Telugu Global
Sports

రంజీట్రోఫీలో నేటినుంచే సెమీస్ సమరం!

ఐదురోజులపాటు జరిగే ఈ రెండుసెమీఫైనల్స్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం కోసం స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

రంజీట్రోఫీలో నేటినుంచే సెమీస్ సమరం!
X

రంజీట్రోఫీలో నేటినుంచే సెమీస్ సమరం!

జాతీయ క్రికెట్ టోర్నీ రంజీట్రోఫీ సెమీస్ సమరానికి దేశంలోని రెండు వేదికల్లో తెరలేచింది. మాజీ చాంపియన్లు సౌరాష్ట్రతో కర్నాటక, మధ్యప్రదేశ్ తో బెంగాల్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.

దేశవాళీ క్రికెట్లో అతిపెద్ద టోర్నీ రంజీట్రోఫీలో ఆఖరినాలుగుజట్ల సెమీస్ సమరానికి తెరలేచింది. గ్రూప్ లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ వరకూ 30కి పైగా జట్లు తలపడితే..చివరకు సెమీస్ రౌండ్ కు మాజీ చాంపియన్లు బెంగాల్, కర్నాటక, సౌరాష్ట్ర్ర, డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్లు మాత్రమే చేరుకోగలిగాయి.

కర్నాటకకు సౌరాష్ట్ర్ర సవాల్...

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలిసెమీఫైనల్లో కర్నాటక, సౌరాష్ట్ర్రజట్లు తమతమ స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగాయి. క్వార్టర్ ఫైనల్లో పంజాబ్ ను 71 పరుగులతో చిత్తు చేయడం ద్వారా సౌరాష్ట్ర్ర సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్, మిస్టర్ డిపెండబుల్‌ చతేశ్వర్ పూజారా, జడేజా, అక్షర్ పటేల్ లాంటి పలువురు స్టార్ ప్లేయర్లు భారత టెస్టుజట్టులో సభ్యులుగా ఉండడంతో రంజీమ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయారు.

మరోవైపు..కెఎల్ రాహుల్ సైతం కర్నాటకకు దూరమయ్యాడు. రాహుల్ లేకుండానే కర్నాటక మరోసారి రంజీ సెమీస్ లో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

మధ్యప్రదేశ్ తో బెంగాల్ ఢీ..

మరో క్వార్టర్ ఫైనల్స్ లో ఆంధ్రను అధిగమించడం ద్వారా డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్ సెమీస్ లో అడుగుపెట్టింది. జార్ఖండ్ ను చిత్తు చేయడం ద్వారా బెంగాల్ సైతం సెమీస్ నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకొంది.

మెరుపు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భారతజట్టులో సభ్యుడిగా ఉండడంతో..బెంగాల్ జట్టు తన స్టార్ పేసర్ లేకుండానే రంజీసెమీస్ పోరుకు సిద్ధమయ్యింది.

ఎక్కువమంది యువఆటగాళ్లున్న మధ్యప్రదేశ్ జట్టు రెండోసెమీస్ లో బెంగాల్ కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్- మధ్యప్రదేశ్ జట్ల సెమీస్ పోరుకు

ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

ఐదురోజులపాటు జరిగే ఈ రెండుసెమీఫైనల్స్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం కోసం స్టార్ స్పోర్ట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

First Published:  8 Feb 2023 4:30 AM GMT
Next Story