Telugu Global
Sports

ఉష, మేరీ..మీకిది తగునా?.. వస్తాదుల ధ్వజం!

భారత దిగ్గజ అథ్లెట్లు పీటీ ఉష, మేరీకోమ్ రాజకీయనాయకుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నరెజ్లర్లు మండిపడ్డారు.

ఉష, మేరీ..మీకిది తగునా?.. వస్తాదుల ధ్వజం!
X

ఉష, మేరీ..మీకిది తగునా?.. వస్తాదుల ధ్వజం!

భారత దిగ్గజ అథ్లెట్లు పీటీ ఉష, మేరీకోమ్ రాజకీయనాయకుల్లా వ్యవహరిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నరెజ్లర్లు మండిపడ్డారు..

భారత కుస్తీ సంఘం అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వినేశ్ పోగట్ తో సహా పలువురు అంతర్జాతీయ వస్తాదులు చేపట్టిన నిరసన దీక్షలు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్నాయి.

ఓ మైనర్ తో సహా మొత్తం ఏడుగురు మహిళా వస్తాదులను కుస్తీ సంఘం అధ్యక్షుడు బ్రజ్ భూషణ్ లైంగికంగా వేధించినట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. రెజ్లర్లు గతంలోనే కుస్తీ సంఘం అధ్యక్షుడిపై ఫిర్యాదులు చేస్తే..కేసు నమోదు చేయటానికి ఢిల్లీపోలీసులు మీనమేషాలు లెక్కపెడుతూ వచ్చారు.

దీంతో తమకు న్యాయం చేయాలంటూ రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో..విధిలేని పరిస్థితిలోనే ఢిల్లీపోలీసులు బ్రిజ్ భూషణ్ పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే..ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేసే వరకూ, తమకు న్యాయం జరిగే వరకూ నిరసన వీడేది లేదంటూ రెజ్లర్ల బృందం మొండి పట్టు పట్టింది.

క్రీడామంత్రి పైనా రెజ్లర్లు గరంగరం...

ఎండవాన, పగలురాత్రిలను లెక్కచేయకుండా న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తున్న వస్తాదులకు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, టెన్నిస్ మాజీ గ్రేట్ సానియా మీర్జాతో సహా పలువురు మద్దతు పలికారు.

మరోవైపు..భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, కేంద్రప్రభుత్వం నామినేషన్ పై రాజ్యసభ సభ్యురాలిగా పని చేస్తున్న పీటీ ఉష మాత్రం..రెజ్లర్ల నిరసనను తప్పుపట్టారు.

భారత్ పరువును అంతర్జాతీయంగా మంటగలుపుతున్నారని, క్రమశిక్షణ అనేది లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. దీంతో పీటీ ఉష పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

పీటీ ఉష అధ్యక్షురాలిగా ఓ విచారణ సంఘాన్ని కేంద్రక్రీడామంత్రిత్వశాఖ జనవరిలోనే నియమించింది. అయితే..ఇప్పటి వరకూ అతీగతి లేకుండా పోయింది.

తమ పోరాటాన్ని నీరు గార్చడం కోసమే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమాషా చేశారంటూ రెజ్లర్ల బృందం ప్రతినిధి, ఒలింపిక్ మెడలిస్ట్ భజరంగ్ పూనియా విమర్శించారు.

క్రీడాకారులా...రాజకీయనాయకులా?

అంతేకాదు..పీటీ ఉష, మేరీకోమ్..తాము క్రీడాదిగ్గజాలమన్న విషయాన్ని మర్చిపోయి రాజకీయనాయకుల్లా వ్యవహరిస్తున్నారంటూ మహిళా బాక్సర్లు వినేశ్ పోగట్, సాక్షి మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు.

తమను లైంగికంగా వేధించిన కుస్తీ సంఘం అధ్యక్షుడు, బీజెపీ ఎంపీని కాపాడటానికి ఉష, మేరీకోమ్ పాటుపడుతున్నారంటూ తప్పుపట్టారు. కేంద్రక్రీడామంత్రి నియమించిన విచారణ కమిటీలో సభ్యురాలిగా ఉన్న మేరీకోమ్ 2016-2022 వరకూ రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. భారత ఒలింపిక్ సంఘం అథ్లెట్ల కమిషన్ చైర్మన్ గా కూడా మేరీ కోమ్ పనిచేస్తున్నారు.

తమ పై లైంగిక వేధింపులకు కుస్తీ సంఘం అధ్యక్షుడు పాల్పడ్డారని బీజెపీ ఎంపి బ్రిజ్ భూషణ్ పై కేసు పెట్టినా..సాటి మహిళగా మేరీకోమ్ సానుకూలంగా స్పందించక పోడం మనోవేదన కలిగించిందని వినేశ్, సాక్షి మాలిక్ వాపోయారు.

మేరీకోమ్, పీటీ ఉషలను తమ బాల్యం నుంచి చూస్తూ పెరిగామని, స్ఫూర్తి పొందామని..అయితే..ఆ ఇద్దరూ ఇప్పుడు రాజకీయనాయకుల్లా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందని చెప్పారు.

రాజకీయ నాయకులకు తన తండ్రి, సోదరి, భార్య, స్నేహితులు, బంధువుల పట్ల ఏమాత్రం ప్రేమ, అభిమానం, విశ్వాసం ఉండవని తాను చిన్నతనం నుంచి తెలుసుకొంటూ వచ్చానని..ఇప్పడు పీటీ ఉష, మేరీ కోమ్ సైతం రాజకీయనాయకుల కోవలేక చేరిపోయారని ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ వివరించింది.న్యాయం జరిగే వరకూ పోరాటం...

తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం వీడేది లేదని, న్యాయం కోసం తమ కెరియర్ ను, జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధమని విఖ్యాత బాక్సర్ భజరంగ్ పూనియా ప్రకటించాడు.

అత్యంత బలవంతుడు,అధికార పార్టీ ముసుగులో ఉన్న కుస్తీ సంఘం అధ్యక్షుడితో పోరాటం అంతతేలికకాదని తమకు తెలుసునని..అయినా న్యాయం తమవైపే ఉందని చెప్పాడు.

జాతీయ కుస్తీ సంఘం అధ్యక్షపదవి నుంచి బ్రిజ్ భూషణ్ ను తప్పించి..అరెస్టు చేసే వరకూ తాము పోరాటం చేస్తూనే ఉంటామని, నిరసనబాట వీడేదే లేదంటూ తెగేసి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలంటూ వేడుకొన్నారు.

ఢిల్లీ పోలీసులు, కేంద్ర క్రీడామంత్రి, ప్రభుత్వం న్యాయం చేస్తాయన్న భ్రమల్లో తాము ఏమాత్రం లేమని, తమకు దేశసర్వోన్నత న్యాయస్థానం మాత్రమే తగిన న్యాయం చేస్తుందన్ననమ్మకం , విశ్వాసం ఉన్నాయని ప్రకటించారు.

Next Story