Telugu Global
Sports

భారత క్రికెట్లో ఓదార్పుల పర్వం!

ప్రపంచకప్ విజయోత్సవాలలో మునిగితేలాల్సిన భారత క్రికెట్లో ప్రస్తుతం ఓదార్పుల పర్వం కొనసాగుతోంది.

భారత క్రికెట్లో ఓదార్పుల పర్వం!
X

భారత క్రికెట్లో ఓదార్పుల పర్వం!

ప్రపంచకప్ విజయోత్సవాలలో మునిగితేలాల్సిన భారత క్రికెట్లో ప్రస్తుతం ఓదార్పుల పర్వం కొనసాగుతోంది. ఫైనల్లో ఓటమి పొందిన భారత జట్టు సభ్యులను ప్రధాని మోదీ నుంచి నెటిజనుల వరకూ తమదైన శైలిలో ఓదార్చుతున్నారు.

భారత్ వేదికగా గత ఆరు వారాలుగా సందడి సందడిగా సాగిన ప్రపంచకప్ ఆఖరి రోజున భారత్ ఓటమితో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ 10 వరుస విజయాలతో వీరవిహారం చేసిన భారత జట్టు..అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ సమరంలో మాత్రం పాలపొంగులా తేలిపోయింది.

దీంతో పుష్కరకాలం తర్వాత మరో ప్రపంచకప్ అందుకోవాలని కలలు గన్నరోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సభ్యులు మాత్రమే కాదు..దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులు నీరసపడిపోయారు. నిస్తేజంలోకి జారుకొన్నారు.

ప్రధాని మోదీ ఓదార్పు....

తన పేరుతో 1000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన స్టేడియంలో..తాను చూస్తుండగానే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ పరాజయం పొందటం, అభిమానులతో పాటు ఆటగాళ్లు సైతం డీలా పడిపోడం చూసిన ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో క్రికెట్ వీరులను ఓదార్చారు.

ఏకపక్షంగా సాగిన టైటిల్ సమరంలో భారత్ 6 వికెట్ల పరాజయం చవిచూసిన వెంటనే..స్టేడియంలోని లక్షమంది అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. ఇక భారత ఆటగాళ్ల సంగతైతే చెప్పాల్సిన పనేలేదు.

ప్రపంచకప్ లో తన వీరోచిత బ్యాటింగ్ తో జట్టును ముందుండి నడిపించడం ద్వారా 10 వరుస విజయాలు అందించిన కెప్టెన్ రోహిత్..ఫైనల్లో ఓటమితో చలించిపోయాడు. పొంగివస్తున్న కంటనీరును ఆపుకోలేకపోయాడు.

తన కెరియర్ లో తొలి ప్రపంచకప్ ఆడిన యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గ్రౌండ్లోనే బోరున విలపించాడు. సిరాజ్ ను ఓదార్చడానికి సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాతో పాటు విరాట్ కొహ్లీ సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఈ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ...భారత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ విరాట్ కొహ్లీలతో పాటు జట్టులోని ఇతర సభ్యులను ఓదార్చారు. గత నెలరోజులుగా జరిగిన మ్యాచ్ ల్లో చాలా గొప్పగా ఆడారని, జయాపజయాలు ఆటలో భాగమేనంటూ సాంత్వన కలిగించారు.

ప్రపంచకప్ కే అత్యుత్తమ బౌలర్ గా నిలిచిన మహ్మద్ షమీని అక్కున చేర్చుకొని, తన గుండెల మీద తలను ఉంచుకొని మరీ ప్రధాని ఓదార్చారు.

ఆనందమే లేని విరాట్ కొహ్లీ...

2023- వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకొన్న విరాట్ కొహ్లీ సైతం డీలా పడిపోయాడు. అత్యుత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకొన్న ఆనందం విరాట్ లో లేశమైన కనిపించలేదు. పోడియం దగ్గరకు యాంత్రికంగా వెళ్లి అవార్డును స్వీకరించాడు.

మరోవైపు..పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు సైతం భారతజట్టు సభ్యులను వీరులు, శూరులు, హీరోలంటూ సోషల్ మీడియా సందేశాలతో ఓదార్చారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ట్రోఫీ గెలవకపోయినా..కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకొందని, 10 కి 10 పాయింట్లు ఇస్తామంటూ కొనియాడారు.

భారతజట్టు సాధించిన విజయాలు ఎంతో..పరాజయమూ తమకు అంతేనంటూ ఓదార్పు పోస్టులు పెట్టారు.

తేరుకోడానికి సమయం పడుతుంది..ద్రావిడ్..

ప్రపంచకప్ కోసం గత మూడు మాసాలుగా చెమటోడ్చి..అంచనాలకు మించి రాణించిన భారత క్రికెటర్లు ఫైనల్ ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, సెమీఫైనల్స్ వరకూ వరుస విజయాలతో కేరింతలు కొట్టిన రోహిత్ సేన ఫైనల్ ఓటమి తరువాత నీరసపడిపోడాన్ని తాను చూడలేకపోతున్నానని..ఓటమి భారం నుంచి , నిరాశనిస్పృహల నుంచి వారు బయటపడటానికి కొద్దిరోజుల సమయం పడుతుందని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు.

ప్రస్తుత ప్రపంచకప్ ముగియడంతోనే భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు సైతం ముగిసింది. తన భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించలేదని ద్రావిడ్ ప్రకటించడం విశేషం.

First Published:  21 Nov 2023 3:10 AM GMT
Next Story