Telugu Global
Sports

పీటీ ఉష అరుదైన ఘనత!

భారత క్రీడారంగంలో పెనుమార్పులు చోటు చేసుకొంటున్నాయి. క్రీడాసంఘాల వ్యవహారాలను క్రీడాకారులే నిర్వహించుకొనే రోజులు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద క్రీడాసమాఖ్య భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగులరాణి పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ద్వారా చరిత్ర సృష్టించారు.

పీటీ ఉష అరుదైన ఘనత!
X

పీటీ ఉష అరుదైన ఘనత!

భారత క్రీడారంగంలో పెనుమార్పులు చోటు చేసుకొంటున్నాయి. క్రీడాసంఘాల వ్యవహారాలను క్రీడాకారులే నిర్వహించుకొనే రోజులు వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద క్రీడాసమాఖ్య భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగులరాణి పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ద్వారా చరిత్ర సృష్టించారు....

కాలం మారింది. క్రీడాసంఘాలలో రాజకీయనాయకులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు పెత్తనం చేసే రోజులకు కాలం చెల్లింది. గతంలో దేశంలో ఏ క్రీడాసంఘాన్ని చూసినా..రాజకీయ ప్రముఖులో...బ్యూరోక్రాట్లో, వ్యాపారవేత్తలో నేతృత్వం వహించడం మనకు తెలుసు. అయితే..అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తాజా నియమావళి ప్రకారం

Advertisement

క్రీడారంగంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు క్రీడాసంఘాల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని, తమ సంఘాల కార్యకలాపాలను క్రీడాకారులే నిర్వహించుకోవాలి. తమ నిబంధనల్ని తూచతప్పక పాటించని క్రీడాసమాఖ్యలు, సంఘాలపైన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిషేధం విధిస్తూ వస్తోంది.

అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిబంధనలకు అనుగుణంగానే భారత ఒలింపిక్ సంఘం తన సరికొత్త కార్యవర్గం కోసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది.

పరుగుల రాణి ఎన్నిక ఏకగ్రీవం...

Advertisement

డిసెంబర్ 10న జరిగే భారత ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో చైర్మన్ తోపాటు, ఒక సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక కోశాధికారి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుల పదవులకు ఎన్నిక జరుగనుంది. మొత్తం 24మంది వివిధ పదవులకు పోటీలో ఉన్నారు. అయితే..

అధ్యక్షపదవికి పోటీలో కేవలం పరుగుల రాణి పీటీ ఉష మాత్రమే ఉండడంతో డిసెంబర్ 10 వరకూ వేచిచూడకుండా ఎన్నిక ఏకగ్రీవమైపోయింది.

దాంతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్తింపు తెచ్చుకొంది. అంతేకాదు.. 1934లో క్రికెటర్ మహారాజా యాదవీంద్ర సింగ్ తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి క్రీడాదిగ్గజంగా పీటీ ఉష ఘనత దక్కించుకోగలిగింది.

ఇదీ..పీటీ ఉష ఘనత...

1970-1980 దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా భారత ఖ్యాతిని నలుదిశలా విస్తరింప చేసిన పీటీ ఉష సాధించిన రికార్డులు, పతకాలు, విజయాలు అన్నీఇన్నీ కావు.

1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఉష.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో ఉష మెరిసిమురిసింది. ఒక్క ఆసియా క్రీడల్లోనే ఉష ఏకంగా 14 స్వర్ణాలతోపాటు మొత్తం 23 పతకాలు సాధించింది.

1964 జూన్ 27న కేరళలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన పీటీ ఉష 1976లో అథ్లెట్ గా తన కెరియర్ ప్రారంభించింది. కోచ్ నంబియార్ నేతృత్వంలో అంతర్జాతీయ అథ్లెట్ గా రూపుదిద్దుకొంది.

జూనియర్ ఇంటర్ స్టేట్ మీట్ లో తన తొలి పతకం సాధించిన ఉష ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. 1979, 1980 జాతీయ క్రీడల్లో అత్యుత్తమ అథ్లెట్ గా నిలిచింది.

2000 సంవత్సరంలో తన కెరియర్ ముగించిన ఉష తన పేరుతో ఓ అకాడెమీని నిర్వహిస్తూ వస్తోంది.

1985లో పద్మశ్రీ పురస్కారంతో పాటు పలు అత్యున్నత అవార్డులు, పురస్కారాలు అందుకొంది.

58 ఏళ్ల పీటీ ఉష ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర్రపతి కోటాలో ఉషను రాజ్యసభ సభ్యత్వం వరించింది.

పరుగుల రాణికి అభినందనల వెల్లువ!

భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష నేతృత్వంలో అథ్లెట్లు మరింత ఉన్నతి సాధించగలరని భావిస్తున్నారు. భారత అధ్లెట్ల బాగుకోసం ఉష పాటు పడగలరని, ఆమెకు అభినందనలు అంటూ కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్ రిజ్జూ ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు.

దేశంలోని అతిపెద్ద క్రీడాసమాఖ్య..భారత ఒలింపిక్ సంఘానికి పీటీ ఉష చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సరికొత్త చరిత్రకు నాందిగా నిలిచిపోతుంది.

Next Story