Telugu Global
Sports

ఛెత్రీ హ్యాట్రిక్, పాక్ పై భారత్ భారీగెలుపు!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టోర్నీలో భారత్ భారీవిజయంతో టైటిల్ వేట మొదలు పెట్టింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఛెత్రీ హ్యాట్రిక్, పాక్ పై భారత్ భారీగెలుపు!
X

ఛెత్రీ హ్యాట్రిక్, పాక్ పై భారత్ భారీగెలుపు!

దక్షిణాసియా దేశాల ఫుట్ బాల్ టోర్నీలో భారత్ భారీవిజయంతో టైటిల్ వేట మొదలు పెట్టింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

2023 శాఫ్ కప్ ఫుట్ బాల్ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ భారత్..భారీవిజయంతో టైటిల్ వేట మొదలు పెట్టింది.

బెంగళూరులోని శ్రీకంఠీరవ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది ( భారత్, పాకిస్థాన్,నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, కువైట్, లెబనాన్ )దేశాలజట్లు తలపడుతున్నాయి.

గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. గత టోర్నీ విజేత, ఆతిథ్య భారత్ ప్రారంభ గ్రూపులీగ్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్స్ కు మరో గెలుపు దూరంలో నిలిచింది.

సునీల్ ఛెత్రీ షో....

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం 101వ ర్యాంక్ లో ఉన్న భారత్ కు 195వ ర్యాంకర్ పాకిస్థాన్ ఏ విధంగానూ సమఉజ్జీగా నిలువలేకపోయింది.

వెటరన్ ఫార్వర్డ్ సునీల్ ఛెత్రీ నాయకత్వంలోని భారత్ ఈ తొలిరౌండ్ పోటీలో వీరవిహారమే చేసింది.

భారత్ సాధించిన మొత్తం 4 గోల్స్ లో కెప్టెన్ సునీల్ ఛెత్రీ సాధించినవే మూడు గోల్స్ ఉన్నాయి.ఆట మొదటి భాగంలో రెండు, రెండో భాగంలో మరో రెండు గోల్స్ చేయడం ద్వారా భారత్ భారీవిజయంతో శుభారంభం చేయగలిగింది.

పాక్ డిఫెండర్లు పదేపదే పొరపాట్లు చేయటం భారత్ కు బాగా కలిసొచ్చింది. ఆట ప్రారంభంలోనే సునీల్ ఛెత్రీ తొలిగోల్ సాధించడం ద్వారా తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ వెంటనే పాక్ డిఫెండర్ పొరపాటుతో లభించిన పెనాల్టీని సునీల్ ఛెత్రీ గోలుగా మలచడంతో భారత్ 2-0తో పైచేయి సాధించడంతో ఆట మొదటి భాగం ముగిసింది.

ఆట రెండోభాగంలో సునీల్ ఛెత్రీ మూడోగోల్‌ తో హ్యాట్రిక్ పూర్తి చేయగా..ఆఖరి 10 నిముషాలలో సబ్సిట్యూట్ గా ఫీల్డ్ లోకి దిగిన ఉదాంతా సింగ్ సాధించిన గోలుతో భారత్ 4-0 గోల్స్ తో విజేతగా నిలిచింది.

భారతజట్టు ఆడిన గత ఏడు అంతర్జాతీయమ్యాచ్ ల్లో ఏడుకు ఏడు విజయాలు సాధించడం విశేషం.

సునీల్ ఛెత్రీ సరికొత్త రికార్డు...

పాకిస్థాన్ పై భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్ సాధించడం ద్వారా అంత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆసియా సాకర్ రెండో ప్లేయర్ గా రికార్డుల్లో నిలిచాడు.

ఆసియాస్థాయిలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన సాకర్ ప్లేయర్ రికార్డు ఇరాన్ కు చెందిన అలీ దాయ్ పేరుతో ఉంది. అలీ దాయ్ 149 మ్యాచ్ ల్లో 109 గోల్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు.

భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ 90 అంతర్జాతీయ గోల్స్ తో ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచ స్థాయిలో ఒకే దేశం తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన మొదటి ఇద్దరు సాకర్ గ్రేట్లలో క్రిస్టియానో రొనాల్డో ( పోర్చుగల్, లయనల్ మెస్సీ ( అర్జెంటీనా ) ఉంటే..సునీల్ ఛెత్రీ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రస్తుత శాప్ కప్ గ్రూప్ లీగ్ లో భారత్ తన మిగిలిన మ్యాచ్ ల్లో కువైట్, నేపాల్ జట్లతో తలపడాల్సి ఉంది. మిగిలిన రెండురౌండ్లలో ఒక్క మ్యాచ్ నెగ్గినా..సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

1993 ప్రారంభ శాఫ్ కప్ నుంచి 2021 టోర్నీ వరకూ 12సార్లు ఫైనల్స్ చేరి..8సార్లు విజేతగా నిలిచిన భారతజట్టు 9వసారి విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  22 Jun 2023 6:00 AM GMT
Next Story