Telugu Global
Sports

ఏడాది సాధన...సెమీస్ ఓటమితో కన్నీరుమున్నీరు!

అంచనాలకు అందనిరీతిలో, సంచలనాలతో సాగుతున్న ప్రపంచకప్ ఆఖరి (టైటిల్ )పోరుకు మాజీ విజేతలు పాకిస్థాన్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. అయితే..సెమీఫైనల్లో తమ ఓటమిని జీర్ణించుకోడం కష్టమంటూ కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ప్రకటిస్తే..భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కన్నీటితోనే తన సమాధానం చెప్పాడు.

Rohit Sharma
X

రోహిత్ శర్మ

ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ ప్రపంచకప్ టైటిల్ ఆశలు సెమీఫైనల్లోనే ఆవిరైపోడంతో భారతజట్టు సభ్యులు మాత్రమే కాదు..శతకోటి భారత అభిమానులు సైతం నిరాశలో పడిపోయారు.ఓటమికి కారణాలపై పోస్ట్ మార్టమ్ మొదలు పెట్టిన బీసీసీఐ 2024 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని పలువురు సీనియర్లను సాగనంపాలని భావిస్తోంది...

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న 2022 టీ-20 టైటిల్ రేస్ నుంచి మాజీ చాంపియన్, టాప్ ర్యాంకర్ భారత్ సైతం వైదొలగడంతో మరో భారీసంచలనం నమోదయ్యింది.

గతేడాది విజేత, ఆతిథ్య ఆస్ట్ర్లేలియా దక్షిణాఫ్రికా, శ్రీలంకజట్లు సూపర్ -12 దశ నుంచే ఇంటిదారి పడితే రన్నరప్ న్యూజిలాండ్, ప్రపంచ నంబర్ వన్ జట్ల పోరు సెమీఫైనల్స్ లోనే ముగిసింది

అంచనాలకు అందనిరీతిలో, సంచలనాలతో సాగుతున్న ప్రపంచకప్ ఆఖరి (టైటిల్ )పోరుకు మాజీ విజేతలు పాకిస్థాన్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. అయితే..సెమీఫైనల్లో తమ ఓటమిని జీర్ణించుకోడం కష్టమంటూ కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ప్రకటిస్తే..భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కన్నీటితోనే తన సమాధానం చెప్పాడు.

ఏడాదిసాధన బూడిదలో పోసిన పన్నీరు!

రాహుల్ ద్రావిడ్ ప్రధానశిక్షకుడిగా, రోహిత్ శర్మ కెప్టెన్ గా భారతజట్టు గత ఏడాదికాలంగా రకరకాల ప్రయోగాలతో పాటు సిరీస్ ల వెంట సిరీస్ లు ఆడుతూ కఠోరసాధన చేసింది. మ్యాచ్ విన్నర్ల కోసం జట్టులోని వివిధ స్థానాల కోసం 30 మందికి పైగా నవ,యువ, సెమీ సీనియర్, సీనియర్ క్రికెటర్లను పరీక్షించింది.

2022 క్రికెట్ సీజన్లోనే అత్యధిక టీ-20 మ్యాచ్ లు, సిరీస్ లు ఆడటమే కాదు...అత్యధిక విజయాలు సాధించిన ఏకైకజట్టుగా నిలిచింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా టైటిల్ వేటకు సిద్ధమవుతున్న తరుణంలో ముగ్గురు కీలక ప్లేయర్లు జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ గాయాలతో జట్టుకు దూరం కావడం కోలుకోలేని దెబ్బతీసింది. బుమ్రా, జడేజా, చాహర్ లాంటి నాణ్యమైన బౌలర్లు అందుబాటులో లేకపోడంతో భారత బౌలింగ్ ఎటాక్ కోరలు తీసిన పాములా మారిపోయింది.


ఘోరపరాజయం-తీరని అవమానం!

ఆటలో జయాపజయాలు సహజం. బాగా ఆడినజట్టు మాత్రమే విజేతగా ఉంటుంది. అది ముమ్మాటికీ నిజం. అయితే..ఏడాదిపాటు కసరత్తులు చేసి కీలకమ్యాచ్ లో చేతులెత్తేయడం, ఏమాత్రం పోటీ ఇవ్వకుండా అవమానకరమైనరీతిలో ఓటమిపాలు కావడాన్ని భారతజట్టు సభ్యులు మాత్రమే కాదు..విమర్శకులు, విశ్లేషకులు, కోట్లాదిమంది అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

169 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ఎదుట ఉంచి...17 ఓవర్లలో కనీసం ఒక వికెట్టు పడగొట్టలేక...10 వికెట్ల ఘోరపరాజయంపాలుకావడం భారత క్రికెట్ కు మాయని మచ్చగా మిగిలిపోతుంది.

తుదివరకూ పోరాడి ఆ తరువాత ఓడినా అదీ ఓ గౌరవమే. కానీ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు పరాజయం పొందిన తీరు మాత్రం ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన బీసీసీఐకి కోలుకోలేని దెబ్బలాంటిదే.

ఐపీఎల్ హీరోలు- ఐసీసీ టోర్నీలలో జీరోలు...

ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో భారత్ 1983, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలు, 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్, మినీ ( చాంపియన్స్ ట్రోఫీ ) ప్రపంచకప్ లు మాత్రమే సాధించింది.

