Telugu Global
Sports

ఢిల్లీ దెబ్బతో ప్లే- ఆఫ్ రేస్ నుంచి పంజాబ్‌ అవుట్!

ఐపీఎల్ -16వ సీజన్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి మరోజట్టు వైదొలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టిన దెబ్బతో పంజాబ్ కింగ్స్ ఆశలు ఆవిరైపోయాయి.

ఢిల్లీ దెబ్బతో ప్లే- ఆఫ్ రేస్ నుంచి పంజాబ్‌ అవుట్!
X

ఢిల్లీ దెబ్బతో ప్లే- ఆఫ్ రేస్ నుంచి పంజాబ్‌ అవుట్!

ఐపీఎల్ -16వ సీజన్ ప్లే-ఆఫ్ రేస్ నుంచి మరోజట్టు వైదొలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టిన దెబ్బతో పంజాబ్ కింగ్స్ ఆశలు ఆవిరైపోయాయి....

ఐపీఎల్- 16వ సీజన్ లీగ్ తొలి అంచెమ్యాచ్ లను వరుస విజయాలతో మొదలు పెట్టిన పంజాబ్ కింగ్స్ మలిఅంచెమ్యాచ్ ల్లో మాత్రం తేలిపోయింది. ప్లే-ఆఫ్ బెర్త్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే నెగ్గితీరాల్సిన 13వ రౌండ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆఖరిరౌండ్ పోరులో నెగ్గినా..ప్లేఆఫ్ రౌండ్ చేరే అవకాశమే లేకుండా పోయింది.

ధర్మశాలలో పరుగుల వెల్లువ..

సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రస్తుత సీజన్లో జరిగిన ఐపీఎల్ తొలిమ్యాచ్ లో పరుగుల మోత మోగింది.

బ్యాటింగ్ కు అనువుగా ఉన్న పిచ్ పైన రెండుజట్లలోని స్ట్ర్రోక్ మేకర్లు తమ బ్యాట్లకు పూర్తి స్థాయిలో పని చెప్పారు. ముందుగా ఢిల్లీ జోడీ పృథ్వీ షా, ర్యాలీ రూసో..ఆ తర్వాత పంజాబ్ సూపర్ హిట్టర్ లైమ్ లివింగ్ స్టోన్ భారీషాట్లతో శివమెత్తిపోయారు. వ్యయప్రయాసలకోర్చి వచ్చిన అభిమానులు పైసా వసూల్ అనుకొనేలా చేశారు.

ఢిల్లీ 20 ఓవర్లలో 213...

ప్రస్తుత సీజన్లో అంతంత మాత్రం బ్యాటింగ్ తో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక వరుస పరాజయాలు చవిచూస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్..పంజాబ్ తో జరిగిన 13వ రౌండ్ మ్యాచ్ లో పూర్తిస్థాయిలో చెలరేగిపోయింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్- పృథ్వీ షా ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో తమజట్టుకు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు.

హాఫ్ సెంచరీ వార్నర్ చేజారినా...మరో ఓపెనర్ పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, వన్ డౌన్ బ్యాటర్ ర్యాలీ రూసో 37 బంతుల్లోనే 6 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో ఢిల్లీజట్టు ప్రత్యర్థి ఎదుట 214 పరుగుల భారీవిజయలక్ష్యాన్ని ఉంచగలిగింది. పంజాబ్ బౌలర్లల సామ్ కరెన్ 36 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

లివింగ్ స్టోన్ పోరాడినా...

మ్యాచ్ నెగ్గడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే 214 పరుగులు చేయాల్సిన పంజాబ్..తొలి ఓవర్లోనే కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ ను డకౌట్ గా నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. ఆ వెంటనే మరో ఓపెనర్ జితేశ్‌శర్మ(0) సైతం వెనుదిరిగాడు. షారుఖ్‌ఖాన్‌(6), సామ్‌ కరన్‌(11) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్నా సూపర్ హిట్టర్ లైమ్ లివింగ్ స్టోన్ భారీషాట్లతో ఒంటరి పోరాటం చేశాడు. తనజట్టును విజేతగా నిలపడానికి తుదివరకూ శ్రమించాడు. 48 బంతుల్లోనే 5 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 94 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. అథర్వ తడే(55 రిటైర్డ్‌ హర్ట్‌) సైతం కీలక హాఫ్ సెంచరీ సాధించినా ప్రయోజనం లేకపోయింది.దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఢిల్లీ బౌలర్లలో ఫాస్ట్ బౌలింగ్ జోడీ ఇషాంత్‌శర్మ(2/36), నోర్గే (2/36)రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఢిల్లీ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువబ్యాటర్ ర్యాలీ రూసోకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

దెబ్బకు దెబ్బ తీసిన ఢిల్లీ...ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో పంజాబ్ చేతిలో ఎదురైన ఓటమికి..ఈ గెలుపు ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకోగలిగింది.

ఆఖరి రెండురౌండ్ల మ్యాచ్‌లు నెగ్గడం ద్వారా ప్లేఆఫ్‌ రేసులో నిలవాలనుకొన్న పంజాబ్ ఆశలు ఈ ఓటమితో అడియాసలయ్యాయి. ఇప్పటి వరకూ ఆడిన 13 మ్యాచ్‌ల్లో పంజాబ్ ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంటే... ఇప్పటికే ప్లేఆఫ్స్‌ నుంచి వైదొలగిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 విజయాలు, 8 పరాజయాలతో 10 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది.తన ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో పంజాబ్‌ తలపడనుండగా.. చెన్నైతో ఢిల్లీ ఢీకోనుంది.

First Published:  18 May 2023 12:17 PM GMT
Next Story