Telugu Global
Sports

నేటినుంచే రంజీ ఫైనల్స్, ముంబైకి 42వ టైటిల్ చిక్కేనా?

దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ టైటిల్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. హాట్ ఫేవరెట్ ముంబై 42వ టైటిల్ కు గురి పెట్టింది.

నేటినుంచే రంజీ ఫైనల్స్, ముంబైకి 42వ టైటిల్ చిక్కేనా?
X

దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ టైటిల్ సమరానికి ముంబై వాంఖడే స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. హాట్ ఫేవరెట్ ముంబై 42వ టైటిల్ కు గురి పెట్టింది.

దేశంలోని అత్యంత పురాతన క్రికెట్ టోర్నీ రంజీట్రోఫీ టైటిల్ సమరం...ముంబై వాంఖడే స్టేడియంలో ప్రారంభమయ్యింది. నేటినుంచి ఐదురోజులపాటు జరిగే హోరాహోరీ సమరంలో వెస్ట్ జోన్ లోని ఒకే రాష్ట్ర్రానికి చెందిన రెండుజట్లు ఢీ కొంటున్నాయి.

హాట్ ఫేవరెట్ , 41సార్లు విన్నర్ ముంబైకి మాజీ చాంపియన్ విదర్భ సవాలు విసురుతోంది. ముంబై రికార్డుస్థాయిలో 42 టైటిల్ కోసం తహతహలాడుతుంటే..విదర్భ మూడోసారి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

రంజీ ట్రోఫీకి మరోపేరు ముంబై...

భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ముంబైకి ప్రత్యేక స్థానం ఉంది. విజయ్ మర్చెంట్, విజయ్ మంజ్రేకర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సచిన్ టెండుల్కర్, రవిశాస్త్రి, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, యశస్వి జైశ్వాల్ లాంటి మేటి ఆటగాళ్లను అందించిన ముంబైకి రంజీట్రోఫీ ఫైనల్స్ కు 48సార్లు చేరిన రికార్డుతో పాటు..41సార్లు విజేతగా నిలిచిన ఘనత సైతం ఉంది.

ప్రస్తుత 2023-24 రంజీసీజన్ సెమీఫైనల్లో తమిళనాడును చిత్తు చేయడం ద్వారా మరోసారి ముంబై ఫైనల్స్ చేరుకొంది. 42వసారి విజేతగా నిలవడం ద్వారా తన రికార్డును తానే అధిగమించాలన్న పట్టుదలతో ఉంది.

మూడో టైటిల్ కు విదర్భ గురి...

ఇప్పటికే రెండుసార్లు రంజీవిజేతగా నిలిచిన విదర్భజట్టు రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ను 62 పరుగులతో అధిగమించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది. మూడోసారి టైటిల్ నెగ్గడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ముంబైకి సవాలు విసిరింది.

విదర్భజట్టులోని నలుగురు ప్రధాన బ్యాటర్లు ఇప్పటికే 500కు పైగా పరుగులు సాధించడం ద్వారా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ప్రధానంగా కరుణ్ నాయర్ ప్రస్తుత సీజన్లో ఆడిన 15 ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా 616 పరుగులతో టాప్ రన్ గెటర్ గా ఉన్నాడు.

మరో బ్యాటర్ ధృవ్ షోరే 16 ఇన్నింగ్స్ లో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీలతో 549 పరుగులతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ 530, అథర్వ్ తైడే 529 పరుగులు, యాశ్ రాథోడ్ 456 పరుగులతో ముంబై బౌలర్లతో సమరానికి సై అంటున్నారు.

బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్ పైనే విదర్భ పూర్తిగా ఆధార పడి ఉంది.

అయితే..ముంబైజట్టు మాత్రం తన హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా ఫైనల్లో పాల్గోనుండటంతో స్థానబలంతో చెలరేగిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆల్ రౌండ్ పవర్ తో ముంబై.....

అజింక్యా రహానే నాయకత్వంలోని ముంబైజట్టు ఆల్ రౌండ్ పవర్ తో ఉరకలేస్తోంది. తమిళనాడును సెమీస్ లో ఇన్నింగ్స్ 70 పరుగులతో చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో టైటిల్ సమరంలో పాల్గొంటోంది.

కెప్టెన్ రహానే మినహా మిగిలిన 10 మంది బ్యాటర్లు భారీగా పరుగులు సాధించడంతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా కనిపిస్తోంది. ఓపెనర్ పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ

ముంబైకి కీలకం కానున్నారు. లాల్వానీ 14 ఇన్నింగ్స్ లో 5 హాఫ్ సెంచరీలు, ఓ శతకంతో పాటు 533 పరుగులతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

టెస్ట్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రాకతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కు అదనపు బలం వచ్చినట్లయ్యింది.

టెయిల్ ఎండర్లు తుషార్ దేశ్ పాండే, తనుష్ కోటియాన్ సైతం సెంచరీలు బాదడం చూస్తే..ముంబై బ్యాటింగ్ పవర్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సర్ ఫ్రాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సైతం ముంబై బ్యాటింగ్ ఆర్డర్ లో కీలకపాత్ర పోషించనున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ గా ముంబైకి అండగా నిలుస్తూ వచ్చాడు.

నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఈ సమరంలో ముంబై హాట్ ఫేవరెట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విజేతగా నిలిచిన జట్టుకు బీసీసీఐ 3 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా అందచేయనుంది.

First Published:  10 March 2024 7:45 AM GMT
Next Story