Telugu Global
Sports

తండ్రి పాతింట్లో...కొడుకు విలాసవంతమైన బంగ్లాలో..ఇదీ రవీంద్ర జడేజా తీరు!

క్రికెట్ ఫీల్డ్ లో తొడలు చరిచి, మీసాలు మెలివేసే భారతడాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటిపోరుతో రోడ్డున పడ్డాడు. జడేజా పరిస్థితి ఇంట్లో ఈగలమోతగా తయారయ్యింది.

తండ్రి పాతింట్లో...కొడుకు విలాసవంతమైన బంగ్లాలో..ఇదీ రవీంద్ర జడేజా తీరు!
X

క్రికెట్ ఫీల్డ్ లో తొడలు చరిచి, మీసాలు మెలివేసే భారతడాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటిపోరుతో రోడ్డున పడ్డాడు. జడేజా పరిస్థితి ఇంట్లో ఈగలమోతగా తయారయ్యింది.

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పరిస్థితి ఇంట్లో ఈగల మోత...క్రికెట్ ఫీల్డ్ లో పల్లకీల మోతగా తయారయ్యింది. వందలకోట్ల రూపాయలు సంపాదించి, అంతులేని కీర్తిప్రతిష్టలు సంపాదించిన రవీంద్ర జడేజా పనికిమాలిన కొడుకుగా తయారయ్యాడు. భార్య, కుమార్తె, అత్తింటివారితో కలసి విలాసవంతమైన బంగ్లాలో గడుపుతూ..కన్నతండ్రిని, తోబుట్టువులను మాత్రం పాతింటికే పరిమితం చేశాడు.

రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింహ్ మాటల్లో చెప్పాలంటే...ఆవేదనను వింటే మాత్రం ముక్కుమీద వేలేసుకోక తప్పదు.


కోడలి రాకతో కొంపకొల్లేరు......

జామ్ నగర్ లో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రవీంద్ర జడేజా బాల్యంలోనే తల్లిని పోగొట్టుకొన్నాడు. కన్నతండ్రి, తోబుట్టువుల నీడలో పెరిగి గొప్పక్రికెటర్ గా ఎదిగాడు. భారతజట్టులో సభ్యుడిగా, ఐపీఎల్ లో చెన్నై ఫ్రాంచైజీ కీలక ఆటగాడిగా ఇప్పటికే వందలకోట్ల రూపాయలు సంపాదించాడు. సౌరాష్ట్ర్రలోని ఓ ధనిక కుటుంబానికి చెందిన రివాబాను తన జీవితభాగస్వామిగా చేసుకొన్నాడు. ఆ తర్వాత నుంచే అసలు కథ ప్రారంభమయ్యింది.

రవీంద్ర జడేజా భార్యగా వచ్చిన రివాబా ప్రస్తుతం బీజెపీ ఎమ్మెల్యేగా తన భర్త పాపులారిటీని ఉపయోగించుకొని మరీ గెలిచింది. అయితే..జడేజా అక్క నయనాబా మాత్రం కాంగ్రెస్ టికెట్ పై ఎన్నికల బరిలో నిలిచి పరాజయం పాలయ్యింది. రవీంద్ర జడేజా మాత్రం క్రికెట్ ఆడుతూ ఏడాదికి 30 నుంచి 50 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తూ..తన సంపాదన మొత్తాన్ని భార్య, కుమార్తె, అత్తింటివారి పేరుతో ఆస్తులు కొనేస్తూ, రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తు దీపం ఉండగానే ఇల్లు చక్కబెడుతూ వస్తున్నాడు. అయితే బాల్యం నుంచి తనను కంటికి రెప్పలా చూసుకొన్న తండ్రి, అక్క, చెల్లెళ్లను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. తన ఇంటికి దూరం పెట్టాడు.

జడేజా తండ్రి ఆవేదన....

తాను అల్లారు ముద్దుగా పెంచుకొని, గొప్ప క్రికెటర్ గా ఎదగడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన కుటుంబసభ్యులు ఇప్పుడు తన కుమారుడు రవీంద్ర జడేజాకు పరాయివారిగా, శత్రువులుగా మారిపోయారని జడేజా తండ్రి అనిరుధ్ సింహ్ ' దివ్య భాస్కర్ ' అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు.

తమ కుటుంబలోకి కోడలు వచ్చిన మూడునెలల కాలంలోనే పరిస్థితి మారిపోయిందని, కోడలు రివాబీ ఏం మాయ చేసిందో తలియదు కానీ తమను ప్రాణప్రదంగా భావించిన కొడుకు ఒక్కసారిగా మారిపోయాడని, భార్యచాటు భర్తగా, అత్తింటివారి బంధీగా మారిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటి వరకూ తన కుమారుడుపేరుతో ఉన్న కోట్ల రూపాయల స్థిర, చర ఆస్తులు ఒక్కసారిగా కోడలిపేరున మారిపోయాయని, ఆ తరువాత తమకు పొమ్మనకుండా తమ కోడలు పొగపెట్టిందని మండి పడ్డారు.

తన కుమారుడుతో ప్రస్తుతం ఎలాంటి సంబంధంలేదని, ఒకే నగరంలో ఉంటున్నా ఎవరి బతుకువారిదేనని అనిరుధ్ చెప్పుకొచ్చారు. మనుమరాలిని చూసి ఐదేళ్లయ్యిందని, కనీసం కుమారుడి పలుకరింపుకు సైతం తాము నోచుకోలేదని చెప్పుకొచ్చారు.

ఇది ..కేవలం తన ఆవేదన మాత్రమేకాదని, తమ కుటుంబంలోని 50 మంది సభ్యుల ఆందోళన అని..తమ కుటుంబసభ్యుల్లో ఎవరిని అడిగినా ఇదే చెబుతారని అనిరుధ్ జడేజా తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన కుమారుడు విలాసవంతమైన బంగ్లాతో అత్తవారితో కలసి జీవిస్తుంటే..తాము మాత్రం తాతల తండ్రుల నుంచి వచ్చిన పాతింట్లోనే జీవిస్తున్నామని వివరించాడు.

నాన్నమాటలు పట్టించుకోను..రవీంద్ర జడేజా...

ఇదిలా ఉంటే...' దివ్య భాస్కర్ 'లో తన తండ్రి చెప్పిన మాటల్ని పట్టించుకోనని, తనకూ చెప్పడానికి బోలెడు విషయాలు ఉన్నా..వారిలాగా తాను బయటపడే ప్రసక్తే లేదని రవీంద్ర జడేజా వివరణ ఇచ్చాడు.

తన తండ్రిపేరుతో వచ్చిన ఇంటర్వ్యూ అర్థంలేనిది, నిరాధారమైన అంశాలతో అల్లిన కథ అంటూ రవీంద్ర జడేజా కొట్టి పడేశాడు. తన భార్య ఎదుగుదలను చూస్వి ఓర్వలేక, ఆమె ప్రతిష్టను దెబ్బ తీయటానికి ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డాడు.

First Published:  12 Feb 2024 1:38 PM GMT
Next Story