Telugu Global
Sports

ద్రావిడ్ కోచ్ గా వైట్ బాల్ సిరీస్ ల్లో హిట్...రెడ్ బాల్ లో ఫట్ !

వైట్ బాల్ క్రికెట్లో భారత్ ను అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిపిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రెడ్ బాల్ క్రికెట్లో వరుస పరాజయాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది.

ద్రావిడ్ కోచ్ గా వైట్ బాల్ సిరీస్ ల్లో హిట్...రెడ్ బాల్ లో ఫట్ !
X

వైట్ బాల్ క్రికెట్లో భారత్ ను అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిపిన చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రెడ్ బాల్ క్రికెట్లో వరుస పరాజయాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది.

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ మిశ్రమఫలితాలు ఎదుర్కొంటున్నారు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత్ ను ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా నిలపడంలో సఫలమైన ద్రావిడ్ కాంట్రాక్టు వన్డే ప్రపంచకప్ తోనే ముగిసినా..బీసీసీఐ మాత్రం కాంట్రాక్టును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకొంది.

అయితే...ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాలు వేదికగా ద్రావిడ్ కోచ్ గా భారత్ ఆడిన గత ఆరు టెస్టుమ్యాచ్ ల్లో వరుసగా 5 పరాజయాలు చవిచూడడం చర్చనీయాంశంగా మారింది.

సఫారీగడ్డపై ఘోరపరాజయం...

దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భాగంగా జోహెన్స్ బర్గ్ సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టు మూడోరోజు ఆటలోనే భారత్ ఇన్నింగ్స్ ఓటమిని చవిచూడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ స్థానం నుంచి పడిపోయింది.

ఫాస్ట్- బౌన్స్ తో కూడిన దక్షిణాఫ్రికా పిచ్ లపై భారత సూపర్ స్టార్ బ్యాటింగ్ లైనప్ రెండుకు రెండు ఇన్నింగ్స్ లోనూ పేకమేడలా కూలిపోయింది. సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం కిగోసో రబడ, నాండ్రే బర్గర్, మార్కో జెన్సన్ ల ధాటికి భారత్ కకావికలయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 130 స్కోర్లకే భారత్ పరిమితమయ్యింది. బౌలింగ్ విభాగంలో భారత్ దారుణంగా విఫలం కావడం సరికొత్త చర్చకు దారితీసింది.

ఇదే మొదటిసారి కాదు...

స్వింగ్,సీమ్, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే పిచ్ లపైన భారతజట్టు టెస్టుమ్యాచ్ ల్లో విఫలం కావడం ఇదే మొదటిసారికాదు. రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా భారతజట్టు..ఇంగ్లండ్,దక్షిణాఫ్రికా దేశాలు వేదికగా ఆడిన గత ఆరుటెస్టుల్లో ఐదు పరాజయాలు చవిచూడడం ద్వారా చెత్తరికార్డును మూటగట్టుకొంది.

ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ దేశాలలో భారతజట్టు ఆడిన గత సిరీస్ ల్లో రెండేసి విజయాలు చొప్పున నమోదు చేసింది. సఫారీగడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా గత 30 సంవత్సరాల కాలంలో తొలి టెస్ట్ సిరీస్ విజయం సాధించాలని ఉవ్విళూరింది. అయితే..సిరీస్ లోని తొలిటెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల ఘోరపరాజయంతో ఒక్కసారిగా నీరుగారిపోయింది.

జనవరి 3 నుంచి కేప్ టౌన్ న్యూవాండరర్స్ స్టేడియం వేదికగా జరిగే రెండోటెస్టులో నెగ్గగలిగితేనే 1-1తో సిరీస్ ను సమం చేయగలుగుతుంది.

2021-2 2సిరీస్ నుంచి అదే సీన్...

రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా 2021-22 సిరీస్ ను జోరుగా మొదలు పెట్టిన భారత్ ఆ తరువాత తేలిపోయింది. ఇంగ్లండ్ తో సిరీస్ ను 2-1 ఆధిక్యంతో ఏడాది విరామం తరువాత కొనసాగించిన భారత్..ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన టెస్టులో ఓటమి చవిచూసింది.

రిషభ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు, రవీంద్ర జడేజా 104 పరుగులు సాధించడంతో 132 పరుగుల తొలిఇన్నింగ్స్ సాధించినా బౌలర్ల వైఫల్యంతో 6 వికెట్లతో అనుకోని ఓటమి ఎదుర్కొంది.

టెస్టు లీగ్ ఫైనల్లో పరాజయం...

ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం ద్వారా భారీమూల్యం చెల్లించుకొంది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ను పక్కనపెట్టి చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.

తొలిఇన్నింగ్స్ లో ఆస్ట్ర్రేలియా 469 పరుగుల భారీస్కోరుతో భారత్ ను తీవ్రఒత్తిడికి గురిచేసింది. ఆస్ట్ర్రేలియాజట్టులోని మొదటి 7గురు బ్యాటర్లలో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లున్నా జట్టులో ఆఫ్ స్పిన్నర్ లేకపోడం భారత్ ను దెబ్బతీసింది. వికెట్ ను సరిగా అంచనావేయలేకపోడం కోచ్ గా ద్రావిడ్ వైఫల్యానికి నిదర్శనంగా మిగిలిపోతుంది.

ద్రావిడ్ కోచ్ గా బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లతో జరిగిన నాలుగుకు నాలుగు టెస్టుల్లోనూ భారత్ విజయాలు సాధించినా...ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల గడ్డపైన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోడం విమర్శలకు కారణమయ్యింది.

కేప్ టౌన్ వేదికగా జనవరి 3 నుంచి జరిగే ఆఖరి, రెండోటెస్టు భారతజట్టుకు మాత్రమే కాదు..చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ సత్తాకు సైతం అసలు సిసలు సవాలు అనడంలో ఏమాత్రం సందేహంలేదు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టెస్టు జట్టుగా భారత్ తన పరువు దక్కించుకోవాలంటే కేప్ టౌన్ టెస్టులో ఆరునూరైనా నెగ్గితీరాల్సి ఉంది.

First Published:  30 Dec 2023 10:19 AM GMT
Next Story