Telugu Global
Sports

ఐపీఎల్ లో పంజాబ్ జోరు, లక్నో హోరు!

ఐపీఎల్-16వ సీజన్ లీగ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలివిజయాలతో శుభారంభం చేశాయి.

ఐపీఎల్ లో పంజాబ్ జోరు, లక్నో హోరు!
X

ఐపీఎల్-16వ సీజన్ లీగ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తొలివిజయాలతో శుభారంభం చేశాయి....

ఐపీఎల్ 16వ సీజన్ సమరం సంచలనాలు, అనుహ్యఫలితాలతో ప్రారంభమయ్యింది. 10 జట్లు, 70 మ్యాచ్ ల ఈ లీగ్ లో తొలిరౌండ్ విజయాలు నమోదు చేసిన జట్లుగా

డిఫెండింగ్ చాంపియన్ Gujarat Titans నిలిస్తే..మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాలతో మొదలు పెట్టాయి.

ఢిల్లీపై లక్నో సూపర్ విన్.....

లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరిగిన తొలిరౌండ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. రాహుల్ నాయకత్వంలోని లక్నోజట్టు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది.

ఓపెన‌ర్ కైలీ మేయ‌ర్స్ విధ్వంస‌క ఇన్నింగ్స్‌తో ఆ జ‌ట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. ఆ త‌ర్వాత పేస‌ర్ పేస‌ర్ మార్క్ వుడ్ 5 వికెట్ల‌తో చెల‌రేగాడు. లెగ్ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ 2కీల‌క వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బ‌కొట్టాడు. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఒంట‌రి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది.

మేయర్స్, పూరన్ ఫటాఫట్...

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నోజట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెన‌ర్ మేయ‌ర్స్ తన అరంగేట్రం ఐపీఎల్ మ్యాచ్ లోనే అర్ధ శ‌త‌కంతో చెలరేగిపోయాడు.

కైలీ మ‌య‌ర్ భారీషాట్లతో , సుడిగాలి బ్యాటింగ్ తో ఢిల్లీ బౌలర్లను ఆటాడుకొని 73 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. దీప‌క్ హుడా (17)తో రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యంతో భారీస్కోరుకు పునాది వేశాడు.

మార్క‌స్ స్టోయినిస్ 12 పరుగులకే అవుటవ్వడంతో.. ల‌క్నో 150 స్కోరు సాధించడం సాధ్యం కాదనిపించింది. అయితే..ఆఖర్లో ల‌క్నో బ్యాట‌ర్లు 22 ప‌రుగులు రాబ‌ట్టారు. దీంతో ప్రత్యర్థి ఎదుట 194 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచగలిగింది.

ఢీల్లీ బౌల‌ర్ల‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్, చేత‌న్ స‌కారియా రెండేసి వికెట్లు పడగొట్టారు.స్పిన్ జోడీ అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్‌ చెరో వికెట్ తో సరిపెట్టుకొన్నారు.

డేవిడ్ వార్నర్ ఒంటరిపోరాటం..

ఆ త‌ర్వాత 194 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఢిల్లీ వరుస ఓవర్లలో వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

ఢిల్లీకి ప్రారంభ ఓవర్లలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. మార్క్ వుడ్ త‌న తొలి ఓవ‌ర్‌లోనే సూపర్ హిట్టర్లు పృథ్వీ షా(12), మిచెల్ మార్ష్‌(0)ల‌ను పడగొట్టాడు. ఆ త‌ర్వాత స‌ర్ఫ‌రాజ్ ఖాన్(4)ను పెవీలియన్ దారి పట్టించాడు. రిలే రూసో(30), పావెల్‌(1)ను స్పిన్నర్ బిష్ణోయ్ సాగనంపాడు. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ (56) తుదివరకూ పోరాడి అర్ధ శ‌త‌కం బాదినా ప్రయోజనం లేకపోయింది. వార్నర్ ఔట‌వ్వడంతోనే ఢిల్లీ ఓటమి ఖాయ‌మైంది. చివ‌ర్లో అక్ష‌ర్ ప‌టేల్ ఓ బౌండ్రీ, ఓ సిక్సర్ తోధాటిగా ఆడ‌డంతో ప‌రుగుల అంత‌రం త‌గ్గింది.ఢిల్లీ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగుల‌కే పరిమితమయ్యింది.

