Telugu Global
Sports

మహిళా ఐపీఎల్ లో రికార్డుల మోత!

తొలి మహిళా ఐపీఎల్ ప్రారంభరౌండ్లలోనే రికార్డుల మోత మోగుతోంది. పరుగుల హోరు, వికెట్ల జోరుతో మ్యాచ్ లు సాగిపోతున్నాయి.

మహిళా ఐపీఎల్ లో రికార్డుల మోత!
X

తొలి మహిళా ఐపీఎల్ ప్రారంభరౌండ్లలోనే రికార్డుల మోత మోగుతోంది. పరుగుల హోరు, వికెట్ల జోరుతో మ్యాచ్ లు సాగిపోతున్నాయి.

భారత క్రికెట్ బోర్డు తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళా ఐపీఎల్ తొలి సీజన్ సమరం ప్రారంభ మ్యాచ్ లు రికార్డులతో హోరెత్తి పోతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ముంబై, యూపీ, ఢిల్లీ జట్ల ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు.

సీజన్ ప్రారంభమ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు..గుజరాత్ జెయింట్స్ పై 207 పరుగుల భారీస్కోరు చేయడంతో పాటు 143పరుగుల అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకొంది.

అంతేకాదు..ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్..మహిళా ఐపీఎల్ చరిత్రలో తొలి హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డుల్లో చేరింది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన రెండో రౌండ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల నష్టానికే 223 పరుగుల భారీస్కోరుతో ముంబై 207 పరుగుల రికార్డును అధిగమించింది.

లీగ్ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో 200 స్కోర్లు నమోదు కావడం మరో రికార్డు.

5 వికెట్ల తొలిబౌలర్ తారా నోరిస్...

ఇక..మహిళా ఐపీఎల్ లో 5 వికెట్లు పడగొట్టిన తొలిబౌలర్ ఘనతను ఢిల్లీ క్యాపిటల్స్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ తారా నోరిస్ దక్కించుకొంది. అమెరికాకు చెందిన తారాకు తన జాతీయజట్టు తరపున ఐదు అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన రెండోరౌండ్ పోరులో తారా నోరిస్ ఈ రికార్డు కైవసం చేసుకొంది.

ఐసీసీకి అనుబంధ సభ్యత్వం కలిగిన అమెరికాకు చెందిన తారాను ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ద్వారా తనజట్టులో చేర్చుకొంది. ప్రస్తుత మహిళా ఐపీఎల్ లో పాల్గొంటున్న ఏకైక అసోసియేట్ ప్లేయర్ తారా మాత్రమే.

తన కోటా 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చిన తారా 5 వికెట్లు సాధించింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్లు ఎల్సీ పెర్రీ, దిశా కసాట్, రిచా ఘోశ్, హీదర్ నైట్, కనికా అహూజాలను తారా పడగొట్టింది.

60 పరుగుల విజయంతో ఢిల్లీ బోణీ...

అంతకు ముందు ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముగిసిన సీజన్ రెండోమ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగులతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది.

ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెన‌ర్లు మేగ్ లానింగ్ (72), ష‌ఫాలీ వ‌ర్మ (84) చెలరేగి ఆడి మెరుపు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (22), మ‌రిజానే కాప్ (39) ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఆర్సీబీ బౌల‌ర్ల‌ను కకావికలు చేశారు.

సమాధానంగా ఆర్సీబీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో8 వికెట్ల న‌ష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. 224 పరుగుల భారీలక్ష్య చేధనలో బెంగళూరు బ్యాటింగ్ ఆది నుంచి త‌డ‌బడుతూనే సాగింది. ఢిల్లీ బౌల‌ర్ తారా నోరిస్ కు ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.

ఐదుగురు విదేశీ ప్లేయర్లతో ఢిల్లీ క్యాపిటల్స్...

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క జట్టు నలుగురు విదేశీ ప్లేయర్లతో మాత్రమే బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఐదుగురు విదేశీ ప్లేయర్లతో పోటీకి దిగింది.

అది ఎలా సాధ్య‌మైందంటే.. ఆ జ‌ట్టులో ఐదో ప్లేయ‌ర్ అసోసియేటెడ్ దేశంగా ఉన్న అమెరికాకు చెందడంతో తుదిజట్టులో చేర్చుకొనే అవకాశం దక్కింది ... తారా నోరిస్ అమెరికాకు చెందిన క్రికెట‌ర్. అసోసియేటెడ్ ప్లేయ‌ర్ ఉన్న జ‌ట్టు ఐదుగురు విదేశీయుల‌తో బ‌రిలోకి దిగేందుకు నిబంధనలు అనుమ‌తిస్తాయి.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తుదిజట్టులోకి తీసుకొన్న ఐదుగురు విదేశీ ప్లేయర్లలో మేగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), మ‌రిజానే కాప్ (ద‌క్షిణాఫ్రికా), అలిసే క్యాప్సీ (ఇంగ్లండ్), జెస్ జొనాసెన్ (ఆస్ట్రేలియా), తారా నోరిస్ (అమెరికా) ఉండటం విశేషం.

ఐసీసీ అనుబంధ సభ్య దేశాలకు చెందిన క్రికెటర్లను వేలం ద్వారా దక్కించుకొంటే..ఐపీఎల్ లీగ్ లో ఐదుగురు విదేశీ ప్లేయర్లను తుదిజట్టులో చేర్చుకొనే వెసలుబాటు ఉంది.

First Published:  6 March 2023 5:53 AM GMT
Next Story