Telugu Global
Sports

కపిల్ ను మించిన రవీంద్ర జడేజా!

భారత క్రికెట్ రాక్ స్టార్ రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కపిల్ దేవ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.

కపిల్ ను మించిన రవీంద్ర జడేజా!
X

కపిల్ ను మించిన రవీంద్ర జడేజా!

భారత క్రికెట్ రాక్ స్టార్ రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కపిల్ దేవ్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.

మోకాలి శస్త్రచికిత్సతో క్రికెట్ కు ఐదుమాసాలపాటు దూరమై..నాగపూర్ టెస్టు ద్వారా పునరాగమనం చేసిన భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తానేమిటో మరోసారి నిరూపించుకొన్నాడు. బౌలింగ్ తో, బ్యాటింగ్ తో రికార్డుల మోత మోగించాడు.

ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్..

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన రవీంద్ర జడేజా తన వికెట్ల హోరు, పరుగుల జోరును కొనసాగిస్తున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా ఆస్ట్ర్రేలియాతో నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలిటెస్టు తొలిరోజు ఆటలో 5 వికెట్లతో ఆస్ట్ర్రేలియాను 177 పరుగులకే కుప్పకూల్చిన లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా..రెండోరోజు ఆటలో బ్యాటింగ్ లోనూ సత్తా చాటుకొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, సహ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లతో కలసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాటు అజేయ హాఫ్ సెంచరీతో నిలిచాడు.

కపిల్ రికార్డు తెరమరుగు...

టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్ పేరుతో ఉన్న రికార్డును నాగపూర్ టెస్టు షో ద్వారా జడేజా అధిగమించాడు.

ఒకే టెస్టు మ్యాచ్ లో బౌలర్ గా 5 వికెట్లు, బ్యాటర్ గా హాఫ్ సెంచరీ ఘనతను తన కెరియర్ లో కపిల్ దేవ్ నాలుగుసార్లు సాధించాడు. అయితే..ప్రస్తుత నాగపూర్ టెస్టు తొలిఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టిన జడేజా బ్యాటర్ గా అజేయ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో బౌలర్ గా, బ్యాటర్ గా ఐదోసారి ఈ ఘనత సాధించడం ద్వారా కపిల్ రికార్డును అధిగమించగలిగాడు.

11సార్లు 5 వికెట్ల రికార్డు...

భారత నంబర్ వన్ లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా..నాగపూర్ టెస్టు తొలిరోజు ఆటలోనే కంగారూలను తన స్పిన్ మ్యాజిక్ తో ఓ ఆటాడుకొన్నాడు. కేవలం 47 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.

టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల చొప్పున పడగొట్టడం జడేజాకు ఇది 11వసారి కావడం విశేషం. ఆస్ట్ర్రేలియా టాపార్డర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నుస్ లబుషేన్, మాట్ రెన్ షా, టోడ్ మర్ఫీలను జడేజా పెవీలియన్ దారి పట్టించాడు.

34 సంవత్సరాల రవీంద్ర జడేజా ప్రస్తుత నాగపూర్ టెస్టు వరకూ 61 మ్యాచ్ లు ఆడి 90 ఇన్నింగ్స్ లో 2వేల 573కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక..లెఫ్టామ్ స్పిన్ బౌలర్ గా 115 ఇన్నింగ్స్ లో 247 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓసారి 10 వికెట్లు, 11సార్లు 5 వికెట్లు, 11సార్లు 4 వికెట్లు పడగొట్టిన రికార్డులు జడేజా పేరుతోనే ఉన్నాయి.

First Published:  11 Feb 2023 6:11 AM GMT
Next Story