Telugu Global
Sports

రోహిత్, విరాట్ లకు విశ్రాంతి..భారత కెప్టెన్ గా సూర్యకుమార్!

ఆస్ట్ర్రేలియాతో ఈనెల 23 నుంచి జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.

రోహిత్, విరాట్ లకు విశ్రాంతి..భారత కెప్టెన్ గా సూర్యకుమార్!
X

ఆస్ట్ర్రేలియాతో ఈనెల 23 నుంచి జరిగే ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు...

వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లతో గత ఆరువారాలుగా ఊదరగొట్టిన భారత క్రికెట్ బోర్డు కొద్దిరోజుల వ్యవధిలోనే పాంచా పటాకా టీ-20 సిరీస్ కు రంగం సిద్ధం చేసింది.

నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకూ ఆస్ట్ర్రేలియాతో జరిగే ఈ సిరీస్ లో భారతజట్టుకు 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

12మంది ఆటగాళ్లకు విశ్రాంతి....

రోహిత్ శర్మ నాయకత్వంలో వన్డే ప్రపంచకప్ లో పాల్గొన్న 15మంది సభ్యుల భారతజట్టులోని 12 మంది ఆటగాళ్ళకు విశ్రాంతి నిచ్చి..ముగ్గురిని మాత్రమే ఆస్ట్ర్రేలియాతో టీ-20 సిరీస్ కు ఎంపిక చేశారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, శుభ్ మన్ గిల్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లకు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగర్కార్ నాయకత్వంలోని ఎంపిక సంఘం నిర్ణయించింది. గాయంతో జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యా మరికొద్దివారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడు.

టీ-20జట్టులో చోటు లేని సంజు, పరాగ్....

నవంబర్ 23న విశాఖ వేదికగా ప్రారంభమయ్యే ఈ పాంచ్ పటాకా సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, వరుస హాఫ్ సెంచరీల మొనగాడు రేయాన్ పరాగ్ లను ఎంపిక సంఘం పక్కన పెట్టింది.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని 15మంది సభ్యులజట్టుకు ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ ( వికెట్ కీపర్ ) , వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దూబే, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ ఉన్నారు.

శ్రేయస్ అయ్యర్ మాత్రం సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడు. రాయ్ పూర్, బెంగళూరు టీ-20 మ్యాచ్ ల్లో భారతజట్టుకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా సేవలు అందించనున్నాడు.

విశాఖ నుంచి బెంగళూరు వరకూ...

వన్డే ప్రపంచ చాంపియన్, పవర్ ఫుల్ ఆస్ట్రేలియాతో జరిగే ఈ సిరీస్ లోని తొలిపోరుకు నవంబర్ 23న విశాఖపట్నంలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియం వేదికకానుంది.

నవంబర్ 26న తిరువనంతపురం లోనూ, 28న గౌహతీలోనూ, డిసెంబర్ 1న రాయ్ పూర్ వేదికగాను, డిసెంబర్ 3న బెంగళూరు వేదికగాను మిగిలిన నాలుగు టీ-20 మ్యాచ్ లు నిర్వహిస్తారు.

First Published:  21 Nov 2023 2:34 AM GMT
Next Story