Telugu Global
Sports

పంజాబ్ పై సన్‌రైజర్స్‌ ధనాధన్ గెలుపు

హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన మూడోరౌండ్ పోరులో వరుస విజయాలతో దూకుడుమీదున్న పంజాబ్ కు కళ్లెం వేసింది. 8 వికెట్ల విజయంతో సత్తా చాటుకొంది.

పంజాబ్ పై సన్‌రైజర్స్‌ ధనాధన్ గెలుపు
X

ఐపీఎల్-16వ సీజన్లో మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ బోణీ కొట్టింది. పంజాబ్ పై ధనాధన్ విజయం సాధించింది.

ఐపీఎల్ 2023 సీజన రౌండ్ రాబిన్ లీగ్ లో వరుస పరాజయాలతో అభిమానుల సహనానికి పరీక్ష పెట్టిన మాజీ విజేత హైదరాబాద్ సన్ రైజర్స్ ఎట్టకేలకు ఓ విజయం నమోదు చేసింది.

హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా జరిగిన మూడోరౌండ్ పోరులో వరుస విజయాలతో దూకుడుమీదున్న పంజాబ్ కు కళ్లెం వేసింది. 8 వికెట్ల విజయంతో సత్తా చాటుకొంది.

స్థానబలంతో.. ఈ సారి సమిష్టిగా రాణించడం ద్వారా సన్ రైజర్స్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. 10 జట్ల లీగ్ టేబుల్ లోతన పాయింట్ల ఖాతాను తెరువగలిగింది.

శిఖర్ ఒంటరిపోరాటం వృథా!

ఈ కీలక పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.సన్ రైజర్స్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ టాపార్డర్ కకావికలమైపోయింది. ప్రధానంగా ఫాస్ట్ బౌలర్ జాన్సన్, లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండె దెబ్బతో పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ సైకిల్ స్టాండ్ లా కూలిపోయింది. ఓపెనర్ ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (0), షార్ట్‌ (1), జితేశ్‌ శర్మ (4), సికందర్‌ రజా (5), షారుక్‌ ఖాన్‌ (4) వరుస కట్టారు.

ఓ ఎండ్ లో బ్యాటర్లు విఫలమవుతున్న..మరో ఎండ్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ పోరాడుతూ తన ఎదురుదాడి కొనసాగించాడు.

శిఖర్‌తో పాటు ఆల్ రౌండర్ సామ్‌ కరన్‌ (22) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించగలిగాడు. సామ్ క‌ర‌న్(22)తో క‌లిసి 41పరుగులు జోడించాడు. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో సిక్స్ బాది అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో యాభై ర‌న్స్ చేశాడు. ఆ త‌ర్వాత మ‌రింత ధాటిగా ఆడాడు. శిఖర్‌ ధవన్‌ కడవరకూ తన పోరాటం కొనసాగించి 66 బంతుల్లో 12 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 99 స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఒక దశలో 88 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 143 పరుగుల స్కోరు చేసిందంటే అదంతా ధావ‌న్ ప్రతిభే. ఉమ్రాన్, భువ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌లో సిక్స్‌లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డిన ధావన్ స్కోర్ 140 దాటించాడు. మోహిత్ ర‌థీ(1)తో క‌లిసి ఆఖ‌రి వికెట్‌కు మెరుపువేగంతో 55 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.

హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో మ‌యాంక్ మార్కండే నాలుగు వికెట్లు, మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

రాహుల్ త్రిపాఠీ అజేయ హాఫ్ సెంచరీ..

144 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ మరో 17 బంతులు ఉండగానే కేవలం 2 వికెట్ల నష్టానికే విజయం అందుకోగలిగింది.

ఓపెన‌ర్లు హ్యారీ బ్రూక్(13), మ‌యాంక్ అగ‌ర్వాల్ (21) త‌క్కువ‌ స్కోర్లకే అవుటైనా.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌ రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్య‌తాయుతంగా ఆడాడు. కెప్టెన్‌ మర్కరమ్ తో (37 నాటౌట్‌; 6 ఫోర్లు) తో క‌లిసి మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించాడు. ఈ జోడీ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడి జ‌ట్టుకు విజయం ఖాయం చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహ‌ర్ చెరో వికెట్ పడగొట్టారు.

పంజాబ్ కెప్టెన్ శిఖర్‌ ధవన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ప్రస్తుత సీజన్లో మూడు రౌండ్లలో సన్ రైజర్స్ కు ఇదే తొలిగెలుపు కాగా...పంజాబ్ కు తొలి పరాజయం.

ఈ మ్యాచ్ కు భారీసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. 35 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం కిటకిటలాడింది. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ రోజు జరిగే సింగిల్ షోలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7-30 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

First Published:  10 April 2023 8:45 AM GMT
Next Story