Telugu Global
Sports

గాయంతో సానియా రిటైర్మెంట్ వాయిదా!

వచ్చే వారం ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సైతం దూరం కాక తప్పడం లేదంటూ సానియా తన ఇన్ స్టా ద్వారా వార్తను బయటపెట్టింది. అమెరికన్ ఓపెన్‌తో టెన్నిస్ నుంచి ఘనంగా రిటైర్ కావాలనుకొన్న తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోక తప్పడం లేదని వాపోయింది.

గాయంతో సానియా రిటైర్మెంట్ వాయిదా!
X

భారత మహిళా టెన్నిస్‌ను గ్రాండ్ స్లామ్ స్థాయికి చేర్చిన సానియా మీర్జా రిటైర్మెంట్ నిర్ణయం ముంజేతి గాయంతో వాయిదా పడింది. న్యూయార్క్ లో వచ్చే వారం ప్రారంభంకానున్న అమెరికన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి అందుబాటులో లేనని ప్రకటించింది. భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ సానియా మీర్జా ఓ బిడ్డకు తల్లిగా మారిన తరువాత నుంచి తరచూ గాయాలబారినపడుతోంది. గతంలో తాను సాధించిన విజయాలు లేదా వివాదాలతో మాత్రమే వార్తలలో నిలిచిన సానియా గత కొద్ది మాసాలుగా రిటైర్మెంట్, గాయాల వార్తలతో నిలుస్తోంది.

ముందుగా నిర్ణయించుకున్న‌ ప్రకారం న్యూయార్క్ వేదికగా ఆగస్టు ఆఖరి వారంలో ప్రారంభంకానున్న ప్రస్తుత సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అమెరికన్ ఓపెన్‌లో పాల్గొనడం ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాలని భావించింది. అయితే...కొద్ది వారాల క్రితం జరిగిన కెనెడా ఓపెన్ డబుల్స్ టోర్నీలో ఆడుతున్న సమయంలో ముంజేతికి, మణికట్టుకు గాయమైంది. తొలుత అదేమంత పెద్దగాయం కాదని భావించిన రానురాను నొప్పి అధికం కావడంతో స్కానింగ్ తీయించుకొంది. దీంతో..కొద్ది వారాలపాటు ఆటకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు.

గాయం బాధాకరం...

తన ముంజేతికి, మణికట్టుకు గాయం కావడం ఏమంత సంతోషకరమైన వార్త కాదని..కొద్ది వారాలపాటు ఆటకు దూరం కావడం నిరాశ కలిగిస్తోందని, వచ్చే వారం ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సైతం దూరం కాక తప్పడం లేదంటూ సానియా తన ఇన్ స్టా ద్వారా వార్తను బయటపెట్టింది. అమెరికన్ ఓపెన్‌తో టెన్నిస్ నుంచి ఘనంగా రిటైర్ కావాలనుకొన్న తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోక తప్పడం లేదని వాపోయింది. కీలక తరుణంలో గాయం కావడం తనను కలచి వేసిందని వాపోయింది.

ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్...

భారత టెన్నిస్‌కు గత పుష్కర కాలంగా అసాధారణ సేవలు అందించిన సానియా సాధించిన విజయాలు అన్నీఇన్నీకావు. భారత మహిళలు సైతం గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టైటిల్స్ నెగ్గగలరని తన అపురూప విజయాలతో సానియా చాటి చెప్పింది. ఇటీవలే ముగిసిన 2022 వింబుల్డన్ టోర్నీమిక్సిడ్ డబుల్స్ లో క్రొయేషియా ఆటగాడు మాట్ పావిచ్‌తో జంటగా సెమీస్ వరకూ చేరింది. 2009, 2012 సంవత్సరాలలో మహేశ్ భూపతితో జంటగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్స్ సాధించిన ఘనత సానియాకు ఉంది. తన కెరియర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన సానియా 2014లో బ్రూనో సోర్స్ తో జంటగా యూఎస్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ సైతం నెగ్గింది. ఆసియా క్రీడల్లో భారత్ కు డజనుకుపైగా పతకాలు సాధించి పెట్టిన సానియా పలు డబ్లుటిఏ టోర్నీలలో సైతం విజేతగా నిలిచింది.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను జీవిత భాగస్వామిగా చేసుకొన్న సానియా మూడేళ్ల క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిగా మారిన తరువాత నుంచి సానియా ఆటలో చురుకుదనం, వేగం మందగించాయి. దీనికితోడు తరచూ గాయాలు కావడం కూడా ఆటకు అడ్డంకిగా మారడంతో రిటైర్ కావాలని నిర్ణయించుకుంది. అయితే..గాయం కారణంగానే 2022లో ఆటకు గుడ్ బై చెప్పాలన్న తన నిర్ణయాన్ని 2023కు వాయిదా వేసుకోక తప్పలేదు.

First Published:  23 Aug 2022 12:33 PM GMT
Next Story