Telugu Global
Sports

సచిన్ తనయకు ఎంత కష్టం, ఎంత కష్టం!

మాస్టర్ సచిన్ టెండుల్కర్ గారాలపట్టి సారాకు ఎక్కడలేని కష్టం వచ్చి పడింది.

సచిన్ తనయకు ఎంత కష్టం, ఎంత కష్టం!
X

మాస్టర్ సచిన్ టెండుల్కర్ గారాలపట్టి సారాకు ఎక్కడలేని కష్టం వచ్చి పడింది. వెర్రితలల సోషల్ మీడియా ఊహాత్మక కథనాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం పూర్వజన్మసుకృతమేనని అందరూ అనుకోడం సహజం. అయితే..సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలెబ్రిటీల పిల్లల కష్టాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.

మొన్నటి వరకూ సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఓ క్రికెట్ వారసుడిగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ కష్టాల పాలయ్యాడు. అదీ చాలదన్నట్లు ఇప్పుడు సచిన్ తనయ సారా టెండుల్కర్ సైతం చిన్నవయసులోనే పడరాని పాట్లు పడుతోంది.

ఫోటోల మార్ఫింగ్..ఊహాగాన కథనాలు...

సచిన్ కుమార్తె సారా ఇంగ్లండ్ లో ఉన్నత చదువులు చదువుకొంటూ తనమానాన తను బతుకుతుంటే..సోషల్ మీడియాలో మాత్రం అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నరీతిలో ..మార్ఫింగ్ పోటోలతో రోజుకో కథనం రావడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది.

భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ తో సారాకు లేనిపోని సంబంధాన్ని అంటగడుతూ ఇన్ స్టా గ్రామ్ స్టోరీలతో పాటు..యూట్యూబ్ లోనూ క్లిప్పింగ్ లు హల్ చల్ చేస్తున్నాయి.

తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్ తో కలసి దిగిన ఫోటోను శుభమన్ గిల్ ఫోటోతో మార్ఫింగ్ చేసి కథనాలు అల్లటం రానురానూ పెరిగిపోతో వస్తోంది. చివరకు సారాకు మాత్రమే కాదు...సచిన్ కుటుంబసహనానికీ పరీక్షగా మారింది.

కలతచెందిన సారా.....

సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండటమే సారాపాలిట శాపంగా మారింది. పైగా క్రికెట్ గ్రేట్ సచిన్ గారాల కూతురు కావడంతో..లైక్ లు, హిట్ల కోసం లేనిపోని కథనాలు అల్లే ప్రబుద్ధులు పెరిగిపోయారు.

సారా-శుభ్ మన్ గిల్ ల ఫోటోతో రోజుకో కథనం అల్లటం ప్రస్తుత సోషల్ మీడియాలో ఓ చెత్త ట్రెండ్ గా మారింది.

తనకు సంబంధంలేని వ్యక్తులతో, ఫోటోలను మార్ఫింగ్ చేసి లేనిపోని కథనాలు అల్లటం తనకు బాధను కలిగించిందని, ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడం లేదని సారా వాపోయింది.

ఆనందం, బాధ, భావోద్వేగాలను పంచుకోడానికి సోషల్ మీడియాను మించిన వేదిక మరొకటి లేదని..అలాంటి వేదికను తమ వ్యక్తిగత ప్రయోజనాలు, రేటింగ్ కోసం దుర్వినియోగం చేసేవారు ఎక్కువ కావడం తనకు వేదన కలిగించిందని, ఫేక్ స్టోరీలు, వీడియోలు, చిత్రాలతో వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యక్తులపై గతంలో ట్విట్టర్ గా..ప్రస్తుతం -X గా ఉన్న సంస్థ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సారా డిమాండ్ చేసింది. వాస్తవాలు కాని కథనాలను ఎలా అనుమతిస్తారంటూ నిలదీసింది. సంచలనం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేస్తున్న వ్యక్తుల ఎకౌంట్లను రద్దు చేయాలని కోరింది.

తనకు ట్విట్టర్ కమ్ -Xలో ఇప్పటి వరకూ ఎకౌంట్ లేనేలేదని సారా వివరించింది.

వాస్తవాలను వక్రీకరించి పైశాచిక వినోదం పొందటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సారా తన ప్రకటనలో తేల్చి చెప్పింది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీ ద్వారా సారా తన ఆవేదనను, ఆక్రోశాన్ని అభిమానులతో పంచుకొంది.

మనదేశంలో బడారాజకీయ పార్టీల నుంచి రేటింగ్, సంచలనాల కోసం పాకులాడే సగటు నెటిజన్ల వరకూ వాస్తవాలకు మసిపూసి లేనివి ఉన్నట్లుగా..ఉన్నవి లేనట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం కరోనా కంటే ప్రమాదకరమైన జాఢ్యంగా మారిపోయింది.

First Published:  24 Nov 2023 7:37 AM GMT
Next Story