Telugu Global
Sports

సొంతస్టేడియంలో రంజీమ్యాచ్, అభిమన్యు అరుదైన ఘనత!

క్రికెట్ దిగ్గజాలు సచిన్, ధోనీ, కొహ్లీకి దక్కని ఘనతను ఉత్తరాఖండ్ యువక్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ దక్కించుకొన్నాడు. తనపేరుతో నిర్మించిన సొంత స్టేడియంలో రంజీమ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

సొంతస్టేడియంలో రంజీమ్యాచ్, అభిమన్యు అరుదైన ఘనత!
X

సొంతస్టేడియంలో రంజీమ్యాచ్, అభిమన్యు అరుదైన ఘనత!

క్రికెట్ దిగ్గజాలు సచిన్, ధోనీ, కొహ్లీకి దక్కని ఘనతను ఉత్తరాఖండ్ యువక్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ దక్కించుకొన్నాడు. తనపేరుతో నిర్మించిన సొంత స్టేడియంలో రంజీమ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు....

ఓ వ్యక్తి..లేదా కుటుంబం సొంతంగా ఓ క్రికెట్ స్టేడియం నిర్మించడం అంటే మాటలా? తనపేరుతో నిర్మించిన ఓ క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం ఎందరికి దక్కుతుంది?..అయితే..ఇలాంటి అరుదైన ఘనతను ఉత్తరాఖండ్ కు చెందిన యువక్రికెటర్ కమ్ భారత నవతరం ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ సొంతం చేసుకొన్నాడు.

భారత తొలి క్రికెటర్ అభిమన్యు...

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని అభిమన్యు ఈశ్వరన్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది. 2023 రంజీట్రోఫీ గ్రూప్- బీ లీగ్ లో భాగంగా

బెంగాల్- ఉత్తరాఖండ్ జట్ల మధ్య ప్రారంభమైన మ్యాచ్ లో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకొంది.

దిగ్గజాలకే దక్కని అదృష్టం....

సచిన్, ధోనీ, విరాట్ కొహ్లీ...వీరంతా క్రికెటర్లుగా వందలకోట్లు ఆర్జించడమే కాదు...ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. అయితే..తమ పేరుతో క్రికెట్ స్టేడియాలు నిర్మించడం కానీ, తమపేరుతో నిర్మించిన స్టేడియం వేదికగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఘనతను కానీ సంపాదించలేకపోయారు.

క్రికెట్ దిగ్గజాలకే దక్కని ఈ అరుదైన అదృష్టం, గౌరవాన్ని ఉత్తరాఖండ్ యువఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ సొంతం చేసుకొన్నాడు. తనపేరుతో నిర్మించిన సొంత క్రికెట్ స్టేడియంలో రంజీమ్యాచ్ ఆడిన భారత తొలి, ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొన్న భారతజట్టులో స్టాండ్ బై ఓపెనర్ గా అభిమన్యు ఈశ్వరన్ కు సైతం చోటు దక్కింది. అభిమన్యు తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ కు క్రికెట్ అంటే వల్లమాలిన ప్రేమ. స్వతహాగా మంచి క్రికెట్ శిక్షకుడు కూడా. తన ఆస్తులన్నీ తెగనమ్మి.. 2005 లో డెహ్రాడూన్ లో

ఖరీదైన స్థలం కొని తన కుమారుడు అభిమన్యు ఈశ్వరన్ పేరుతో సొంతంగా ఓ ( అభిమన్యు క్రికెట్ అకాడమీ ) స్టేడియాన్ని నిర్మించారు. ఫ్లడ్ లైట్ల సదుపాయం సైతం ఈ స్టేడియానికి ఉంది.

సొంత స్టేడియంలోనే క్రికెట్ ఓనమాలు..

అభిమన్యు తనతండ్రి శిక్షకుడిగా, తనపేరుతోనే నిర్మించిన స్టేడియంలో క్రికెట్ ఓనమాలు దిద్దుకొన్నాడు. అంచెలంచెలుగా ఎదగటం ద్వారా దేశంలోని అత్యుత్తమ యువఓపెనర్లలో ఒకడుగా నిలిచాడు. 27 సంవత్సరాల వయసుకే 19 శతకాలు బాదడం ద్వారా భారత టెస్టుజట్టులో చోటు సంపాదించాడు.

