Telugu Global
Sports

టీ-20 లీగ్ చరిత్రలో ఒకే ఒక్కడు!

ధూమ్ ధామ్ టీ-20 లీగ్ చరిత్రలో ఓ అరుదైన, అసాధారణ రికార్డును భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సాధించాడు. తనకు తానే సాటిగా నిలిచాడు.

టీ-20 లీగ్ చరిత్రలో ఒకే ఒక్కడు!
X

ధూమ్ ధామ్ టీ-20 లీగ్ చరిత్రలో ఓ అరుదైన, అసాధారణ రికార్డును భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సాధించాడు. తనకు తానే సాటిగా నిలిచాడు.

సంవత్సరాల తరబడి ఒకేతీరుగా ఆడుతూ..అదీ టీ-20 లీగ్ క్రికెట్లో ఒకేజట్టులో సభ్యుడిగా 250 మ్యాచ్ లు ఆడటం అంటే మాటలా మరి. ఎందరో గొప్పగొప్ప దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యంకాని ఈ రికార్డును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ నెలకొల్పాడు.

హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 13వ రౌండ్ మ్యాచ్ ఆడటం ద్వారా విరాట్.. 250 ఐపీఎల్ మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు.

2008 నుంచి 2024 వరకూ....

2008 లో ప్రారంభమైన నాటినుంచి విరాట్ కొహ్లీ ఐకాన్ ప్లేయర్ గా, కెప్టెన్ గా, ఓపెనర్ గా, స్టార్ బ్యాటర్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతూ వచ్చాడు.

క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, యజువేంద్ర చహాల్ లాంటి ప్రపంచ మేటి ఆటగాళ్లున్నా...విరాట్ నిలకడగా రాణిస్తూ వచ్చినా..గత 16 సీజన్లలో బెంగళూరు కనీసం ఒక్కసారీ విజేతగా నిలువలేకపోయింది. ఫైనల్ చేరినా రన్నరప్ గానే మిగిలాల్సి వచ్చింది. అయితే తన జట్టు జయాపజయాలకు అతీతంగా పరుగుల మోత మోగిస్తూ వచ్చిన విరాట్ కొహ్లీ బెంగళూరు తరపున 250 మ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైక, ఒకే ఒక్క ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ-20 లీగ్ క్రికెట్ చరిత్రలోనే విరాట్ సాధించిన ఈ రికార్డు ఓ ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది.

బెంగళూరు ఫ్రాంచైజీ తరపున విరాట్ 250 మ్యాచ్ లు ఆడితే..చెన్నై ఫ్రాంచైజీ తరపున ధోనీ 232 మ్యాచ్ లు, ముంబై తరపున రోహిత్ 211, కిరాన్ పోలార్డ్ 189 మ్యాచ్ లు, చెన్నై తరపున సురేశ్ రైనా 176 మ్యాచ్ ల రికార్డుతో ఉన్నారు.

262 మ్యాచ్ లతో ధోనీ టాప్...

టీ-20 లీగ్ లో వివిధ జట్ల తరపున ఆడిన మ్యాచ్ లతో కలిపి అత్యధికంగా 262 మ్యాచ్ లు ఆడిన రికార్డు మహేంద్రసింగ్ ధోనీ పేరుతో ఉంది. చెన్నై, పూణే జట్ల తరపున ధోనీ మొత్తం 262 మ్యాచ్ లు ఆడగలిగాడు.

రోహిత్ శర్మ 256 మ్యాచ్ లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. డెక్కన్ చార్జర్స్, ముంబై జట్ల తరపున రోహిత్ మొత్తం 256 మ్యాచ్ లు ఆడాడు. దినేశ్ కార్తీక్ తన కెరియర్ లో మొత్తం ఆరు ( ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ )జట్ల తరపున 254 మ్యాచ్ లు ఆడి మూడోస్థానంలో నిలిచాడు.

విరాట్ కొహ్లీ కేవలం బెంగళూరు జట్టుకే 250 మ్యాచ్ లతో నాలుగు, రవీంద్ర జడేజా 238 మ్యాచ్ లతో ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు. జడేజా తన ఐపీఎల్ కెరియర్ లో చెన్నై, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, కొచ్చీ టస్కర్స్ జట్ల తరపున ఆడాడు.

పరుగులవేటలో మేటి విరాట్....

35 సంవత్సరాల విరాట్ కొహ్లీ తన మొదటి 249 మ్యాచ్ ల్లో 113 పరుగుల నాటౌట్ స్కోరు రికార్డుతో మొత్తం 7వేల 897 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తన 250 మ్యాచ్ లో మాత్రం విరాట్ పెద్దస్కోరు సాధించలేకపోయాడు. 13 బంతుల్లో సింగిల్ ఫోరు, మూడు సిక్సర్లతో 27 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

మొత్తం 250 మ్యాచ్ ల్లో 7 వేల 924 పరుగులు సాధించగలిగాడు.

విరాట్ తర్వాతిస్థానంలో శిఖర్ ధావన్ ( 222 మ్యాచ్ ల్లో 6769 పరుగులు ), డేవిడ్ వార్నర్ (183 మ్యాచ్ ల్లో 6564 పరుగులు), రోహిత్ శర్మ ( 256 మ్యాచ్ ల్లో 6560 పరుగులు), సురేశ్ రైనా ( 205 మ్యాచ్ ల్లో 5528 పరుగులు ) ఉన్నారు.

ఒకేజట్టు తరపున 7వేల పరుగుల రికార్డు....

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్ విరాట్ కొహ్లీ మాత్రమే. అంతేకాదు..ఒకేజట్టు తరపున 7వేల 924 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ శర్మ ముంబై తరపున 211 మ్యాచ్ ల్లో 5వేల 390 పరుగులు, సురేశ్ రైనా చెన్నై తరపున 176 మ్యాచ్ ల్లో 4వేల 687 పరుగులు, డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున 95 మ్యాచ్ ల్లో 4014 పరుగులతో విరాట్ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

ఐపీఎల్ ట్రోఫీ మినహా ఈ ప్రతిష్టాత్మక లీగ్ లో విరాట్ కొహ్లీ సాధించని రికార్డు అంటూ ఏమీలేదు.

First Published:  13 May 2024 12:21 PM GMT
Next Story