Telugu Global
Sports

శాఫ్ ఫుట్ బాల్ 'కింగ్ ' భారత్!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టైటిల్ ను భారత్ 9వసారి గెలుచుకొని తన రికార్డును తానే తిరగరాసింది. టైటిల్ సమరంలో కువైట్ ను పెనాల్టీషూటౌట్ సడెన్ డెత్ ద్వారా అధిగమించింది.

శాఫ్ ఫుట్ బాల్ కింగ్  భారత్!
X

శాఫ్ ఫుట్ బాల్ 'కింగ్ ' భారత్!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టైటిల్ ను భారత్ 9వసారి గెలుచుకొని తన రికార్డును తానే తిరగరాసింది. టైటిల్ సమరంలో కువైట్ ను పెనాల్టీషూటౌట్ సడెన్ డెత్ ద్వారా అధిగమించింది...

శాఫ్ ( దక్షిణాసియా దేశాల ) ఫుట్ బాల్ చరిత్రలో భారత్ తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పాటు చేసుకొంది. 1993 నుంచి రెండేళ్లకోమారు జరుగుతూ వస్తున్న ఈటోర్నీలో భారత్ 9వసారి విజేతగా నిలిచి తన రికార్డును తానే తిరగరాసుకొంది.

షూటౌట్ విజయాల డబుల్....

బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా గత రెండువారాలుగా జరిగిన 14వ శాఫ్ ఫుట్ బాల్ టోర్నీలో మొత్తం ఎనిమిదిదేశాలజట్లు రెండుగ్రూపులుగా తలపడితే..గ్రూప్-ఏ లో పోటీపడిన భారత్ , కువైట్ జట్లే టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగాయి.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ టైటిల్ పోరు..సమానబలం కలిగిన రెండుజట్ల యుద్ధంలా సాగింది. గ్రూప్ లీగ్ దశలో తలపడిన సమయంలో ఈ రెండుజట్లూ 1-1తో పోటీని డ్రాగా ముగించుకోడం ద్వారా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ కు చేరుకోగలిగాయి.

తొలిసెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను ఒకే ఒక్క గోలుతో కువైట్ అధిగమిస్తే..రెండో సెమీఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్ విజయంతో 13వసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

భారత గోల్ కీపర్ గురుప్రీత్ మ్యాజిక్....

భారతజట్టు ఫైనల్స్ చేరడంలో ప్రధానపాత్ర వహించిన గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధూ..టైటిల్ సమరంలో సైతం తనజట్టును ఆదుకొన్నాడు. ఆట నిర్ణితసమయంలో రెండుజట్లూ చెరో గోలుతో సమఉజ్జీగా నిలిచాయి

ఆట మొదటి భాగం 14వ నిముషంలోనే అల్ ఖల్దీ మెరుపుగోల్ తో కువైట్ కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత నుంచి ఈక్వలైజర్ కోసం భారత్ ఎడతేగని పోరాటమే చేసింది. అందివచ్చిన అవకాశాలను భారత స్ట్ర్రయికర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అయితే..ఆట 39వ నిముషంలో లాలియాన్జులా చాంగ్టీ భారత్ తరపున గోల్ సాధించడంతో స్కోరు 1-1 తో సమమయ్యింది.

ఆ తర్వాత నుంచి విజయానికి అవసరమైన గోల్ కోసం రెండుజట్లూ తీవ్రంగా పోరాడిన సఫలం కాలేకపోయాయి. ఆటను అదనపు సమయానికి పొడిగించినా స్కోరు 1-1గానే మిగిలింది.

షూటౌట్లోనూ అదే సీన్...

విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ ను పాటించారు. భారత్ తరపున ఉదాంత్ సింగ్, కువైట్ తరపున అబ్దుల్లా పెనాల్టీలను గోల్సుగా మలచడంలో విఫలమయ్యారు. భారత్‌ తరఫున కెప్టెన్‌ ఛెత్రీతో పాటు సందేశ్‌, సుభాశిశ్‌, చాంగ్టే, మహేశ్‌ గోల్స్‌ చేయగా.. ఉదాంత సింగ్‌ విఫలమయ్యాడు. ఇందులోనూ రెండుజట్లు 4-4 గోల్స్ స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి.

దీంతో సడెన్ డెత్ ను ప్రవేశపెట్టారు. సడెన్ డెత్ లో భారత్ తరపున మహేశ్ నోయిరమ్ గోల్ సాధించాడు. అయితే కువైట్ ఆటగాడు హజియా కొట్టిన కిక్ ను భారత గోల్ కీపర్ గురుప్రీత్ అడ్డుకొని భారత్ కు 5-4 గోల్స్ విజయం అందించాడు.

ఈ విజయంతో భారత్ 9వసారి శాఫ్ ఫుట్ బాల్ ట్రోఫీని అందుకోగలిగింది. సెమీఫైనల్లో లెబనాన్‌పై షూటౌట్‌లోనే నెగ్గిన భారత్ ..ఫైనల్లో సైతం పెనాల్టీ షూటౌట్ ద్వారానే విజేతగా నిలవడం విశేషం.

14 టోర్నీలలో 9 టైటిల్స్...

భారతజట్టు ఇప్పటి వరకూ జరిగిన మొత్తం 14 శాఫ్ కప్ టోర్నీలలో 13సార్లు ఫైనల్స్ చేరడంతో పాటు..రికార్డుస్థాయిలో 9వసారి విజేతగా నిలిచింది. 1993, 97, 99, 2005, 2009, 2011, 2015, 2021, 2023 శాఫ్ ట్రోఫీలను భారత్ అందుకొన్నట్లయ్యింది.

భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ మొత్తం ఐదుగోల్స్ తో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. 38సంవత్సరాల వయసులో సునీల్ ఛెత్రీ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ఇటీవలే ముగిసిన ఇంటర్ కాంటినెంటల్ కప్ విజయం ద్వారా తన ర్యాంక్ ను 101 నుంచి 100కు మెరుగుపరచుకొన్న భారతజట్టు..శాఫ్ టోర్నీలో సైతం విజేతగా నిలవడం ద్వారా దక్షిణాసియా దేశాల సాకర్ దిగ్గజంగా తన ప్రత్యేకతను చాటుకోగలిగింది.

First Published:  5 July 2023 6:45 AM GMT
Next Story