2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ-20 ప్రపంచకప్ తో పాటు...ప్రస్తుత 2022 టోర్నీలో సైతం ఘోరపరాజయాల మూటకట్టుకోవాల్సి వచ్చింది.

రెండు నెలలు, 8వారాలపాటు సాగే ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు ఊడిగం చేస్తూ..కోట్లరూపాయలు సంపాదిస్తూ హీరోలుగా వెలుగుతున్న రాహుల్, రోహిత్ శర్మ, అశ్విన్, భువనేశ్వర్, షమీ లాంటి పలువురు సీనియర్ స్టార్లు...ప్రపంచకప్ టోర్నీలలో భారతజట్టు సభ్యులుగా జీరోలుగా మిగిలిపోతున్నారు.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, రాహుల్ చెరో ఆరుమ్యాచ్ లు ఆడి ఒక్కో హాఫ్ సెంచరీతో దారుణంగా విఫలమయ్యారు. కేవలం సూర్యకుమార్, విరాట్ లాంటి ఒకరిద్దరి ప్రతిభ కారణంగానే భారతజట్టు సూపర్ -12 రౌండ్ గ్రూప్ -2 టాపర్ గా నిలవడంతో పాటు సెమీస్ వరకూ చేరుకోగలిగింది.

పసలేని బౌలింగ్...

భారత్ వైఫల్యానికి ప్రధాన కారణం పసలేని బౌలింగ్ అని తేలిపోయింది. టోర్నీ ప్రారంభానికి ముందే భారత బౌలింగ్ లో సరుకు, కరుకు లేదని, ఇలాంటి బౌలింగ్ ఎటాక్ తో అసలు ప్రపంచ టైటిల్ ఎలా సాధించగలరంటూ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ప్రశ్నించారు. చివరకు సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల విజయంతో అది నిజమేనని తేలిపోయింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఫాస్ట్ బౌలర్లకే కంగారూ పిచ్ లపైన వికెట్లు పడగొట్టే సత్తా ఉంటుంది.

భారతజట్టులో ఒక్కరంటే ఒక్కరు మెరుపు ఫాస్ట్ బౌలర్ లేకపోడం భారతజట్టు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఏడాదికి 7 కోట్ల రూపాయల బీసీసీఐ కాంట్రాక్టు, ఐపీఎల్ కాంట్రాక్టులతో కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి కీలక బౌలర్లు ఐపీఎల్ సమయంలో ఫిట్ గా ఉండటం, భారతజట్టుకు సేవలు అందించాల్సిన కీలక సమయంలో గాయాలపాలు కావడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ కు దూరమైన ఈ ఇద్దరూ..వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి పూర్తి ఫిట్ నెస్ తో తమతమ ఫ్రాంచైజీల సేవకు సిద్ధంగా ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

వయసు మీరిన క్రికెటర్లే ఎక్కువ...

టీ-20 ప్రపంచకప్ అంటేనే కుర్రాళ్ల ఆట. కానీ భారతజట్టును చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 35 సంవత్సరాలు, మాజీ కెప్టెన్ విరాట్ వయసు 34 ఏళ్లు, వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వయసు 37 సంవత్సరాలు. షమీ, బువీ, అశ్విన్ 32 సంవత్సరాల వయసు వారే. విరాట్ కొహ్లీ మినహా మిగిలిన ఆటగాళ్లతో భారతజట్టుకు ఒరిగింది ఏమీలేదని గణాంకాలే చెబుతున్నాయి.

అంతేకాదు..ఆస్ట్ర్లేలియా ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపైన మణికట్టుతో మాయ చేసే లెగ్ బ్రేక్ -గుగ్లీ బౌలర్లకు వికెట్లు పడగొట్టే అవకాశం ఉంటుంది. అయితే...భారత టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం జాదూ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ ను డగౌట్ కే పరిమితం చేసి..ఫింగర్ స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ లతోనే మొత్తం ఆరుమ్యాచ్ లూ ఆడేటం కూడా జట్టు పాలిట శాపంగా మారింది.

కర్ణుడుచావుకు కారణాలు కోటి అన్నట్లు..భారతజట్టు పరాజయానికి కారణాలు ఎన్నెన్నో. ప్రస్తుత వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని మరో రెండేళ్లలో జరిగే 2024 ప్రపంచకప్ కు ప్రతిభావంతులతో కూడిన ఉరకలేసే యువజట్టును సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రపంచకప్ ఏడాదిలో కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక తప్పదు.

వారికి ఇదే ఆఖరి ప్రపంచకప్...

దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలకు అదే ఆఖరి టీ-20 ప్రపంచకప్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్, విరాట్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఒకటి రెండేళ్లు నెట్టుకు వచ్చినా...ప్రపంచకప్ నాటికి ఎలాంటి ఫామ్ లో ఉంటారన్నది అనుమానమే!

భారతజట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడింది కనుక సరిపెట్టుకోవచ్చు. అదే పొరుగుదేశం పాకిస్థాన్ చేతిలో పరాజయం పొందిఉంటే..యుద్ధంలో ఓడినంత పనయ్యేది. క్రికెట్ ను క్రికెట్ గానే చూడాలి. దేశభక్తి, భావోద్వేగాలతో ముడిపెట్టి చూస్తే ..అది క్రీడాస్ఫూర్తికి, క్రికెట్ స్ఫూర్తికే విరుద్ధమని చెప్పక తప్పదు.!

First Published:  11 Nov 2022 10:40 AM GMT
Next Story