టులో చోటు కోసం ఐదేళ్లపాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్లో సంవత్సరాల తరబడి నిలకడగా రాణిస్తూ వచ్చినా 2021 సీజన్ వరకూ సూర్యాను సెలెక్టర్లు పట్టించుకొన్న పాపాన పోలేదు. సూర్యకుమార్ లోని అసాధారణ ప్రతిభను ఎంపిక విధానలోపాల కారణంగా గత ఐదేళ్లుగా భారత క్రికెట్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.

సంజు శాంసన్ దీ అదే పరిస్థితి...

వైట్ బాల్ ( టీ-20, వన్డే ) క్రికెట్లో ప్రస్తుతం భారత అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఎవరంటే..కేరళకు చెందిన సంజు శాంసన్ అన్న జవాబే వినిపిస్తుంది. ఐపీఎల్ తో పాటు ఇండియా- ఏ జట్ల తరపున అద్భుతంగా రాణిస్తూ భారతజట్టులో చోటు సంపాదించినా..అరకొర అవకాశాలతో సంజు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. తనకు లభించిన పరిమిత అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ 60కి పైగా సగటు సాధించినా..భారత టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం..సంజును కూరలో కరివేపాకులా వాడుకోటం చర్చనీయాంశంగా మారింది.

టెస్టు క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ భారతజట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించే మొనగాడు రిషభ్ పంత్ కు భారత టీమ్ మేనేజ్ మెంట్ మిగిలిన రెండు ఫార్మాట్లలో పెద్దపీట వేస్తూ..అపరిమిత ప్రాధాన్యం ఇస్తోంది. అయినా ..రిషభ్ పంత్ మాత్రం వరుస వైఫల్యాలతో జట్టుకే అలంకరణగా మారాడు. తుదిజట్టులో చోటు ఉండేలా పంత్ కు వైస్ కెప్టెన్ పదవిని సైతం కట్టబెట్టడంతో..సంజు శాంసన్ లాంటి మొనగాడు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి వస్తోంది.

వైట్ బాల్ క్రికెట్లో సంజు శాంసన్ సగటు 60 కాగా..రిషభ్ పంత్ సగటు కేవలం 30 మాత్రమే. అయినా..రిషభ్ నే భారత కెప్టెన్, కోచ్ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. పైగా మ్యాచ్ విన్నరంటూ వెనకేసుకొస్తున్నారు. పైగా పంత్ కు ఓపెనర్ స్థానం నుంచి రెండో డౌన్ వరకూ ఆడిస్తూ తగిన అవకాశాలు కల్పించడం విస్మయం కలిగిస్తోంది.

వన్డే ఫార్మాట్లో సంజు ఆడిన గత 11 మ్యాచ్ ల్లో 60కి పైగా సగటు నమోదు చేస్తే..రిషభ్ పంత్ గత 10 మ్యాచ్ ల్లో తొమ్మిది వైఫల్యాలతో 30 సగటు మాత్రమే సాధించగలిగాడు.

వైట్ బాల్ క్రికెట్లో పంత్ ఇప్పటి వరకూ 95 మ్యాచ్ లు ఆడి 8 అర్థశతకాలు, ఓ సెంచరీతో 1842 పరుగులు సాధించాడు. అదే సంజు శాంసన్ మాత్రం 27 మ్యాచ్ లు మాత్రమే ఆడి 626 పరుగులు సాధించాడు.

దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ మ్యాచ్ లో సంజు 86 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పైన సైతం హాఫ్ సెంచరీ సాధించినా తుదిజట్టులో చోటుకు గ్యారెంటీ లేకుండా పోయింది.

లక్ష్మణ్, ధావన్ ది ఒకేమాట...

న్యూజిలాండ్ తో ఇటీవలే ముగిసిన తీన్మార్ టీ-20, వన్డే సిరీస్ ల్లోని మొత్తం ఆరుమ్యాచ్ ల్లో సంజుకు ఒక్కమ్యాచ్ లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఆ ఒక్క ఇన్నింగ్స్ లో 38 బంతులు ఎదుర్కొని 36 పరుగులు సాధించాడు. అదే పంత్ మాత్రం ఆరుకు ఆరుమ్యాచ్ ల బరిలోకి దిగినా..సంజు ఒక్క ఇన్నింగ్స్ లో సాధించినన్ని పరుగులు సాధించలేకపోయాడు.

రిషభ్ పంత్ గత ఎనిమిది ఇన్నింగ్స్ లో సాధించిన స్కోర్లు 10, 15, 11, 6, 6, 3, 9, 9, 27 గా ఉన్నాయి. ఇంతగా విఫలమవుతున్న పంత్ ను ఎందుకు ఇంకా తుదిజట్టులో కొనసాగిస్తున్నారంటూ క్రికెట్ వ్యాఖ్యాతలు సైమన్ డూల్, డానిష్ కనేరియా లాంటి పలువురు తప్పు పడుతున్నారు.

పైగా...పంత్ కోసం నిలకడగా రాణిస్తున్న సంజును పక్కనపెట్టి ఎందుకు బలి పెడుతున్నారంటూ నిలదీస్తున్నారు.

అయితే..భారత కెప్టెన్లు హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్ లు మాత్రం..తనవంతు అవకాశం కోసం సంజు శాంసన్ వేచిచూడాల్సిందేనని జవాబు చెబుతున్నారు. రిషభ్ పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ కు వరుస వైఫల్యాలు ఎదురైనా తగిన అవకాశాలు ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర్థించుకొస్తున్నారు.

భారతజట్టు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పంత్ వైపే మాట్లాడుతున్నారు. సంజు గొప్పగా రాణిస్తున్నా తుదిజట్టులో చోటు కల్పించలేకపోడం దురదృష్టకరమని, క్రికెట్లో ఇది మామూలేనంటూ వివరణ ఇస్తున్నాడు.

ఏది ఏమైనా..సంజు లాంటి అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడిని తుదిజట్టును దూరం చేయటం అంటే భారతజట్టు చేతులు కాల్చుకోడం లాంటిదే. ఫార్మాట్ కు ఒక్కో నాయకుడు ఉన్నప్పుడు..టెస్టు క్రికెట్ కు రిషభ్ పంత్ ను, వన్డే, టీ-20 ఫార్మాట్లకు సంజు శాంసన్ వికెట్ కీపర్లుగా ఉంటే తప్పేంటి?..ఈ వాస్తవాన్ని బీసీసీఐ పెద్దలు సాధ్యమైనంత తర్వగా గుర్తిస్తే మంచిది.

First Published:  3 Dec 2022 5:56 AM GMT
Next Story