తనపేరుతో నిర్మించిన స్టేడియంలో రంజీమ్యాచ్ ఆడే అరుదైన అదృష్టం తనకు దక్కడం పట్ల అభిమన్యు పొంగిపోతున్నాడు. ఈ గౌరవం తన తండ్రికే దక్కుతుందని, తన సర్వస్వం స్టేడియం నిర్మాణానికే వెచ్చించారని గుర్తు చేసుకొన్నాడు.

2023 రంజీ సీజన్ లో ఉత్తరాఖండ్ జట్టు ఆడేమ్యాచ్ లకు అభిమన్యు క్రికెట్ అకాడమీ స్టేడియాన్ని ఎంపిక చేయడంతో తనపేరుతో నిర్మించిన స్టేడియంలో రంజీమ్యాచ్ ఆడే అవకాశం దక్కింది.

కరీబియన్ దిగ్గజాలు సర్ వివియన్ రిచర్డ్స్ పేరుతో ఆంటీగా , బ్రయన్ లారా పేరుతో తారోబా, కంగారూ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ పేరుతో బ్రిస్బేన్ లో స్టేడియాలు నిర్మించినా..

తమపేరుతో నిర్మించిన స్టేడియాలలో మ్యాచ్ లు ఆడే అవకాశం వారికి దక్కలేదు. వారి రిటైర్మెంట్ తర్వాతే స్టేడియాలు నిర్మించారు.


అభి 100 టెస్టులు ఆడితే అదే చాలు-రంగనాథన్

కొడుకు పేరుతో స్టేడియం నిర్మించడం గొప్పవిషయం కానేకాదని..తాను క్రికెట్ పై మక్కువతోనే వ్యయప్రయాసలకోర్చి స్టేడియం నిర్మించానని అభిమన్యు తండ్రి రంగనాథన్ చెప్పారు. ఇప్పటికీ స్టేడియం అభివృద్ధికి ఖర్చు పెడుతూనే ఉన్నానని, స్టేడియం ద్వారా వచ్చే ఆదాయం ఏమీలేదని వాపోయారు. అయితే..తన కొడుకు అభిమన్యు భారత్ తరపున 100 టెస్టుమ్యాచ్ లు ఆడాలన్నదే తన కోరికని, అంతకుమించి తానేమీ ఆశించడంలేదని అన్నారు. తాను 2006లో స్టేడియం నిర్మాణం ప్రారంభిస్తే..అభిమన్యు

1995లో జన్మించినట్లు చెప్పారు. 1988 నుంచి తాను అభిమన్యు క్రికెట్ అకాడమీని నడుపుతున్నట్లు తెలిపారు.

తాను డెహ్రాడూన్ లో దినపత్రికలు, ఐస్ క్రీములు విక్రయించేవాడనని, తాను చార్టెర్డ్ అకౌంటెన్సీ డిగ్రీ సాధించానని, క్రికెట్ అంటే విపరీతంగా అభిమానించే కొడుకును తనకు ప్రసాదించిన ఆ దేవుడికి రుణపడి ఉంటానని రంగనాథన్ ఉద్విఘ్నంగా చెప్పారు.

భారత- ఏ జట్టుకు ప్రస్తుతం అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తమ అకాడమీ నుంచి ఐదుగురు రంజీ స్థాయి క్రికెటర్లను తయారు చేయడం గర్వకారణమని,

గత మ్యాచ్ లో 8 వికెట్లు పడగొట్టిన స్వింగ్ బౌలర్ దీపక్ దాపోలా తాను తయారు చేసిన వాడేనంటూ పొంగిపోయారు.

తమ స్టేడియంలో 60 గదులు, 20 హాస్టల్ గదులను నిర్మించామని, రుతుపవన కాలంలో క్రికెట్ కు అంతరాయం కలుగకుండా ఇండోర్ ప్రాక్టీసు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఉత్తరాఖండ్ రంజీజట్టుకు మాజీ ఆల్ రౌండర్ లక్ష్మీరతన్ శుక్లా కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

First Published:  3 Jan 2023 8:25 AM GMT
Next Story