Telugu Global
Sports

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ వేళ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు రెండోసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడాలని గట్టి పట్టుదలగా ఉంది.

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ వేళ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు
X

టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు రెండోసారి వరల్డ్‌ కప్‌ను ముద్దాడాలని గట్టి పట్టుదలగా ఉంది. అందులో భాగంగా శనివారం నాడు జరగనున్న ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. మరోపక్క టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి ఇదే చివరి మెగా టోర్నీ. ఈ నెల తర్వాత ఆయన కోచింగ్‌ బాధ్యతలను వేరొకరికి అప్పగించనున్నారు.

మా జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్‌ రావాలని మాత్రమే నేను కోరుకుంటా..

ఈ నేపథ్యంలో కోచ్‌ ద్రవిడ్‌ కోసమైనా ఈసారి కప్‌ నెగ్గాలనే కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. దీనిపై ద్రవిడ్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా మీరు ‘ఎవరెస్టును ఎందుకు ఎక్కాలని అనుకుంటున్నావు?’ అని అడిగితే.. అతడు ‘అక్కడ అది ఉంది కాబట్టే నేను ఎక్కుదామనుకున్నాను’ అని చెబుతారు. అదే ప్రశ్నను ఆటగాళ్లను అడిగితే ‘వరల్డ్‌ కప్‌ ఇక్కడుంది. అందుకే గెలవాలని భావిస్తున్నా’ అని చెప్పాలి. అంతేకానీ, ఇది కొందరి కోసమో, ఒకరికి అంకితం చేయడానికో కాదని అన్నారు. తమ జట్టు నుంచి నాణ్యమైన క్రికెట్‌ రావాలని మాత్రమే తాను కోరుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అంతేకానీ, తన కోసం కప్‌ గెలవాలనే దానికి తాను విరుద్ధమన్నారు. అసలు దానిగురించే మాట్లాడాలనుకోనని ద్రవిడ్‌ వెల్లడించారు.

విరాట్‌ ఆట తీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదు...

విరాట్‌ కోహ్లీ ఆటతీరుపై వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై ద్రవిడ్‌ స్పందిస్తూ.. అత్యుత్తమ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ఫలితాలు సానుకూలంగా రావని చెప్పారు. అలాంటి సమయంలో అతడు విఫలమైనట్టు భావించనక్కర్లేదని తెలిపారు. కోహ్లీ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సిక్స్‌ కొట్టాడని, అదే దూకుడు ప్రదర్శించే క్రమంలో ఔటయ్యాడని చెప్పారు. అతడి ఆటతీరును ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. కోహ్లీ యాటిట్యూడ్‌ సూపర్‌ అని, తప్పకుండా మున్ముందు అతడి బ్యాట్‌ నుంచి పరుగులు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

First Published:  29 Jun 2024 4:01 AM GMT
Next Story