Telugu Global
Sports

వన్డేలకు రోహిత్, టీ-20లకు హార్థిక్!

కొత్తసంవత్సరంలో శ్రీలంకతో జరిగే టీ-20, వన్డే సిరీస్ ల్లో భారత్ కు వేర్వేరు కెప్టెన్లను బీసీసీఐ ఖరారు చేసింది.

వన్డేలకు రోహిత్, టీ-20లకు హార్థిక్!
X

కొత్తసంవత్సరంలో శ్రీలంకతో జరిగే టీ-20, వన్డే సిరీస్ ల్లో భారత్ కు వేర్వేరు కెప్టెన్లను బీసీసీఐ ఖరారు చేసింది. టీ-20 జట్టుకు హార్థిక్ పాండ్యా, వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారు.

భారత క్రికెట్ జట్టు కొత్తసంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించనుంది. జనవరి 3 నుంచి శ్రీలంకతో జరిగే తీన్మార్ టీ-20, వన్డే సిరీస్ లకు వేర్వేరు కెప్టెన్లను, వైస్ కెప్టెన్లను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకొంది.

మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు హార్థిక్ పాండ్యా కెప్టెన్ గాను, మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గాను వ్యవహరిస్తారు.

సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కొహ్లీలతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను సైతం జట్టుకు దూరంగా ఉంచారు.

ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపికయ్యాడు. జట్టులో చోటు సంపాదించిన ఇతర ఆటగాళ్లలో రితురాజ్ గయక్వాడ్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ , హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావీ, ముకేశ్ కుమార్ ఉన్నారు.

రోహిత్ నాయకత్వంలోనే వన్డేజట్టు....

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడుతూ చేతివేలి గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోడంతో తిరిగి జట్టు పగ్గాలు అప్పగించారు.

శిఖర్ ధావన్ వన్డేజట్టులో సైతం స్థానం కోల్పోయాడు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని వన్డేజట్టులో శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఉమ్రన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఉన్నారు.

జనవరి 3 నుంచి టీ-20 సిరీస్...

మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని తొలిమ్యాచ్ ముంబై వేదికగా జనవరి 3న జరుగుతుంది. జనవరి 5న జరిగే రెండోమ్యాచ్ కు పూణే ఆతిథ్యమిస్తుంది. సిరీస్ లోని ఆఖరి టీ-20 రాజ్ కోట వేదికగా జనవరి 7న నిర్వహిస్తారు.

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డే జనవరి 10న గువాహతి వేదికగా జరుగుతుంది. రెండోవన్డేకి కోల్ కతా జనవరి 12, మూడో వన్డేకి తిరువనంతపురం జనవరి 15న ఆతిథ్యమివ్వనున్నాయి.

First Published:  28 Dec 2022 5:09 AM GMT
Next Story