Telugu Global
Sports

రోహిత్, గిల్ సెంచరీలతో టెస్టుపై భారత్ పట్టు!

ఐసీసీ టెస్టు లీగ్ ఆఖరి టెస్టులో సైతం ఇంగ్లండ్ పై భారత్ పైచేయి సాధించింది. భారీతొలిఇన్నింగ్స్ ఆధిక్యతతో పట్టు బిగించింది.

రోహిత్, గిల్ సెంచరీలతో టెస్టుపై భారత్ పట్టు!
X

ఐసీసీ టెస్టు లీగ్ ఆఖరి టెస్టులో సైతం ఇంగ్లండ్ పై భారత్ పైచేయి సాధించింది. భారీతొలిఇన్నింగ్స్ ఆధిక్యతతో పట్టు బిగించింది.

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ లో ఆతిథ్య భారత్ రికార్డు విజయానికి మార్గం సుగమం చేసుకొంది. మొదటి నాలుగు టెస్టుల్లోనే వరుసగా మూడువిజయాలతో ఇప్పటికే 3-1తో సిరీస్ ఖాయం చేసుకొన్న రోహిత్ సేన 4-1 విజయంతో సరికొత్త రికార్డుకు ఉరకలేస్తోంది.

రెండోరోజుఆటలోనూ అదేజోరు....

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరిటెస్టు తొలిరోజుఆటలో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించిన భారత్..రెండోరోజు ఆటలో సైతం అదే జోరు కొనసాగించింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ శుభ్ మన్ గిల్ రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో పాటు వ్యక్తిగతంగా సెంచరీలతో చెలరేగిపోయారు.

ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజుఆటలో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ కు రోహిత్- గిల్ చక్కటి భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు. ఇంగ్లండ్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగుల మోత మోగించారు.

రోహిత్ 12వ శతకం...

ప్రస్తుత సిరీస్ లో భాగంగా రాజకోట వేదిక జరిగిన నాలుగోటెస్టులో తన తొలిశతకం బాదిన రోహిత్..ధర్మశాల టెస్టులోనూ మూడంకెల స్కోరు సాధించగలిగాడు.

రోహిత్ 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

భారత కెప్టెన్ టెస్ట్ కెరియర్ లో ఇది 12వ శతకం కాగా...ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 5వ సెంచరీ కావడం విశేషం. చివరకు భారత స్కోరు 273 వద్ద ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో రోహిత్ బౌల్డ్ అయ్యాడు.

మరోవైపు..యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ సైతం ప్రస్తుత సిరీస్ లో తన రెండో శతకం పూర్తి చేశాడు. గిల్ కేవలం 150 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 పరుగుల స్కోరుకు వెటరన్ జేమ్స్ యాండర్సన్ కు చిక్కాడు.

పడిక్కల్- సరఫ్రాజ్ హాఫ్ సెంచరీలు..

రోహిత్- గిల్ జోడీ తరువాత మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్- సరఫ్రాజ్ ఖాన్ జోడీ సైతం మరో చక్కటి భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా భారత్ టీ-విరామానికే తొలిఇన్నింగ్స్ ఆధిక్యాన్ని భారీగా పెంచుకోగలిగింది.

ఈ ఇద్దరు యువబ్యాటర్లు 3వ వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్ ను ముప్పతిప్పలు పెట్టారు. టెస్టు అరంగేట్రం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 103 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్ తో 65, సరఫ్రాజ్ ఖాన్ 60 బంతుల్లోనే 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 56 పరుగులకు ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో అవుటయ్యారు.

ఆ వెంట వెంటనే జడేజా 15, జురెల్ 15, అశ్విన్ 0 స్కోర్లకు వెనుదిరగడంతో భారత్ 428 పరుగులకే 8 వికెట్లు నష్టపోయింది.

9వ వికెట్ కు కీలక భాగస్వామ్యం...

భారత్ ఆలౌట్ ఖాయమనుకొన్న తరుణంలో భారత లోయర్ ఆర్డర్ జోడీ కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా 9వ వికెట్ కు కీలక భాగస్వామ్యంతో ఇంగ్లండ్ బౌలర్లను నిలువరించారు.

18 ఓవర్లపాటు ఇంగ్లండ్ బౌలర్లను విసిగించి 9వ వికెట్ కు 45 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ స్కోరును 8 వికెట్లకు 473 పరుగులకు పెంచగలిగారు.

కుల్దీప్ 58 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు, బుమ్రా 55 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులతోను నాటౌట్ గా నిలిచారు.

దీంతో భారత్ 255 పరుగుల భారీతొలిఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండోరోజుఆటను ముగించగలిగింది.

ఇంగ్లండ్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లు, హార్ట్ లే 2 వికెట్లు, యాండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మిగిలిన 2 వికెట్లకు మరో 20 పరుగులు చేర్చగలిగితే ఇంగ్లండ్ కు ఇన్నింగ్స్ ఓటమి ఎదురైనా ఆశ్చర్యపోనక్కరలేదు.

First Published:  9 March 2024 1:50 AM GMT
Next Story