Telugu Global
Sports

500 వికెట్ల శిఖరం పై స్పిన్ జాదూ అశ్విన్!

భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల శిఖరాన్ని అధిరోహించాడు.

500 వికెట్ల శిఖరం పై స్పిన్ జాదూ అశ్విన్!
X

భారత జాదూ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల శిఖరాన్ని అధిరోహించాడు. రాజకోట టెస్టు రెండోరోజుఆటలో ఈ ఘనత సాధించాడు...

ప్రపంచ మేటి స్పిన్నర్లలో ఒకడైన భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన టెస్టు క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన 9వ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

క్రాలే వికెట్ తో అశ్విన్ రికార్డు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో గత పుష్కరకాలంగా రికార్డుల మోత మోగిస్తూ వచ్చిన 37 సంవత్సరాల రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల అసాధారణ రికార్డు సాధించాడు.

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రాజకోట నిరంజన్ షా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడోటెస్ట్ రెండోరోజు ఆటలో ఇంగ్లండ్ డాషింగ్ ఓపెనర్ క్రాలే వికెట్ పడగొట్టడం ద్వారా 500 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

13 ఏళ్లుగా వికెట్ల వేట....

భారత క్రికెట్ కు 2011 నుంచి ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్న వెటరన్ ఆఫ్ స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గా భారత్ కు ఎన్నో అరుదైన టెస్టు సిరీస్ విజయాలు అందించాడు.

ఆఫ్ బ్రేక్, క్యారమ్ బాల్, దూస్రా లాంటి విలక్షణ అస్త్రాలతో తన కెరియర్ 98 టెస్టుమ్యాచ్ లో 500 వికెట్ల రికార్డును పూర్తి చేయగలిగాడు. భారత మాజీ కెప్టెన్ కమ్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత 500 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా అశ్విన్ రికార్డుల్లో చేరాడు.

స్వదేశీ పిచ్ లపైన తిరుగులేని బౌలర్...

స్వదేశీ పిచ్ ల పైన తిరుగులేని స్పిన్నర్ గా అశ్విన్ కు పేరుంది. అనీల్ కుంబ్లే పేరుతో ఉన్న 350 వికెట్ల రికార్డుకు కేవలం 3 వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. భారతగడ్డపై జరిగిన టెస్టుల్లో అనీల్ కుంబ్లే 63 మ్యాచ్ లు ఆడి 350 వికెట్లు సాధించాడు. ఇందులో 25సార్లు 5 వికెట్లు, 7సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు.

అయితే..అశ్విన్ మాత్రం కేవలం 58 టెస్టుల్లోనే 347 వికెట్లు పడగొట్టాడు. 26సార్లు 5 వికెట్లు, ఆరుసార్లు 10 వికెట్ల రికార్డు సైతం అశ్విన్ కు ఉంది. ప్రస్తుత రాజకోట టెస్టులో అశ్విన్ మరో 4 వికెట్లు పడగొట్టగలిగితే కుంబ్లే రికార్డును అధిగమించగలుగుతాడు.

స్వదేశీ పిచ్ లపైన అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ప్రపంచ రికార్డు ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉంది. శ్రీలంక వేదికగా ఆడిన 73 టెస్టుల్లో మురళీధరన్ 493 వికెట్లు సాధించాడు. ఇందులో 45సార్లు 5 వికెట్లు, 15 సార్లు 10 వికెట్లు చొప్పున పడగొట్టాడు.

ఇంగ్లండ్ పై 100 వికెట్ల రికార్డుకు గురి....

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 100 వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ రికార్డు సైతం అశ్విన్ కు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకోట టెస్టులో అశ్విన్ మరో 2 వికెట్లు పడగొట్టగలిగితే 100 వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచిపోతాడు. 2011 నవంబర్ లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్ ఇప్పటి వరకూ ఇంగ్లండ్ ప్రత్యర్థిగా 98 వికెట్లు సాధించాడు.

భారత్- ఇంగ్లండ్ జట్ల ద్వైపాక్షిక సిరీస్ ల్లో 100 వికెట్లు పడగొట్టిన రికార్డు ఇంగ్లండ్ స్వింగ్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ పేరుతో ఉంది.

ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడుటెస్టుల్లో అశ్విన్ కు 10 వికెట్లు మాత్రమే దక్కాయి.

14 దశాబ్దాల టెస్టు చరిత్రలో అశ్విన్ కంటే ముందే 500 వికెట్లు పడగొట్టిన దిగ్గజ బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ యాండర్సన్, అనిల్ కుంబ్లే, స్టువర్ట్ బ్రాడ్, గ్లెన్ మెక్ గ్రాత్, కోట్నీ వాల్ష్, నేథన్ లయన్ మాత్రమే ఉన్నారు.

కంగారూ ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ 123 టెస్టుల్లో 500 వికెట్లు పడగొడితే..అశ్విన్ మాత్రం 98 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్ర్రేలియా లెగ్ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లతో రెండు, ఇంగ్లండ్ పేస్ స్టార్ జేమ్స్ యాండర్సన్ 185 టెస్టుల్లో 697 వికెట్లతో మూడు, భారత లెగ్ స్పిన్నర్ అనీల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లతో నాలుగు స్థానాలలో ఉన్నారు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 604 వికెట్లు, ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ 124 టెస్టుల్లో 563 వికెట్లు, వెస్టిండీస్ ఆల్ టైమ్ గ్రేట్ కోట్నీ వాల్ష్ 132 టెస్టుల్లో 519 వికెట్లు పడగొట్టిన మొనగాళ్లుగా ఉన్నారు.

కుంబ్లే నుంచి ఇషాంత్ శర్మ వరకూ..

95 సంవత్సరాల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత మాత్రం అనీల్ కుంబ్లేకే దక్కుతుంది. కుంబ్లే 619 వికెట్లతో నంబర్ వన్ బౌలర్ గా నిలిస్తే..అశ్విన్ 500 వికెట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఇతర బౌలర్లలో కపిల్ దేవ్ ( 434 ), హర్భజన్ సింగ్ ( 417 ), జహీర్ ఖాన్ ( 311 ), ఇషాంత్ శర్మ ( 311 ) ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.

First Published:  17 Feb 2024 1:02 AM GMT
Next Story