Telugu Global
Sports

ద్రావిడ్ వైపే బీసీసీఐ చూపు!

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా కొనసాగాలని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ వేడుకొంటోంది. మరో ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించాలని అభ్యర్థిస్తోంది.

ద్రావిడ్ వైపే బీసీసీఐ చూపు!
X

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా కొనసాగాలని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ ను బీసీసీఐ వేడుకొంటోంది. మరో ఏడాది పాటు బాధ్యతలు నిర్వర్తించాలని అభ్యర్థిస్తోంది.

భారత క్రికెట్ హెడ్ కోచ్ గా గత రెండేళ్లుగా అసమాన సేవలు అందించిన రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు నవంబర్ 21తోనే ముగిసిపోడంతోనే బీసీసీఐకి కష్టాలు ప్రారంభమయ్యాయి.

ద్రావిడ్ స్థానంలో మరో వ్యక్తిని చీఫ్ కోచ్ గా నియమించడానికి బీసీసీఐ అంతగా ఆసక్తి చూపడం లేదు.

ప్రస్తుతం ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొంటున్న సూర్యకుమార్ నేతృత్వంలోని భారతజట్టుకు జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్ గా సేవలు అందిస్తున్నారు.

ద్రావిడ్ కాదు..కాదంటున్నా....

2021 నవంబర్ నుంచి 2023 నవంబర్ వరకూ భారతజట్టు కోచ్ గా సేవలు అందించడమే కాదు..క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపిన ఘనత ద్రావిడ్ కు ఉంది. భారత్ ను ఐసీసీ ప్రపంచ చాంపియన్ గా నిలపడంలో విఫలమైనా..వన్డే ప్రపంచకప్, టెస్టులీగ్ ల్లో రన్నరప్ స్థానాలు సాధించిపెట్టారు. టీ-20 ప్రపంచకప్ లో మాత్రం సెమీస్ లోనే భారత్ పోటీ ముగిసినా..పలు స్వదేశీ, విదేశీ టెస్టు, వన్డే సిరీస్ ల్లో విజయాలు అందించారు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా గత రెండేళ్లకాలంలో మూడుఫార్మాట్లలోనూ భారత్ ను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలపడం పట్ల బీసీసీఐ పూర్తిసంతృప్తితో ఉంది.

అయితే..ద్రావిడ్ మాత్రం తన కాంట్రాక్టు పొడిగించ వద్దంటూ బీసీసీఐకి సంకేతాలు పంపారు. భారతజట్టు సభ్యుడిగా 20 సంవత్సరాలపాటు కుటుంబానికి దూరమైన ద్రావిడ్..చీఫ్ కోచ్ హోదాలోసైతం గత రెండేళ్లుగా తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక నుంచి కుటుంబానికే ప్రాధాన్యమివ్వాలన్న లక్ష్యంతోనే తన కాంట్రాక్టు పొడిగించుకోడం పట్ల నిరాసక్తతో ఉన్నారు.

బీసీసీఐ మాత్రం ఇప్పటికిప్పుడే ద్రావిడ్ స్థానంలో మరో కోచ్ ను నియమించడం పట్ల అంత అసక్తి చూపడం లేదు.

8 మాసాలలో టీ-20 ప్రపంచకప్...

మరో 8 మాసాలలోనే టీ-20 ప్రపంచకప్ జరుగనుండడంతో ..భారతజట్టుకు ద్రావిడ్ స్థానంలో మరొకరిని నియమించడానికి బీసీసీఐ తటపటాయిస్తోంది. కొత్తగా వచ్చిన వారికి..కేవలం కొద్దిమాసాల కాలంలోనే ప్రపంచకప్ కు జట్టును సిద్ధం చేయటం సాధ్యంకాదని, చీఫ్ కోచ్ గా ద్రావిడ్ మరో ఏడాది కొనసాగితే బాగుంటుందని బీసీసీఐ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. అందులో భాగంగానే ద్రావిడ్ ను బతిమాలుతూ మంతనాలు సాగిస్తున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్ గా, ద్రావిడ్ చీఫ్ కోచ్ గా వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరిగే 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు పాల్గొనాలన్నది బీసీసీఐ వ్యూహంగా కనిపిస్తోంది.

ద్రావిడ్ తన మనసు మార్చుకొని కోచ్ గా మరో ఏడాదిపాటు కొనసాగటానికి ఆసక్తి చూపితే బీసీసీఐ ..చీఫ్ కోచ్ కొనసాగింపును అధికారికంగా ప్రకటించనుంది. ద్రావిడ్ ససేమిరా అంటే మాత్రం..వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్ గా ప్రపంచకప్ సన్నాహాలను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  26 Nov 2023 7:38 AM GMT
Next Story