Telugu Global
Sports

అక్కడ లక్నో..ఇక్కడ బెంగళూరు!

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ చిత్రవిచిత్రాలతో సాగిపోతోంది. బెంగళూరు, లక్నోజట్ల రెండంచెల పోరు ఆసక్తికరంగా ముగిసింది.

RCB bowlers rise to occasion to beat LSG by 18 runs in low-scoring game
X

అక్కడ లక్నో..ఇక్కడ బెంగళూరు!

ఐపీఎల్ -16వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ చిత్రవిచిత్రాలతో సాగిపోతోంది. బెంగళూరు, లక్నోజట్ల రెండంచెల పోరు ఆసక్తికరంగా ముగిసింది....

ఐపీఎల్ 2023 సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోరు ఆసక్తి కరంగా సాగుతోంది. మొత్తం 10 జట్లు, 70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో..ఒక్కోజట్టు ప్రత్యర్థిజట్లతో ..ఇంటా,బయటా మ్యాచ్ ల్లో తలపడాల్సి ఉంది.

ఈ పరంపరలో భాగంగా...బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన హైస్కోరింగ్ పోరులో ఆతిథ్య బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి బంతి విజయం సాధిస్తే...లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం వేదికగా ముగిసిన రెండో అంచె లోస్కోరింగ్ పోరులో బెంగళూరు 18 పరుగుల గెలుపుతో బదులుతీర్చుకొంది.

మొన్న హైస్కోరింగ్..నిన్న లోస్కోరింగ్...

సూపర్ సండే డబుల్ హెడ్డర్ రెండుమ్యాచ్ లు, నాలుగు ఇన్నింగ్స్ లోనూ 200కు పైగా స్కోర్లు నమోదైతే...లక్నో వేదికగా జరిగిన సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ జట్ల పోరు మాత్రం లోస్కోరింగ్ థ్రిల్లర్ గా ముగిసింది.

మేఘావృత వాతావరణం..తరచూ వర్షంతో అంతరాయం మధ్య జరిగిన పోరులో..రెండుజట్ల బ్యాటర్లు విలవిలలాడితే..బౌలర్లు పండుగ చేసుకొన్నారు.

ఈ కీలకపోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్లు డుప్లెసిస్‌ (40 బంతుల్లో 44; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌), విరాట్‌ కోహ్లీ (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసినా..

ఆ తర్వాత లక్నో స్పిన్నర్లు చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది.

అనూజ్ రావ‌త్(9), మ్యాక్స్‌వెల్(4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. డెత్ ఓవర్లలో గొప్ప ఫినిషర్ గా పేరున్నదినేశ్ కార్తిక్(16) ర‌నౌట‌య్యాడు. న‌వీన్ ఉల్ హ‌క్ వేసిన 20వ ఓవ‌ర్లో క‌ర‌న్ శర్మ‌(2) క్యాచ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత సిరాజ్(0) కీప‌ర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, న‌వీన్ హ్యాట్రిక్‌ కు చేరువయ్యాడు. కానీ, హేజిల్‌వుడ్(1) డిఫెన్స్ ఆడి హ్యాట్రిక్ కాకుండా చేశాడు. ఆఖ‌రి బంతికి వ‌నిందు హ‌స‌రంగ(2) బౌండ‌రీ కొట్టాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే ఉన్నాయంటే..లక్నో బౌలర్ల జోరు ఏస్థాయిలో సాగిందీ మరి చెప్పాల్సిన పనిలేదు.

లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు డుప్లెసిస్‌ కొట్టిన బంతిని అడ్డుకొనే క్రమంలో రాహుల్‌ గాయపడ్డాడు. రాహుల్ కుడి తొడ పట్టేయడంతో మైదానంలో కూప్పకూలాడు. రాహుల్‌.. ఫిజియో సహాయంతో డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకోగలిగాడు.

లక్నో 108 పరుగులకే ఆలౌట్....

127 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన లక్నో తొలిఓవర్లోనే డాషింగ్ ఓపెనర్ మేయర్స్ వికెట్ నష్టపోయింది. గాయంతో కెప్టెన్ రాహుల్ టాపార్డర్లో బ్యాటింగ్ కు రాలేకపోడం కూడా లక్నోను దెబ్బ కొట్టింది.

మేయర్స్‌ డకౌట్ కాగా , బదోనీ (4), కృనాల్‌ పాండ్యా (14), దీపక్‌ హుడా (1), పూరన్‌ (9), స్టోయినిస్‌ (13) విఫలమయ్యారు. కృష్ణప్ప గౌతమ్‌ (13 బంతుల్లో 23; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

20వ ఓవ‌ర్లో ల‌క్నో విజ‌యానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అమిత్ మిశ్రా(19) క్యాచ్ ఔట‌య్యాడు. దాంతో ల‌క్నో ఇన్నింగ్స్ 108 పరుగులకే పరిమితమయ్యింది. ప‌దో డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్(0) నాటౌట్‌గా నిలిచాడు.

తొమ్మిదిరౌండ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఇది ఐదో గెలుపు కాగా..లక్నో సూపర్ జెయింట్స్ కు నాలుగో ఓటమి. ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా జరిగే పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ పోరు రాత్రి 7-30కి ప్రారంభంకానుంది.

First Published:  2 May 2023 11:52 AM GMT
Next Story