Telugu Global
Sports

ఆల్-ఇంగ్లండ్ తొలిరౌండ్లోనే సింధు బోల్తా!

తెలుగుతేజం పీవీ సింధుకు రిటైర్మెంట్ ఘడియలు దగ్గర పడినట్లు కనిపిస్తున్నాయి.

ఆల్-ఇంగ్లండ్ తొలిరౌండ్లోనే సింధు బోల్తా!
X

తెలుగుతేజం పీవీ సింధుకు రిటైర్మెంట్ ఘడియలు దగ్గర పడినట్లు కనిపిస్తున్నాయి. 2023 సీజన్ తొలి మూడుటోర్నీల తొలిరౌండ్లోనే ఓటమి ఎదుర్కొని అయోమయంలో చిక్కుకొంది....

తెలుగుతేజం, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు రిటైర్మెంట్ కు సమయం దగ్గర పడుతోంది. గత రెండేళ్లుగా వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న సింధు..తరచూ శిక్షకులను మార్చుతున్నా ప్రయోజనం ఏమాత్రం కనిపించడం లేదు.

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 2023 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే సింధుకు చుక్కెదురయ్యింది. ప్రస్తుత 2023 సీజన్ లో ఇప్పటి వరకూ ఆడిన మూడుకు మూడు అంతర్జాతీయ టోర్నీల తొలిరౌండ్లోనే సింధు పరాజయాలు చవిచూసింది.

Advertisement

గత మూడేళ్లుగా.....

ప్రపంచ టైటిల్, ఒలింపిక్స్ పతకాలు సాధించిన సింధూకి ఆల్- ఇంగ్లండ్ టైటిల్ ఏమాత్రం కొరుకుడు పడటం లేదు. ఆరునూరైనా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కొట్టాలని భావిస్తున్న సింధుపైన ఏడాది ఏడాదికీ వయసు మీద వచ్చి పడుతున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంలో తనకు అండగా నిలిచిన కొరియా కోచ్ పార్క్ తాయ్ -సాంగ్ తో ఇటీవలే తెగతెంపులు చేసుకొని సరికొత్త కోచ్ తో బరిలోకి దిగినా సింధు రాత మాత్రం మారలేదు.

Advertisement

గత మూడేళ్లుగా ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టడం సింధుకు ఓ అలవాటుగా, బలహీనతగా మారిపోయింది. ఆల్ -ఇంగ్లండ్ మెడల్, ట్రోఫీల సంగతి అటుంచి కనీసం తొలిరౌండ్ గండం నుంచి గట్టెక్కలేకపోతోంది.

సింధుకు జాంగ్ షాక్....

ప్రస్తుత సీజన్ ఆల్ - ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ తొలిరౌండ్లోనే చైనాకు చెందిన 17వ ర్యాంక్ ప్లేయర్ జాంగ్ ఇ మాన్ చేతిలో సిందు వరుస గేమ్ ల పరాజయాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది.

తనకంటే పదిర్యాంకులు దిగువన ఉన్న జాంగ్ చేతిలో సింధుకు 17-21, 11-21తో ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నో అంతర్జాతీయ టైటిల్స్, పతకాలు సాధించిన సింధు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. 39 నిముషాలలోనే ఓటమి పాలయ్యింది.

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం 9వ ర్యాంకర్ గా ఉన్న సింధు 2023 సీజన్ లో భాగంగా ఆడిన తొలిటోర్నీ మలేసియన్ ఓపెన్ తొలిరౌండ్లో కారోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇండియన్ ఓపెన్ తొలిరౌండ్లోనూ విఫలమైన సింధుకి..ఆల్- ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనూ పరాజయం తప్పలేదు. ఆడిన మూడుకు మూడుటోర్నీల తొలిరౌండ్లోనే చిత్తుకావడం సింధు కెరియర్ లో ఇదే మొదటిసారి.

వయసు మీద పడటం, విజయాలు సాధించాలన్న కసి, తపన రానురాను తగ్గిపోతున్న కారణంగానే సింధు వరుసగా వైఫల్యాలు ఎదుర్కొనాల్సి వస్తోంది.

పురుషుల విభాగంలో భారత్ శుభారంభం..

ఇక ..పురుషుల సింగిల్స్ లో మరో తెలుగు తేజం కిడాంబీ శ్రీకాంత్ రెండోరౌండ్ కు అర్హత సాధించాడు. తొలిరౌండ్లో ఫ్రెంచ్ ఆటగాడు టొమొ జూనియర్‌ పొపొవ్‌పై 19-21, 21-14, 21-5తో విజేతగా నిలిచాడు.మహిళల డబుల్స్ బరిలోకి దిగిన భారత జోడి గాయత్రి గోపీచంద్‌-త్రిసా జాలి తొలివిజయం సాధించారు. థాయ్ జోడీ జోంకోల్పన్- రవిందపై 21-18, 21-14తో విజయాన్ని అందుకొని రెండోరౌండ్లోకి అడుగుపెట్టారు.

పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్, ప్రణయ్ ఇప్పటికే తొలిరౌండ్ విజయాలతో రెండోరౌండ్ కు అర్హత సంపాదించారు.

గత 112 సంవత్సరాల ఆల్- ఇంగ్లండ్ టోర్నీల చరిత్రలో విజేతలుగా నిలిచిన ఘనత ఇద్దరంటే ఇద్దరు భారత దిగ్గజాలకు మాత్రమే దక్కుతుంది. 1980లో అలనాటి స్టార్ ప్లేయర్ ప్రకాశ్ పడుకోన్ తొలిసారిగా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టిస్తే..అదే ఘనతను తెలుగుతేజం పుల్లెల గోపీచంద్ ...ఆ తర్వాత రెండుదశాబ్దాలవిరామం తర్వాత టైటిల్ నెగ్గి...ప్రకాశ్ సరసన నిలువగలిగాడు.

మహిళల విభాగంలో సైనా, సింధు తమవంతు ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకూ సఫలం కాలేకపోయారు. సైనా ఫైనల్ వరకూ చేరినా..రన్నరప్ స్థానంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Next Story