Telugu Global
Sports

దక్షిణాఫ్రికాగడ్డపై రోహిత్ అరుదైన రికార్డులు!

భారతకెప్ట్టెన్ రోహిత్ శర్మ సఫారీగడ్డపై రెండు అరుదైన ఘనతలు సాధించాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేయటం ద్వారా మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు.

దక్షిణాఫ్రికాగడ్డపై రోహిత్ అరుదైన రికార్డులు!
X

భారతకెప్ట్టెన్ రోహిత్ శర్మ సఫారీగడ్డపై రెండు అరుదైన ఘనతలు సాధించాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేయటం ద్వారా మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై మొట్టమొదటి టెస్టు సిరీస్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాలని భావించిన భారత కెప్టెన్ రోహిత్ పరిస్థితి వ్రతం చెడ్డా ఫలితం దక్కినట్లయ్యింది.

టెస్టు సిరీస్ నెగ్గక పోయినా..కేప్ టౌన్ టెస్ట్ నెగ్గడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టల్నికొట్టిన ఘనత సాధించాడు.

కేప్ టౌన్ వేదికగా తొలివిజయం...

గత మూడుదశాబ్దాల కాలంలో కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా భారత్ కు తొలి టెస్ట్ విజయం అందించిన కెప్టెన్ ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ప్రస్తుత 2023-24 సిరీస్ లో భాగంగా న్యూలాండ్స్ గ్రౌండ్స్ లో జరిగిన రెండోటెస్ట్ రెండోరోజు ఆటలోనే సఫారీలను ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

కేప్ టౌన్ వేదికగా ఇప్పటి వరకూ ఆడిన 7 టెస్టుల్లో భారత్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం. గతంలో ఏ భారత కెప్టెన్ సాధించని గెలుపును న్యూలాండ్స్ వేదికగా భారత్ కు రోహిత్ అందించాడు.

ప్రస్తుత టెస్టుతో కలుపుకొని 7 మ్యాచ్ లు ఆడిన భారత్ 4 పరాజయాలు, 2 డ్రా, ఓ గెలుపు రికార్డుతో నిలిచింది. సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టులో భారత్ ను దక్షిణాఫ్రికా మొదటి మూడురోజులఆటలోనే ఇన్నింగ్స్ 32 పరుగులతో చిత్తు చేస్తే..నిర్ణయాత్మక రెండోటెస్టు రెండోరోజు ఆటలోనే భారత్ నెగ్గడం ద్వారా సఫారీలను దెబ్బకు దెబ్బ తీయగలిగింది.

ధోనీ సరసన రోహిత్ ....

1992-93 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ లు ఆడుతూ వస్తున్న భారత్ ఇప్పటి వరకూ ఒక్కసారీ సిరీస్ విజేతగా నిలువలేకపోయింది. గత మూడు దశాబ్దాల కాలంలో సఫారీగడ్డపై భారత్ ఐదంటే ఐదు టెస్టుమ్యాచ్ ల్లో మాత్రమే విజయాలు సాధించగలిగింది. ఇందులో రెండుటెస్టులు జోహెన్స్ బర్గ్ న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా సాధించినవే ఉన్నాయి.

గతంలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోనే భారతజట్టు టెస్టు సిరీస్ ను డ్రాగా ముగించగలిగింది. ప్రస్తుత సిరీస్ ను రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారతజట్టు సైతం 1-1 డ్రాగా ముగించడం ద్వారా ధోనీ రికార్డును సమం చేయగలిగింది. అరుదైన రికార్డుల న్యూలాండ్స్.....

దక్షిణాఫ్రికాలోని క్రికెట్ వేదికల్లో కేప్ టౌన్ న్యూలాండ్స్ తీరే వేరు. 147 సంవత్సరాల టెస్టు చరిత్రలోనే నమోదైన పలు అరుదైన రికార్డుల్లో రెండు న్యూలాండ్స్ వేదికగా ప్రస్తుత సిరీస్ లో నమోదయ్యాయి.

టెస్ట్ మ్యాచ్ తొలిరోజుఆటలో 23 వికెట్లు పతనం కావడం, రెండుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసిపోడం, భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఆరుగురు డకౌట్లు కావడం అత్యంత అరుదైన రికార్డులుగా మిగిలాయి.

కేవలం రెండురోజుల ఆటలోనే టెస్ట్ మ్యాచ్ ముగిసిపోడం..తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగుల స్కోరుతో..భారత్ ఎదుట 78 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచడం కూడా విశేషమే.

న్యూలాండ్స్ లో భారత కింగ్ సచిన్ టెండుల్కర్...

కేప్ టౌన్ న్యూలాండ్స్ స్టేడియంలో భారత్ అత్యధికంగా 2007 సిరీస్ లో భాగంగా జరిగిన టెస్టులో 414 పరుగుల భారీస్కోరు సాధించింది. 2018 సిరీస్ లో భాగంగా ఆడిన టెస్టులో అత్యల్పంగా 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కేప్ టౌన్ వేదికగా ఆడిన 4 టెస్టులు, 7 ఇన్నింగ్స్ లో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 489 పరుగులు సాధించాడు. 1997 సిరీస్ లో భాగంగా ఆడిన టెస్టులో మాస్టర్ సచిన్ అత్యధికంగా 254 బంతులు ఎదుర్కొని 169 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించగలిగాడు.

కేప్ టౌన్ వేదికగా 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల రికార్డు సైతం సచిన్ పేరుతోనే ఉంది.

న్యూలాండ్స్ లో అత్యధికంగా 4 సిక్సర్లు బాదిన ఘనత రిషభ్ పంత్ కు మాత్రమే దక్కుతుంది. అత్యధికంగా 12 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డును జవగళ్ శ్రీనాథ్ సాధించాడు.

ఐదేసి వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లుగా హర్భజన్ సింగ్, శ్రీశాంత్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నిలిచారు. అత్యధికంగా 5 క్యాచ్ లు పట్టిన ఫీల్డర్ గా చతేశ్వర్ పూజారా నిలిచారు.

న్యూలాండ్స్ వేదికగా 1997 సిరీస్ లో సచిన్ టెండుల్కర్- మహ్మద్ అజరుద్దీన్ 6వ వికెట్ కు 222 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.

కేప్ టౌన్ వేదికగా అత్యధికంగా 4 టెస్టులు ఆడిన ఘనత మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు మాత్రమే ఉంది.

మొత్తం మీద సఫారీల కంచుకోట న్యూలాండ్స్ స్టేడియంలో భారత్ తన 7వ ప్రయత్నంలో కానీ టెస్టు విజయం సాధించలేకపోయింది.

First Published:  5 Jan 2024 2:30 AM GMT
Next Story