Telugu Global
Sports

43 ఏళ్ల వయసులో యూఎస్ ఫైనల్లో రోహన్ బోపన్న!

భారతటెన్నిస్ వెటరన్ స్టార్ రోహన్ బొపన్న ఓ అరుదైన ఘనత సాధించాడు. 43 ఏళ్ల 6 నెలల వయసులో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ డబుల్స్ ఫైనల్స్ చేరిన ప్లేయర్ గా ' గ్రాండ్ ' రికార్డు నెలకొల్పాడు.

43 ఏళ్ల వయసులో యూఎస్ ఫైనల్లో రోహన్ బోపన్న!
X

భారతటెన్నిస్ వెటరన్ స్టార్ రోహన్ బొపన్న ఓ అరుదైన ఘనత సాధించాడు. 43 ఏళ్ల 6 నెలల వయసులో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ డబుల్స్ ఫైనల్స్ చేరిన ప్లేయర్ గా ' గ్రాండ్ ' రికార్డు నెలకొల్పాడు.

భారత టెన్నిస్ డబుల్స్ దిగ్గజ ఆటగాడు రోహన్ బొపన్న 2023 అమెరికన్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా సరికొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టాడు.

ఆస్ట్ర్రేలియాకు చెందిన మాథ్యూస్ అబెడెన్ తో జంటగా టైటిల్ రౌండ్లో అడుగుపెట్టాడు.

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈటోర్నీ డబుల్స్ బరిలోకి 6వ సీడ్ హోదాలో ఆడుతున్న రోహన్ జోడీ సెమీఫైనల్లో ఫ్రెంచ్ జోడీ పియ‌రీ హ్యూజ‌స్ హెర్బ‌ర్ట్‌, నికోల‌స్ మాహుట్‌ల‌ను 7-6 (7-3), 6-2తో అధిగమించడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సంపాదించారు.

ఈ క్రమంలో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత లేటు ( 43 సంవత్సరాల 6 నెలల ) వయసులో ఫైనల్స్ చేరిన తొలి, ఏకైక ఆటగాడిగా నిలిచాడు. గతంలో కెనడా ఆటగాడు డేనియల్ నెస్టర్ 43 ఏళ్ళ 4 నెలల వయసులో ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేరుకోగా..ఆ రికార్డును ప్రస్తుత యూఎస్ ఓపెన్ ద్వారా రోహన్ బొపన్న తెరమరుగు చేశాడు.

యూఎస్ ఓపెన్ ఫైన‌ల్ కి బొపన్న చేరడం ఇది రెండోసారి. 13 సంవత్సరాల క్రితం తొలిసారిగా పాక్ ఆటగాడు అసిమ్ ఉల్ హ‌క్ ఖురేషి భాగ‌స్వామిగా క‌లిసి యూఎస్ ఓపెన్ ఫైనల్స్ చేరినా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అల్ కరాజ్...

మరోవైపు..పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కు స్పానిష్ యువకెరటం, డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కార్లోస్ అల్ కరాజ్ అలవోకగా చేరుకొన్నాడు.

క్వార్టర్ ఫైనల్లో జర్మనీకి చెందిన 12వ సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ ను ప్రపంచ నంబర్ వన్ అల్ కరాజ్ 6-3, 6-2, 6-4తో చిత్తు చేసి..వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ సెమీస్ చేరుకోగలిగాడు.

నిప్పులు చెరిగే ఎండవేడి వాతావరణంలో సాగిన ఈ మ్యాచ్ ను 2 గంటల 30 నిముషాలలో అల్ కరాజ్ సొంతం చేసుకోగలిగాడు. ఈ మ్యాచ్ చూడటానికి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం హాజరుకావటం విశేషం.

ఫైనల్లోచోటు కోసం జరిగే సెమీస్ పోరులో రష్యా ఆటగాడు డానిల్ మెద్వదేవ్ తో అల్ కరాజ్ పోటీపడనున్నాడు.

First Published:  8 Sep 2023 11:55 AM GMT
Next Story