Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ లో భారత స్టార్ల రికార్డుల మోత!

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత స్టార్ క్రికెటర్లు గత ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు.

టీ-20 ప్రపంచకప్ లో భారత స్టార్ల రికార్డుల మోత!
X

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత స్టార్ క్రికెటర్లు గత ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు. నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్, మాస్టర్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తమదైన శైలిలో సరికొత్త రికార్డులు నెలకొల్పారు....

ప్రపంచంలోని కోట్లాదిమంది అభిమానుల్ని ఓలలాడిస్తున్న టీ-20 క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్ గత ఏడాదిగా అత్యంత నిలకడగా రాణిస్తూ...అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన కొద్దిరోజుల వ్యవధిలోనే...టాపార్డర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత రికార్డులు సాధించారు. ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భాగంగా నెదర్లాండ్స్ తో ముగిసిన మ్యాచ్ ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నారు.

అత్యధిక పరుగుల సూర్యకుమార్...

2022 క్రికెట్ సీజన్ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన టీ-20 బ్యాటర్ ఘనతను భారత నయాసంచలనం సూర్యకుమార్ యాదవ్ సొంతం చేసుకొన్నాడు. ఇప్పటి వరకూ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ను సూర్య అధిగమించాడు.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ ను తన విలక్షణ షాట్లతో కొత్తపుంతలు తొక్కిస్తున్న మిస్టర్ 360 షాట్ మేకర్ సూర్యకుమార్...నెదర్లాండ్స్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో కేవలం 25 బాల్స్ లోనే మెరుపు హాఫ్ సెంచరీతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

తన కెరియర్ లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న సూర్యకుమార్ తొలి అర్థశతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ఈ క్రమంలో ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక అంతర్జాతీయ టీ-20 పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను అధిగమించడం ద్వారా టాపర్ గా అవతరించాడు.

ఈ ఏడాది మహ్మద్‌ రిజ్వాన్ మొత్తం 19 ఇన్నింగ్స్ లో 51.56 సగటుతో 825 పరుగులు సాధిస్తే...సూర్యకుమార్ మొత్తం 25 ఇన్నింగ్స్‌లో 41.28 సగటుతో 867 పరుగులు నమోదు చేశాడు. సూర్యకుమార్ ఓ శతకం, 7 అర్థశతకాలతో సహా మొత్తం 867 పరుగులతో 184. 86 స్ట్ర్రయిక్ రేట్ సాధించాడు.

ఆరో భారత క్రికెటర్ సూర్యకుమార్..

టీ-20 క్రికెట్లో శతకం సాధించిన భారత ఆరో క్రికెటర్ గా నిలిచిన సూర్యకుమార్ ..నాటింగ్ హామ్ వేదిక ఇంగ్లండ్ పై కేవలం 55 బంతుల్లోనే 14 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 117

పరుగులు సాధించాడు. సూర్యకంటే ముందే టీ-20 ఫార్మాట్లో సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, విరాట్ కొహ్లీ ఉన్నారు.

ప్రస్తుత ప్రపంచకప్ సూపర్ -12 లీగ్ లో మరో మూడుమ్యాచ్ లు, నాకౌట్ రౌండ్లలో సఫలమైతే మరో రెండుమ్యాచ్ లు సూర్యకుమార్ ఆడాల్సి ఉంది. మరో 133 పరుగులు చేయగలిగితే...సూర్యకుమార్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగుల మైలురాయిని చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు.

రెండేండ్ల తర్వాత విరాట్ 1000 పరుగులు...

గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతూ వచ్చిన విరాట్ కొహ్లీ ... రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి 1000 పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. నెదర్లాండ్స్ తో ముగిసిన ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ లీగ్ పోరులో విరాట్ 44 బంతుల్లో 62 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా వెయ్యి పరుగులు పూర్తి చేయగలిగాడు. విరాట్ అజేయ అర్థశతకంలో మూడు ఫోర్‌లు, రెండు సిక్సర్‌లు ఉన్నాయి.

ప్రస్తుత ఏడాదిలో కోహ్లీ మొత్తం 1024 పరుగులు చేసినట్లయ్యింది. 28 మ్యాచ్‌లలో 31 ఇన్నింగ్స్ ఆడి 39.38 సగటుతో 1000 పరుగుల రికార్డు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యున్నత వ్యక్తిగత స్కోర్‌ 122 నాటౌట్‌. అంతకుముందు 2019లో 1000 పరుగుల మార్క్‌ దాటిన కోహ్లీ.. మళ్లీ 1000 పరుగులు సాధించడం ఇదే కావడం ఓ రికార్డు.

2020, 2021 సీజన్లలో కోహ్లీ పూర్తిగా ఫామ్‌ కోల్పోయాడు. తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. 2020 సీజన్లో 842 పరుగులు, 2021లో 964 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

దుబాయ్ వేదికగా కొద్దివారాల క్రితం ముగిసిన 2022 ఆసియాకప్ టోర్నీ ద్వారా విరాట్ కొహ్లీ తిరిగి ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాడు.

సిక్సర్లకింగ్ రోహిత్ శర్మ....

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనపేరును మరోసారి సార్థకం చేసుకొన్నాడు. యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న అత్యధిక టీ-20 ప్రపంచకప్ సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ తనపేరుతో లిఖించుకోగలిగాడు.

నెదర్లాండ్స్ తో ముగిసిన టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్ లీగ్ పోరులో రోహిత్ మూడు సిక్సర్లతో సహా అర్థశతకం సాధించాడు. ఈ మూడు సిక్సర్లతో అత్యధిక టీ-20 సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేయగలిగాడు.

టీ-20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ కు 33 సిక్సర్లు బాదిన రికార్డు ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ 34 సిక్సర్లతో ఆ రికార్డును తెరమరుగు చేశాడు.

ఇక టీ-20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ రికార్డు కరీబియన్ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. గేల్ మొత్తం 63 సిక్స్‌లు సాధించాడు.

2007 నుంచి గత 15 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్న టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో రోహిత్ క్రమం తప్పకుండా పాల్గొంటూ వస్తున్నాడు. టీ-20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో ముగిసిన పోరు వరకూ ఆడిన మొత్తం 35 మ్యాచుల్లో కలిపి రోహిత్ 904 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకూ నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్‌ను రోహిత్ అధిగమించాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లోని మిగిలిన మ్యాచ్ ల ద్వారా రోహిత్ 1000 పరుగుల రికార్డు పూర్తి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  28 Oct 2022 5:38 AM GMT
Next Story