Telugu Global
Sports

క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డుకు రోహిత్ శర్మ గురి!

కరీబియన్ థండర్ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డుకు భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురిపెట్టాడు. ప్రస్తుత ఆసియాకప్, రానున్న ప్రపంచకప్ లోనే సరికొత్త రికార్డు నెలకొల్పడం తన లక్ష్యమని ప్రకటించాడు.

క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డుకు రోహిత్ శర్మ గురి!
X

కరీబియన్ థండర్ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డుకు భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురిపెట్టాడు. ప్రస్తుత ఆసియాకప్, రానున్న ప్రపంచకప్ లోనే సరికొత్త రికార్డు నెలకొల్పడం తన లక్ష్యమని ప్రకటించాడు...

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సిక్సర్లు బాదితే బ్యాటర్లకు ఎంత ఆనందమో..అభిమానులకు అంతే మజాగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో వివిధ దేశాల తరపున ఎందరు క్రికెటర్లు బరిలో నిలిచినా భారీ సిక్సర్ షాట్లను అలవోకగా బాదగలిగే సత్తా ఉన్న బ్యాటర్లు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో కరీబియన్ విధ్వంసక ఓపెనర్, సునామీ హిట్టర్ క్రిస్ గేల్ ను మాత్రమే ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే..క్రికెట్ మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు క్రిస్ గేల్ పేరుతోనే ఉంది.

483 మ్యాచ్ ల్లో 553 సిక్సర్లు...

సాంప్రదాయ టెస్టులు, ఇన్ స్టంట్ వన్డే మ్యాచ్ లు, ధూమ్ ధామ్ టీ-20 మ్యాచ్ లు కలసి మొత్తం 483 ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ 553 సిక్సర్లు బాదడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఆధునిక క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్ రికార్డు క్రిస్ గేల్ పేరుతోనే ఉంది. బంతిని బలంగా బాదడంలోనూ, బౌండ్రీలైన్ ను మంచినీళ్లప్రాయంగా దాటించడంలోనూ గేల్ తర్వాతే ఎవరైనా.

గేల్ తర్వాతి స్థానంలో హిట్ మ్యాన్...

క్రిస్ గేల్ ఎడమచేతి వాటం బ్యాటర్ కాగా..సిక్సర్లు బాదుడులో గేల్ తర్వాతి స్థానంలో నిలిచిన మొనగాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. కుడిచేతి వాటం బ్యాటింగ్ తో రోహిత్ తనదైన రోజున విధ్వంసక షాట్లతో సిక్సర్ల వర్షం కురిపించడంలో తనకు తానే సాటి.

అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఆసియాకప్ గ్రూప్ లీగ్ ఆఖరిమ్యాచ్ లో నేపాల్ పై సాధించిన సిక్సర్లతో సహా మన హిట్ మ్యాన్ కేవలం 446 మ్యాచ్ ల్లోనే 539 సిక్సర్లు సాధించాడు. ఇక వన్డేలలో సైతం అత్యధికంగా 252 సిక్సర్లు బాదిన భారత తొలి, ఏకైక బ్యాటర్ రోహిత్ మాత్రమే.

గేల్ రికార్డు సాధించడమే లక్ష్యం..

శ్రీలంక, పాకిస్థాన్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 ఆసియాకప్, భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల ద్వారా..క్రిస్ గేల్ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించడమే తన లక్ష్యమని రోహిత్ శర్మ ప్రకటించాడు.

క్రిస్ గేల్ లాంటి మహా బ్యాటర్ రికార్డుకు తాను గురిపెడతానని ఏదశలోనూ భావించలేదని..అయితే అత్యధిక సిక్సర్ల ఆ రికార్డును అధిగమించే సమయం వచ్చిందని, గేల్ పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేయాలన్న ఆలోచనే తనకు వింతగా అనిపిస్తోందని చెప్పాడు.

మహేంద్ర సింగ్ ధోనీ, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్ , క్రిస్ గేల్ లా పవర్ హిట్టర్ కాకున్నా..టైమింగ్ తో గ్రౌండ్ నలుమూలలకూ సిక్సర్ షాట్లు ఆడటంలో రోహిత్ శర్మ కు ప్రత్యేక నైపుణ్యమే ఉంది.

గేల్ రికార్డుకు 14 షాట్ల దూరంలో...

క్రిస్ గేల్ పేరుతో ఉన్న 553 సిక్సర్ల రికార్డును అధిగమించాలంటే రోహిత్ మరో 14 సిక్సర్లు బాదితే చాలు. 36 సంవత్సరాల రోహిత్ శర్మ 2007లో , 22 సంవత్సరాల వయసులో తన సిక్సర్ల బాదుడును మొదలు పెట్టాడు. గత 15 సంవత్సరాలుగా సిక్సర్లు బాదుతూనే వస్తున్నాడు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకూ ఆడిన వన్డేలలో 280 సిక్సర్లు, 182 టీ-20 మ్యాచ్ ల్లో 182 సిక్సర్లు, టెస్టుల్లో 77 సిక్సర్లు నమోదు చేశాడు. 78 టెస్టుల్లో 77 సిక్సర్లు సాధించటం విశేషం.

వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఓపెనర్ గా, బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహిత్ సిక్సర్ల బాదుడులోనూ ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగే ఆసియాకప్ సూపర్ -4 మ్యాచ్ లో రోహిత్ శర్మ ఎన్ని సిక్సర్లు బాదగలడన్నదే ఇక్కడి అసలుపాయింట్.

First Published:  9 Sep 2023 4:47 AM GMT
Next Story