Telugu Global
Sports

రాజకోట స్టేడియానికి నిరంజన్ షా పేరు!

గుజరాత్ లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటైన సౌరాష్ట్ర్ర స్టేడియం పేరును మార్చారు. ఈ రోజు నుంచి నిరంజన్ షా ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలువనున్నారు.

రాజకోట స్టేడియానికి నిరంజన్ షా పేరు!
X

గుజరాత్ లోని అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో ఒకటైన సౌరాష్ట్ర్ర స్టేడియం పేరును మార్చారు. ఈ రోజు నుంచి నిరంజన్ షా ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలువనున్నారు..

క్రికెట్ కు వివిధ రూపాలలో అసమాన సేవలు అందించిన ఘనులు, ప్రముఖుల పేర్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలను నిర్మించడం సాధారణ విషయం. ఆ పరంపరలో భాగంగా ఇప్పటి వరకూ సౌరాష్ట్ర్ర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా ఉంటూ వచ్చిన రాజకోట స్టేడియం పేరును మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా అంతర్జాతీయ స్టేడియంగా పిలువనున్నారు.

గుజరాత్ గడ్డపై మూడో స్టేడియం..

గుజరాత్ గడ్డపై అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం, వడోదర అంతర్జాతీయ స్టేడియాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే..సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం రాజకోట వేదికగా సొంతంగా నిర్మించుకొన్నఅంతర్జాతీయ స్టేడియాన్ని గత దశాబ్దకాలంగా సౌరాష్ట్ర్ర ఇంటర్నేషనల్ స్టేడియంగా పిలుస్తూ వచ్చారు. ఇప్పటికే రెండుటెస్టులతో సహా డజన్ల కొద్ది వన్డే, టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఘనత రాజకోట స్టేడియానికి ఉంది. పరుగుల గనిగా, స్పిన్ బౌలర్ల అడ్డాగా, రివర్స్ స్వింగ్ కు అనువైన పిచ్ గా కూడా పేరుంది.

సౌరాష్ట్ర్ర క్రికెట్ వెనుక నిరంజన్ షా...

సౌరాష్ట్ర్ర ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధికి నిరంజన్ షా చేసిన కృషి అంతాఇంతా కాదు. చతేశ్వర్ పూజారా, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్ లాంటి ప్రపంచ మేటి క్రికెటర్లు సౌరాష్ట్ర్ర నుంచి వచ్చినవారే.

జాతీయ క్రికెట్ విజేతలకు ఇచ్చే రంజీట్రోఫీని సౌరాష్ట్ర్ర రెండుసార్లు గెలుచుకొన్నా, సౌరాష్ట్ర్రను అంతర్జాతీయ క్రికెట్ కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దినా ఆ ఘనత కేవలం నిరంజన్ షాకు మాత్రమే దక్కుతుంది.

1965- 1975 మధ్యకాలంలో 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన రికార్డు నిరంజన్ షాకు ఉంది. ఆ తరువాత ఆయన క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా మారారు. ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు కార్యదర్శిగా కూడా సేవలు అందించారు.

నేటినుంచే నిరంజన్ షా పేరుతో...

సౌరాష్ట్ర్ర క్రికెట్ ను ప్రపంచ పటానికి ఎక్కించిన నిరంజన్ షా పేరుతో రాజకోట స్టేడియాన్ని ఈ రోజు నుంచి పిలువనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా అధికారికంగా ప్రకటించారు.

ఇంగ్లండ్ తో ఈ రోజు నుంచి జరిగే మూడోటెస్టు ప్రారంభానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సౌరాష్ట్ర్ర ఇంటర్నేషనల్ స్టేడియానికి నిరంజన్ షా స్టేడియంగా నామకరణం చేశారు.

ఈ కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేలతో పాటు..సౌరాష్ట్ర్ర దిగ్గజ క్రికెటర్లు చతేశ్వర పూజారా, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్ లను ప్రత్యేక జ్ఞాపికలతో సత్కరించారు.

రెండుటెస్టులతో సహా ఇప్పటి వరకూ 11 అంతర్జాతీయ మ్యాచ్ లకు రాజకోట స్టేడియం వేదికగా నిలిచింది. 2016 నుంచి 2018 వరకూ జరిగిన రెండుటెస్టుల్లో

భారత్ ఓ గెలుపు, ఓ డ్రా రికార్డుతో ఉంది. 2016లో భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ రాజకోట వేదికగా జరిగిన టెస్టుమ్యాచ్ హైస్కోరింగ్ డ్రాగా ముగిసింది.

2018లో వెస్టిండీస్ ప్రత్యర్థిగా జరిగిన టెస్టులో భారత్ తరపున ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు సెంచరీలు బాదడం, ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత్ విజేతగా నిలవడం

జరిగిపోయాయి. రాజకోట్ నిరంజన్ షా స్టేడియం వేదికగా ఈరోజు నుంచి జరిగేది కేవలం మూడో టెస్టు మాత్రమే.

First Published:  15 Feb 2024 3:45 AM GMT
Next Story