Telugu Global
Sports

60వ శతకంతో హేమాహేమీల సరసన పూజారా!

భారత టెస్టుజట్టులో చోటు కోల్పోయిన నయావాల్ చతేశ్వర్ పూజారా దేశవాళీ క్రికెట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటుకొన్నాడు. హేమాహేమీల సరసన నిలిచాడు.

60వ శతకంతో హేమాహేమీల సరసన పూజారా!
X

60వ శతకంతో హేమాహేమీల సరసన పూజారా!

భారత టెస్టుజట్టులో చోటు కోల్పోయిన నయావాల్ చతేశ్వర్ పూజారా దేశవాళీ క్రికెట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటుకొన్నాడు. హేమాహేమీల సరసన నిలిచాడు....

భారత టెస్టు క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారాకు పడిపోయిన ప్రతిసారీ పోరాడి లేచినిలబడటం అలవాటే. తన కెరియర్ లో గత దశాబ్దకాలంగా భారత్ తరపున 103 టెస్టులు ఆడిన పూజారా..ప్రస్తుత వెస్టిండీస్ టెస్టు సిరీస్ కు ఎంపికైన భారతజట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ రెండు ఇన్నింగ్స్ లోనూ విఫలం కావడంతో పూజారాను సెలెక్టర్లు పక్కన పెట్టారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పూజారా జోరు...

ఐదురోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్ కోసమే పుట్టిన ఆటగాడు పూజారా. గంటల తరబడి క్రీజునే అంటుకు పోయి ఆడటంలో, ప్రత్యర్థిజట్ల బౌలర్ల సహనాన్ని పరీక్షించడంలో పూజారా తర్వాతే ఎవరైనా. పూజారాపై టెస్టు స్పెషలిస్టుగా ముద్రపడిపోడంతో ఐపీఎల్ లో అవకాశమే లేకుండా పోయింది. దీంతో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో గత రెండు సీజన్లుగా ఆడుతూ వస్తున్న 35 సంవత్సరాల పూజారా లాంటి మేటి ఆటగాడినే భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ పక్కనపెట్టే సాహసం చేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు పూజారాను టెస్టు సిరీస్ కు ఎంపిక చేయకుండా రిటైర్ కమ్మంటూ సంకేతాలు పంపింది.

అయితే..పూజారా మాత్రం తన కెరియర్ ఇంకా ముగిసిపోలేదని, మరో రెండేళ్లపాటు భారతజట్టుకు సేవలు అందించే సత్తా తనలో ఉందని భావిస్తున్నాడు. వెస్టిండీస్ సిరీస్ కు తనను ఎంపిక చేయకపోడంతోనే...దేశవాళీ క్రికెట్లో పాల్గొనాలని నిర్ణయించాడు.

దులీప్ ట్రోఫీలో ఫైటింగ్ సెంచరీ...

2023 దులీప్ (జాతీయ జోనల్ క్రికెట్ చాంపియన్షిప్ ) ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టు తరపున బరిలోకి దిగిన పూజారా..సెంట్రల్ జోన్ తో జరుగుతున్న ఐదురోజులమ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ( 28 ) విఫలమైనా...కీలక రెండో ఇన్నింగ్స్ లో ఫైటింగ్ సెంచరీతో తనజట్టును భారీఆధిక్యంలో నిలిపాడు.

మిగిలిన బ్యాటర్లంతా పరుగులు చేయటానికే నానతంటాలు పడిన పిచ్ పైన పూజారా ఎక్కడలేని ఓర్పు, నేర్పుతో బ్యాటింగ్ కొనసాగించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 278 బంతులు ఆడి 14 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 133 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలసి 95 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా తన జట్టును కష్టాల నుంచి బయటపడేశాడు. సూర్యకుమార్ 58 బంతుల్లో 52 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. వెస్ట్ జోన్ ఓపెనర్లు పృథ్వీ షా 25, సర్ ఫ్రాజ్ ఖాన్ 6 తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పూజారాకు ఇది 60 శతకం కావడం విశేషం. పూజారా ఫైటింగ్ సెంచరీతో వెస్ట్ జోన్ తన ఆధిక్యాన్ని 350 పరుగులకు పెంచుకోగలిగింది.

5వ భారత క్రికెటర్ పూజారా...

భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో 60కి పైగా శతకాలు సాధించిన ఐదవ బ్యాటర్ గా చతేశ్వర్ పూజారా రికార్డుల్లో చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ 81 సెంచరీలు చొప్పున సాధించడం ద్వారా సంయుక్త అగ్రస్థానంలో నిలిస్తే, 60 శతకాలతో విజయ్ హజారే తో కలసి పూజారా సంయుక్త ద్వితీయస్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున ఇప్పటి వరకూ 103 టెస్టులు ఆడిన పూజారా 19 శతకాలతో సహా...7వేల 195 పరుగుల సాధించాడు.

First Published:  8 July 2023 10:45 AM GMT
Next Story