Telugu Global
Sports

44 ఏళ్ల వయసులో రోహన్ బొపన్నకు మాస్టర్స్ టైటిల్ !

భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న తన రికార్డును తానే అధిగమించాడు. మియామీ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

44 ఏళ్ల వయసులో రోహన్ బొపన్నకు మాస్టర్స్ టైటిల్ !
X

భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహన్ బొపన్న తన రికార్డును తానే అధిగమించాడు. మియామీ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత వెటరన్ స్టార్ రోహన్ బొపన్న- మాథ్యూ ఇబ్డెన్ ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఏటీపీ టూర్ -1000 పరంపరలో భాగంగా మియామీ వేదికగా జరిగిన టోర్నీలో సైతం టాప్ సీడింగ్ జోడీకి ఎదురేలేకపోయింది.

హోరాహోరీగా టైటిల్ సమరం...

నువ్వానేనా అన్నట్లుగా సాగిన టైటిల్ సమరం రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డోడిచ్- అమెరికాకు చెందిన ఆస్టిన్ క్రైచిక్ జోడీతో జరిగిన టైటిల్ సమరంలో రోహన్ జోడీ మూడుసెట్ల విజయంతో విజేతగా నిలిచారు.

తొలిసెట్ ను టై బ్రేక్ లో 6-7తో కోల్పోయిన రోహన్ జోడీ ..ఆ తర్వాతి రెండుసెట్లను 6-3, 10- 6తో కైవసం చేసుకొని మాస్టర్స్ ట్రోఫీ అందుకొన్నారు. ఈ విజయంతో 44 సంవత్సరాల లేటు వయసులో మాస్టర్స్ టైటిల్ నెగ్గిన మొనగాడిగా రోహన్ నిలిచాడు. గతేడాది 43 సంవత్సరాల వయసులో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ నెగ్గడం ద్వారా నెలకొల్పిన తన రికార్డును తానే అధిగమించడం ద్వారా రోహన్ చరిత్ర సృష్టించగలిగాడు.

సెమీఫైనల్లో మార్సెల్ గ్రనోలెర్స్- హోరాసియా జోడీని 6-1, 6-4తో చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టారు.

లియాండర్ పేస్ సరసన రోహన్...

ఏటీపీ టూర్ మాస్టర్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే మొత్తం తొమ్మిది టోర్నీల ఫైనల్స్ కు చేరిన తొలి ఆటగాడి ఘనత లియాండర్ పేస్ దక్కించుకొంటే..ఇప్పుడు రోహన్ బొపన్న సైతం అదే రికార్డును సమం చేయడం ద్వారా పేస్ సరసన నిలువగలిగాడు.

మే 20 నుంచి జరుగనున్న ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్- ఇబ్డెన్ జోడీ హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగనున్నారు.

First Published:  31 March 2024 8:22 AM GMT
Next Story