Telugu Global
Sports

జైషాది అనుభవరాహిత్యం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం

జై షా వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌ నుంచి పాకిస్తాన్ బహిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జైషాది అనుభవరాహిత్యం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం
X

బీసీసీఐ కార్యదర్శిగా పని చేయడానికి జై షాకు ఏమి అనుభవం ఉందని నిన్నటి వరకు దేశంలోని పలువురు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. కానీ, ఇవాళ ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఆ మాట అంటోంది. జై షాకు అనుభవం లేదని ఆయన మాటల్లోనే తెలుస్తున్నట్లు పేర్కొన్నది. ఇలా విమర్శించడానికి జై షా చేసిన ప్రకటనే కారణం. మంగళవారం బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం ముగిసిన తర్వాత ఆసియా కప్ గురించి జైషా ప్రకటన చేశారు. 2023లో పాకిస్తాన్ వేదికగా జరుగనున్న ఆసియా కప్‌లో ఇండియా పాల్గొనదని.. తటస్థ వేదికపై జరిపేందుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

జై షా వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌ నుంచి పాకిస్తాన్ బహిష్కరించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జై షా తీరుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి ఘాటుగా లేఖ రాయాలని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భావిస్తున్నారు. జై షా ఇలాంటి ప్రకటన చేయడం పాకిస్తాన్‌ను అవమానించడమే అనే భావనలో పీసీబీ ఉన్నది. అవసరం అయితే ఏసీసీ నుంచి బయటకు వచ్చేయాలనే ఆలోచన కూడా చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది జరగాల్సిన ఏసియా వన్డే కప్ నిర్వహణపై సందిగ్దత నెలకొన్నది.

బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌లో ఏసియా కప్ గురించి చర్చకు వస్తుందని భావించాము. కానీ వెంటనే జై షా ఇలాంటి ప్రకటన చేస్తారని అనుకోలేదని పీసీబీ అధికారి ఒకరు అన్నారు. పాకిస్తాన్ నుంచి ఆసియా కప్ వేదికను మారుస్తామని జై షా ఏ అధికారంతో అన్నారో తెలియడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఏసీసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఎప్పుడో ఆసియా కప్ నిర్వహణ అధికారాన్ని పీసీబీకి ఇచ్చింది. అంతే కానీ అధ్యక్షుడికి దీనితో ఎలాంటి సంబంధము లేదని ఆయన చెప్పారు. ఆసియా కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇలాంటి ప్రకటన చేయడంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో ఘాటుగానే స్పందించారు. జైషాలో అనుభవ రాహిత్యం కనిపిస్తోందని తప్పుబట్టారు. గత 12 నెలల నుంచి ఇరు వైపుల మంది వాతావరణ నెలకొని ఉన్నది. రెండు జట్లు క్రికెట్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు. కానీ వరల్డ్ కప్‌కు ముందు ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. ఇండియాలో క్రికెట్ నిర్వహణ అనుభవ రాహిత్యం జై షాలో కనిపిస్తున్నదని దుయ్యబట్టారు.

First Published:  19 Oct 2022 5:00 AM GMT
Next Story