Telugu Global
Sports

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో రాజస్థాన్...గాల్లో దీపంలా ఢిల్లీ క్యాపిటల్స్ !

ఐపీఎల్-17వ సీజన్ తొలిదశ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ముగింపు దశకు చేరింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రెండోజట్టుగా రాజస్థాన్ నిలిస్తే..ఢిల్లీ పరిస్థితి గాల్లోదీపంలా మారింది.

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్లో రాజస్థాన్...గాల్లో దీపంలా ఢిల్లీ క్యాపిటల్స్ !
X

ఐపీఎల్-17వ సీజన్ తొలిదశ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ముగింపు దశకు చేరింది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రెండోజట్టుగా రాజస్థాన్ నిలిస్తే..ఢిల్లీ పరిస్థితి గాల్లోదీపంలా మారింది.

దేశంలోని వివిధ నగరాలు వేదికగా గత ఐదువారాలుగా సాగుతున్న ఐపీఎల్-17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచి మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరుకోగా..మిగిలిన రెండు ప్లే-ఆఫ్ బెర్త్ ల కోసం ఐదుజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఢిల్లీ గెలుపుతో రాజస్థాన్ కు లైన్ క్లియర్....

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి ( 14వ ) రౌండ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగులతో ఓడించడంతోనే మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కు ప్లే-ఆఫ్ బెర్త్ ఖాయమైపోయింది.

కోల్ కతా నైట్ రైడర్స్ మొత్తం 14 రౌండ్లలో 13 మ్యాచ్ లు ఆడి 9 విజయాలు, 3 పరాజయాలతో సహా 18 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలవడంతో పాటు..ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా నిలిచింది.

ఆ తరువాతి స్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకూ ఆడిన 12 రౌండ్లలో 8 విజయాలు, 4 పరాజయాలతో సహా 16 పాయింట్లు సాధించడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రెండోజట్టుగా నిలిచింది.

లీగ్ టేబుల్ టాపర్ గా నిలవాలంటే చివరి రెండురౌండ్ల పోటీలలో రాజస్థాన్ రాయల్స్ నెగ్గి తీరాల్సి ఉంది. గౌహతీ వేదికగా ఈ రోజు జరిగే 13వ రౌండ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

రౌండ్ రాబిన్ లీగ్ లో ముగిసిన ఢిల్లీ పోరు...

రౌండ్ రాబిన్ లీగ్ దశలోని మొత్తం 14 రౌండ్ల మ్యాచ్ లు పూర్తి చేసిన తొలిజట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. హోంగ్రౌండ్ న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 19 పరుగులతో నెగ్గడం ద్వారా 7 విజయాలు, 7 పరాజయాలతో సహా మొత్తం 14 పాయింట్లు సాధించి...లీగ్ టేబుల్ 5వ స్థానంలో నిలిచింది.

రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీజట్టు ప్లే-ఆఫ్ రౌండ్ బెర్త్ అవకాశాలు గాల్లో దీపంలా మారాయి. మిగిలిన జట్ల జయాపజయాలతో పాటు..నెట్ రన్ రేట్ ప్రాతిపదికన మిగిలిన ఆరు రౌండ్ల మ్యాచ్ లు ముగిసేపక్షంలోనే ఢిల్లీకి అవకాశాలు ఉంటాయి.

ప్రస్తుతం లీగ్ టేబుల్ 5వ స్థానంలో కొనసాగుతున్నా..ఢిల్లీ ప్లే-ఆఫ్ రౌండ్ అవకాశాలు 62.5 శాతం ఉన్నాయి.

2 బెర్త్ ల కోసం ఐదుజట్ల పోరు...

ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లోని ఆఖరి ఆరుమ్యాచ్ ల ఫలితాల పైనే ఐదుజట్ల ప్లే-ఆఫ్ రౌండ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్లే-ఆఫ్ రౌండ్ ఆఖరి రెండు బెర్త్ ల కోసం..డిఫెండింగ్ చాంపియన్ చెన్నై, మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్, మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.

పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటికే ప్లే-ఆఫ్ రౌండ్ రేస్ నుంచి వైదొలిగాయి. పంజాబ్ 12 మ్యాచ్ ల్లో 4 విజయాలు, 8 పరాజయాలతో సహా 8 పాయింట్లతో లీగ్ టేబుల్ ఆఖరిస్థానంలో నిలిస్తే..ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్ ల్లో 4 విజయాలు, 9 పరాజయాలతో సహా 8 పాయింట్లతో ఆఖరి నుంచి రెండోస్థానంలో నిలిచింది. అయితే తన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో ముంబై తలపడాల్సి ఉంది.

మరో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 13 రౌండ్లలో 5 విజయాలు, 7 పరాజయాలతో సహా 10 పాయింట్లతో లీగ్ టేబుల్ 8వ స్థానానికి పడిపోడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ రేస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

12 రౌండ్లలో 7 విజయాలు, 5 పరాజయాల రికార్డుతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో రెండుమ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, చెన్నై, బెంగళూరు తమతమ ఆఖరి రౌండ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

ఇప్పటికే ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన రాజస్థాన్ సైతం చివరి రెండు రౌండ్ల మ్యాచ్ లు ఆడనుంది.

రౌండ్ రాబిన్ లీగ్ దశలోని ఆఖరి ఆరుమ్యాచ్ ల ఫలితాలు..ఏ జట్లను ముంచుతాయో..ఏ జట్లను తేల్చుతాయో తెలుసుకోవాలంటే..మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

First Published:  15 May 2024 12:20 PM GMT
Next Story