Telugu Global
Sports

యూఎస్ ఓపెన్ డబుల్స్ సెమీస్ లో రోహన్ జోడీ!

2023 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్ లో డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బోపన్న భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు. ఆస్ట్ర్రేలియాకు చెందిన మాథ్యూ ఇబ్ డెన్ తో జంటగా సెమీస్ కు అర్హత సంపాదించాడు.

యూఎస్ ఓపెన్ డబుల్స్ సెమీస్ లో రోహన్ జోడీ!
X

అమెరికన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్ కు భారత డేవిస్ కప్ స్టార్ రోహన్ బోపన్నజోడీ చేరుకొంది. 2010 తర్వాత సెమీస్ చేరడం ఇదే మొదటిసారి...

2023 గ్రాండ్ స్లామ్ సీజన్ ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్ లో డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బోపన్న భారత పతాకాన్ని రెపరెపలాడిస్తున్నాడు. ఆస్ట్ర్రేలియాకు చెందిన మాథ్యూ ఇబ్ డెన్ తో జంటగా సెమీస్ కు అర్హత సంపాదించాడు.

మహిళల సింగిల్స్ లో అమెరికన్ యువసంచలనం కోకో గాఫ్ సెమీస్ చేరిన తొలి ప్లేయర్ గా నిలిచింది.

43 ఏళ్ల వయసులో రోహన్ జోరు...

టెన్నిస్ క్రీడలో రాణించాలంటే వయసుతో ఏమాత్రం సంబంధం లేదని భారత వెటరన్ స్టార్, 43 సంవత్సరాల రోహన్ బొపన్న తన ఆటతీరుతో చాటి చెబుతున్నాడు.

ఆస్ట్ర్రేలియా ఆటగాడు మాథ్యూ ఇబ్ డెన్ తో కలసి 6వ సీడ్ హోదాలో ప్రస్తుత యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ బరిలో నిలిచాడు. 2010 తర్వాత తొలిసారిగా అమెరికన్ ఓపెన్ సెమీస్ బెర్త్ సాధించాడు.

న్యూయార్క్ లోని సర్ ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్సో లో రోహన్ జోడీ 7-6, 6-1తో నాతనీల్ లామోన్స్- జాక్సన్ విత్రూ జోడీని ఓడించడం ద్వారా సెమీస్ చేరుకోగలిగారు.

ప్రస్తుత గ్రాండ్ స్లామ్ సీజన్లో ఇప్పటికే వింబుల్డన్ సెమీస్ చేరిన రోహన్ బోపన్నజోడీ..యూఎస్ ఓపెన్ సెమీస్ కు సైతం చేరుకోడం విశేషం.

2010 యూఎస్ ఓపెన్ ఫైనల్స్ కు తొలిసారిగా చేరిన రోహన్ 12 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సెమీస్ చేరగలిగాడు. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో ఫ్రెంచ్ జోడీ పియరీ- హ్యూజెస్ హెర్బర్ట్- నికోలస్ మహుట్ లతో తలపడనున్నారు.

మహిళల సింగిల్స్ లో కోకో టాప్ గేర్...

మహిళల సింగిల్స్ లో అమెరికా ఆశాకిరణం 19 సంవత్సరాల కోకో గాఫ్ అలవోకగా సెమీస్ కు దూసుకెళ్లింది. ప్రస్తుత యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సెమీస్ చేరిన తొలి ప్లేయర్ గా నిలిచింది.

6వ సీడ్ గా టైటిల్ వేటకు దిగిన కోకో 6-0, 6-2తో జెలెనా ఓస్టాపెంకోను చిత్తు చేసింది. తొలిసెట్ ను కేవలం 20 నిముషాలలోనే 6-0తో నెగ్గిన కోకో..రెండోసెట్లో మాత్రం ప్రత్యర్థికి 2 గేమ్ లకు మాత్రమే పరిమితం చేసింది. గంటా 8 నిముషాలలోనే కోకో క్వార్టర్స్ విజయం పూర్తి చేయగలిగింది.

2001లో సెరెనా విలియమ్స్ అమెరికన్ ఓపెన్ సెమీస్ చేరిన తరువాత..12 సంవత్సరాల తర్వాత కోకో గాఫ్ సెమీస్ చేరుకోగలిగింది.

ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో...కారోలిన్ ముచోవా లేదా సోరానా సిరిస్టియాల పోరులో నెగ్గిన క్రీడాకారిణితో తలపడాల్సి ఉంది. గతేడాది క్వార్టర్ ఫైనల్స్ లో పరాజయం పొందిన తాను..ఈ ఏడాది సెమీస్ వరకూ రావడం సంతృప్తినిచ్చిందని, తదుపరి రౌండ్లలోనూ ఇదేజోరు కొనసాగిస్తానని కోకో చెప్పింది.

వింబుల్డన్ తొలిరౌండ్లోనే పరాజయం చవిచూసిన తరువాత కోకో ఆడిన గత 17 మ్యాచ్ ల్లో 16 విజయాలు సాధించడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

జబేర్ కు జెంగ్ ఝలక్...

గతేడాది రన్నరప్,ట్యునీసియా ప్లేయర్ ఓన్స్ జబేర్ పోరు మూడోరౌండ్లోనే ముగిసింది. చైనా ప్లేయర్ జిన్ వెన్ జెంగ్ 6-2, 6-4తో జబేర్ ను కంగు తినిపించింది.

గంట 22 నిముషాల పోరులో జెంగ్ విజేతగా నిలిచింది. జబేర్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జెంగ్ ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ క్వార్టర్స్ చేరడం ఇదే మొదటిసారి.

పురుషుల సింగిల్స్ పోరులో మాజీ చాంపియన్ డానిల్ మెద్వదేవ్ 2 గంటల 40 నిముషాల పోరులో 2-6, 6-1, 6-2తో అలెక్స్ డి మిన్యోర్ ను అధిగమించాడు.

క్వార్టర్ ఫైనల్స్ లో యాండ్రీ రుబ్లేవ్ తో మెద్వదేవ్ తలపడతాడు.

మరో మూడోరౌండ్ పోరులో రుబ్లేవ్ 6-3, 3-6, 6-3, 6-4తో జాక్ డ్రేపర్ ను ఓడించాడు. టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ సైతం అలవోకగా పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగాడు.

First Published:  6 Sep 2023 12:03 PM GMT
Next Story