Telugu Global
Sports

విరాట్ కొహ్లీకి ఇక రియల్ టెస్ట్!

టెస్ట్ క్రికెట్లో ఇప్పటికే 104 మ్యాచ్ లు ఆడేసిన విరాట్ కొహ్లీ అసలుసిసలు పరీక్షకు సిద్ధమయ్యాడు.

విరాట్ కొహ్లీకి ఇక రియల్ టెస్ట్!
X

విరాట్ కొహ్లీకి ఇక రియల్ టెస్ట్!

టెస్ట్ క్రికెట్లో ఇప్పటికే 104 మ్యాచ్ లు ఆడేసిన విరాట్ కొహ్లీ అసలుసిసలు పరీక్షకు సిద్ధమయ్యాడు. ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల సిరీస్ ద్వారా రియల్ టెస్ట్ ఎదుర్కొనబోతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఎంతగొప్ప ఆటగాళ్లైనా, దిగ్గజ క్రికెటర్లైనా.. సంవత్సరాల తరబడి ఆడుతున్నా, టన్నుల కొద్దీ పరుగులు సాధించినా నిలకడగా రాణిస్తూ తమనుతాము నిరూపించుకొంటూ రాక తప్పదు. దానికి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

ఇప్పటికే సాంప్రదాయ టెస్టు క్రికెట్లో 104కు పైగా టెస్టులు ఆడి 8వేలకు పైగా పరుగులు సాధించినా..ఈ నెల 9 నుంచి ఆస్ట్ర్రేలియాతో జరుగనున్న నాలుగుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో అసలు సిసలు పరీక్ష ఎదుర్కొనబోతున్నాడు.

గత మూడేళ్లుగా వెలవెల!

2011 నుంచి భారత టెస్టు జట్టులో స్టార్ బ్యాటర్ గా ఉన్న విరాట్ కొహ్లీ గత పుష్కరకాలంలో..104 టెస్టుల్లో 27 సెంచరీలు 7 డబుల్ సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలతో 8వేల 119 పరుగులు సాధించాడు. 254 పరుగులు అత్యధిక స్కోరుతో పాటు48.15 సగటు నమోదు చేశాడు. అయితే..గత మూడేళ్లుగా విరాట్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు.

ప్రధానంగా టెస్టు క్రికెట్లో గత మూడేళ్లుగా ఆడిన 20 టెస్టుమ్యాచ్ ల్లో విరాట్ 917 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమైన కొహ్లీ సగటు 26.20గా మాత్రమే ఉంది. 2022 జ‌న‌వ‌రిలో ద‌క్షిణాఫ్రికాపై సాధించిన 79 ప‌రుగుల స్కోరే కోహ్లీ గత మూడేళ్లలో సాధించిన అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కావడం విశేషం.

మూడేళ్ల క్రితం ముగిసిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ త‌ర్వాత కోహ్లీ టెస్టుల్లో విరాట్ అంతగా రాణించలేకపోయాడు.. ఫామ్ కోల్పోయిన కోహ్లీ ఈ ఫార్మాట్‌లో ఒక్క సెంచ‌రీ సాధించలేకపోయాడు. 2019లో బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో సాధించినదే విరాట్ కు టెస్టు క్రికెట్లో చివరి శతకంగా ఉంది.

ఆస్ట్ర్రేలియాతో సిరీస్ విరాట్ కు కీలకం..

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య ఈనెల 9న ప్రారంభమయ్యే నాలుగుమ్యాచ్ ల సిరీస్ భారత్ కు మాత్రమే కాదు..విరాట్ కొహ్లీకి సైతం పెద్ద పరీక్షలాంటిదే.

రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక బ్యాటర్లు అందుబాటులో లేకపోడంతో విరాట్ పైనే అదనపు భారం పడింది. విరాట్ రాణించడం పైనే భారత్ జయాపజయాలు, టెస్టు లీగ్ ఫైనల్స్ చేరడం ఆధారపడి ఉన్నాయి.

విరాట్ కు స్పిన్ బౌలర్ల టెన్షన్..

ఫాస్ట్ , మీడియా పేస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ వస్తున్న విరాట్ కొహ్లీకి స్పిన్నర్ల దడ పట్టుకొంది. ప్రధానంగా టెస్టు క్రికెట్లో నాణ్యమైన స్పిన్ బౌలర్లను ఎదుర్కొనడంలో విరాట్ తడబడుతూ వస్తున్నాడు. దీటుగా ఎదుర్కొనలేక నానాపాట్లు పడుతున్నాడు.

ఆస్ట్ర్రేలియా తురుపుముక్క, ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ అంటే విరాట్ కు ఏదో తెలియని భయం పట్టుకొంది. టెస్టుమ్యాచ్ ల్లో విరాట్ ను లయన్ ఇప్పటి వరకూ ఏడుసార్లు పడగొట్టడం చూస్తే ఎంతగా తడబడుతున్నదీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

విరాట్ ఫామ్ పై ఇర్ఫాన్ పఠాన్ ఆందోళన..

టెస్టు ఫార్మాట్లో భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళ‌న కలిగిస్తోందని మాజీ ఆల్‌రౌండ‌ర్, వ్యాఖ్యాత ఇర్ఫాన్ ప‌ఠాన్ చెప్పాడు. 2020 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ టెస్టుల్లో కోహ్లీ సాధించిన ప‌రుగులు చూస్తే విస్మయం క‌లుగుతోందని అన్నాడు. ‘ప్ర‌పంచంలోనే మేటి క్రికెట‌ర్, మూడు ఫార్మాట్ల‌లో దాదాపు 25 వేల ప‌రుగులు చేసిన కోహ్లీ లాంటి ఆట‌గాడు స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం బాధ కలిగిస్తోందని వాపోయాడు. అంతేకాదు స్పిన్న‌ర్ల‌ను ఎద‌ర్కోవ‌డంలో కొహ్లీ తెగ ఇబ్బంది ప‌డిపోతున్నాడని గుర్తు చేశాడు.

స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ స్ట్రయిక్ రేటు చాలా త‌క్కువ ఉంది. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో నేథన్ లయన్, అగ‌ర్ లాంటి కంగారూ స్పిన్న‌ర్ల‌ను విరాట్ ఎదుర్కొనాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ టెస్టుల్లో కోహ్లీని లియాన్ 7 సార్లు ఔట్ చేశాడు. అయితే.. కోహ్లీ గత కొద్దినెలలుగా సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. టీ-20, వన్డేలలో కలిపి మూడు సెంచ‌రీలు బాదాడు. అత‌ను అదే ఫామ్ కొన‌సాగిస్తే బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఆసీస్ బౌల‌ర్ల‌కు కష్టాలు తప్పవు.

కొహ్లీ దూకుడుగా ఆడటం, స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగటమే కీలకం. ఆ వ్యూహాన్ని ఎంత సమర్థవంతంగా అమలు చేస్తాడో వేచిచూడాల్సిందే.

First Published:  4 Feb 2023 7:21 AM GMT
Next Story