లక్నో మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేశాడు. నిప్పులు చెరిగే బౌలింగ్ తో శివమెత్తిపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ లో 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా నిలిచాడు.

ల‌క్నో బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బిష్ణోయ్, అవేశ్ ఖాన్ తలా రెండేసి వికెట్లు తీశారు.

పంజాబ్ 7 పరుగుల గెలుపు....

మొహాలీ స్టేడియం వేదికగా అంతకు ముందు జరిగిన మరో తొలిరౌండ్ పోరులో ఆతిథ్య పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో డక్ వర్త్- లూయిస్ విధానం ప్రకారం

కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించగలిగింది.

మొహాలీ స్టేడియం ఫ్లడ్ లైట్లు అరగంటపాటు మొరాయించడం, వర్షంతో అంతరాయం లాంటి కారణాలు కోల్ కతా విజయావకాశాలను దెబ్బతీశాయి.

రాజ‌ప‌క్సే సూపర్ హాఫ్ సెంచ‌రీ

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 191 ప‌రుగులు చేసింది. ఓపెనర్ భానుక‌ రాజ‌ప‌క్సే (50) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్(40), ఓపెన‌ర్ ప్ర‌భ్‌సింహ్ రానా సింగ్ (23) వికెట్ కీప‌ర్ జితేశ్ శ‌ర్మ(21), సికింద‌ర్ ర‌జా (16) రాణించడంతో పంజాబ్ పుంజుకోగలిగింది. డెత్ ఓవర్లలో. ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ బ్యాట్ ఝుళిపించడం ద్వారా 26) షారుఖ్ ఖాన్11 పరుగులు రాబట్టడంతో పంజాబ్ 191 పరుగులు చేయగలిగింది.

కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో టిమ్‌ సౌథీ రెండో వికెట్లు , సునీల్ న‌రైన్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఉమేశ్ యాద‌వ్ త‌లో ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

అర్ష్‌దీప్ స్వింగ్ మ్యాజిక్...

ఆ తర్వాత..192 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన కోల్ కతాను పంజాబ్ స్వింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ తో పాటు..వర్షం కూడ దెబ్బ కొట్టింది.

అర్ష్‌దీప్ సింగ్ ఓకే ఓవ‌ర్‌లో రెండో వికెట్లు పడగొట్టడంతో కోల్ కతా కోలుకోలేకపోయింది. అనుకుల్ రాయ్ (4), మన్‌దీప్ సింగ్ (2) ఔట‌య్యారు. ఆ త‌ర్వాత నితీశ్ రానా, గుర్బాజ్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.దీంతో. 80 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌ను...మిడిలార్డర్ బ్యాటర్లు అండ్రూ ర‌స్సెల్, వెంక‌టేశ్ అయ్యర్ అదుకున్నారు. ఆరో వికెట్‌కు 50 పరుగుల కీలక భాగస్వామ్యంతో గాడిలో పెట్టడానికి ప్రయత్నించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్, న‌రైన్ వేగంగా ఆడినా.. వ‌ర్షం అడ్డుకోడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ వెంక‌టేశ్ అయ్యర్ (34), విధ్వంస‌క హిట్టర్ అండ్రూ ర‌స్సెల్ (35), కెప్టెన్ నితీశ్ రానా(24) మాత్ర‌మే రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గ‌ట్టాడు. సామ్ క‌ర‌న్‌, నాథ‌న్ ఎల్లిస్, సికింద‌ర్ ర‌జా, రాహుల్ చ‌హ‌ర్ త‌లా ఒక వికెట్ తీశారు.

వ‌ర్షం ప‌డే స‌మ‌యానికి కేకేఆర్ 7 వికెట్ల న‌ష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. డీఎల్‌ఎస్ ప్రకారం ఆజ‌ట్టు 16 ఓవ‌ర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, 7 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.

First Published:  2 April 2023 2:30 AM GMT
Next Story