Telugu Global
Sports

మృత్యు ఒడిలో నుంచి ఐపీఎల్ సారథిగా రిషభ్ పంత్!

మృత్యుంజయుడు రిషభ్ పంత్ ను ఢిల్లీ ఫ్రాంచైజీ 2024 సీజన్ ఐపీఎల్ కెప్టెన్ గా నియమించింది. రిషభ్ రీ-ఎంట్రీకి జాతీయ క్రికెట్ అకాడమీ నిపుణుల బృందం సైతం ఆమోదం తెలిపింది.

మృత్యు ఒడిలో నుంచి ఐపీఎల్ సారథిగా రిషభ్ పంత్!
X

మృత్యుంజయుడు రిషభ్ పంత్ ను ఢిల్లీ ఫ్రాంచైజీ 2024 సీజన్ ఐపీఎల్ కెప్టెన్ గా నియమించింది. రిషభ్ రీ-ఎంట్రీకి జాతీయ క్రికెట్ అకాడమీ నిపుణుల బృందం సైతం ఆమోదం తెలిపింది.

శతాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్ చరిత్రలో ఓ మహాద్భుతం జరిగింది. మృత్యుఒడిలోనుంచి బయటపడి, కారుప్రమాదంలో శరీరం నుజ్జునుజ్జయినా మొండిపట్టుదలకు విల్ పవర్ ను జోడించడం ద్వారా పూర్తిగా తేరుకొని తిరిగి ఫీల్డ్ లో అడుగుపెట్టడం ద్వారా 26 సంవత్సరాల రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు.

మరికొద్దిగంటల్లో ప్రారంభంకానున్న 2024 సీజన్ ఐపీఎల్ టైటిల్ రేసులో దిగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథిగా రిషభ్ పంత్ ను ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.

14 మాసాల విరామం తరువాత....

డిసెంబర్ 22న ఢిల్లీ-ముస్సోరీ జాతీయరహదారిలో జరిగిన ఓ ఘోరరోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ నడుపుతున్న కారు నుజ్జునుజ్జయింది. శరీరంలోని రెండు మోకాళ్లు, పక్కటెముకలు విరిగిన రిషభ్ ను కారునుంచి బయటకు తీసి డెహ్రాడూన్, ముంబై ఆస్పత్రుల్లో చికిత్స అందించారు.ఉత్తరాఖండ్ లో తన స్నేహితులతో కలసి వేడుకలు చేసుకొని ..డిసెంబర్ 30న డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్నసమయంలో రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకొంది.

అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును రిషభ్ పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. డెహ్రాడూన్- ఢిల్లీ జాతీయ రహదారిలో.. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఆ కారు డివైడర్ ను బలంగా ఢీ కొట్టి మూడుసార్లు పల్టీలు కొట్టడంతో మంటలు చెలరేగాయి. రోడ్డుకు అటువైపుగా వెళుతున్న హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ ప్రమాదాన్ని చూసి...మంటలు రేగుతున్న కారు అద్దాలు పగుల కొట్టి రిషభ్ పంత్ ను కాపాడి రూర్కీ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు.

రెండు మోకాళ్లకూ డబుల్ సర్జరీ ....

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ కు 14 మాసాల క్రితం ముంబైలో జంట ఆపరేషన్లు నిర్వహించారు.రిషభ్ పంత్ కు నుదిటి భాగం నుంచి కాలివేలు వరకూ పలురకాలుగా గాయాలయ్యాయి. ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీతో సహా పలు రకాలుగా చికిత్స అందించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోడానికి రిషభ్ పంత్ కు 14 నెలల సమయం పట్టింది.

ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పంత్ కు చికిత్స అందిస్తూ వచ్చారు. కోకిలాబెన్ సీనియర్ వైద్యుడు డాక్టర్ దిన్ షా పర్డీవాలా పర్యవేక్షించారు. పంత్ కుడికాలి నరం తెగిపోడంతో ముందుగా శస్త్రచికిత్స నిర్వహించారు.

క్రికెట్ కు 14 మాసాలు దూరం...

రిషభ్ పంత్ పూర్తిగా కోలుకోడానికి కనీసం 9 మాసాల సమయం పడుతుందని తొలుత డాక్టర్లు భావించినా..పూర్తిగా కోలుకొని క్రికెట్ ఫీల్డ్ లో తిరిగి అడుగుపెట్టడానికి 14 మాసాలా సమయం పట్టింది. భారత క్రికెటర్లకు బీసీసీఐ కల్పించిన మెడికల్ ఇన్సూరెన్సు కింద పంత్ కు చికిత్స నిర్వహించారు.

26 సంవత్సరాల రిషభ్ పంత్ క్రికెటర్ గా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టు, ఎండార్స్ మెంట్ల ద్వారా ఇప్పటికే 100 కోట్ల రూపాయల వరకూ ఆర్జించాడు. ఖరీదైన, అత్యంత భద్రతతో కూడిన మెర్సిడెస్ కారులో ప్రయాణించిన కారణంగానే రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు.

రిషభ్ పంత్ కు ఢిల్లీ ఫ్రాంచైజీ హ్యాట్సాఫ్...

తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టడం అంతతేలిక కాదని భావించిన రిషభ్ పంత్ భారతజట్టు కోసం ఓ ఆటగాడిగా ఎంతగా పోరాడాడో, మృత్యుఒడినుంచి బయటపడి ఫిట్ నెస్ కోసం అదేస్థాయిలో పోరాడాడని, వైద్యుల సలహాలు, సూచనలు తూచతప్పకుండా పాటించడం ద్వారా తిరిగి పూర్వఫిట్ నెస్ సాధించడం, జట్టుకు అందుబాటులో రావడం మహాద్భుతమంటూ ఢిల్లీ ఫ్రాంచైజీ కొనియాడింది.

రిషభ్ చేతికి తిరిగి జట్టు పగ్గాలు అందించడం తమకు గర్వకారణమని ఫ్రాంచైజీ చైర్మన్ , కో-ఓనర్ పార్థా జిందాల్ ప్రకటించారు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఢిల్లీజట్టు సన్నాహక శిబిరంలో పంత్ పాల్గొని తన ఫిట్ నెస్ ను నిరూపించుకొన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యనిపుణుల బృందం సైతం రిషభ్ పంత్ రీ-ఎంట్రీకి అనుమతి ఇచ్చింది.

2024 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్రారంభమ్యాచ్ ను మార్చి 23న చండీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్‌ తో తలపడనుంది. వికెట్ కీపర్ బ్యాటర్ గానే పంత్ ప్రస్తుత ఐపీఎల్ లో పాల్గొంటాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

గత ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో పోటీకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10జట్ల లీగ్ లో 9వ స్థానంలో నిలిచింది. 5 విజయాలు, 9 పరాజయాలతో ఢిల్లీ దారుణంగా విఫలమయ్యింది.

First Published:  20 March 2024 3:10 AM GMT
Next Story